
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రాఘవ్ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల్లో రాఘవ్ చద్దా ఒకరు. ఆయన బహిరంగ వేదికలపై పార్టీకి మద్దతుగా మాట్లాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు బ్రిటన్ వెళ్లారు. ఆ దరిమిలా ఆమ్ ఆద్మీ పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంది. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనిపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాఘవ్ చద్దా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను తనను కొట్టారని, సీఎం సభలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.
కాగా స్వాతి ఇదంతా బీజేపీ డైరెక్షన్‌లో చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. స్వాతి మలివాల్ సీఎం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, వారిని బెదిరించారని ఆప్ నేత అతిషి ఆరోపించారు.