భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా అటవీ ప్రాంతం ఉన్నా పులులు కన్పించకుండా పోయాయి. జాతీయ జంతువైన పులుల నివాసానికి జిల్లా అడవులు అనువైనవే అయినా... మనుగడ సాగడం లేదు. రెండేళ్లక్రితం ఓసారి జిల్లా అటవీ ప్రాంతంలో పులుల అడుగుజాడలు కనిపించాయి. కానీ ఆతర్వాత మళ్లీ జాడ లేదు.
జిల్లా అటవీ విస్తీర్ణం 4,33,446 హెక్టార్లు కాగా, ఇందులో కిన్నెరసాని అభయారణ్యం విస్తీర్ణం 634.4 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. అటవీప్రాంతంలో గుత్తికోయలు నివాసం ఏర్పాటుచేసుకోవడం, పోడు సాగుకు అడవులు నరికివేయడంతో పాటు రహదారుల నిర్మాణంతో పులుల మనుగడ కష్టమవుతోందనే భావన వ్యక్తమవుతోంది. శనివారం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో పులుల మనుగడ, రాకపోకలు, నివాసం ఏ ర్పాటుచేసుకోకపోవడానికి గల కారణాలపై కథనం.
గతంలో పులుల కదలికలు
2001 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు పులుల అడుగు జాడలను అధికారులు గుర్తించారు. ఇక 2005లో మూడు, 2008లో నాలు గు, 2011, 2012లో మూడేసి పులులు, 2013లో రెండు, 2014, 2015లో ఒక్కో పులి కనిపించినా ఆతర్వాతజాడలేదు. 2018లో చేపట్టిన పులుల గణనలో ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో ఎక్కడా పులిని గుర్తించలేకపోయారు.
వలన వచ్చినట్లే వచ్చి...
జిల్లా అడవుల్లోకి పులుల వలస వస్తున్నాయి. జిల్లా అటవీ ప్రాంతాని ఆనుకుని ఏపీలోనిపాపికొండలు, అటు ఛత్తీస్‌గఢ్, ఇటు ఏటురూనాగారం అటవీ ప్రాంతాలు ఉండటంతో పెద్దపులులు అతిథులుగా వచ్చివెళ్తున్నాయే తప్ప స్థావరం ఏర్పాటుచేసుకోవడం లేదు.
2020 నవంబర్, 2021 డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద పులులు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించాయి. ఇక్కడ కిన్నెరసాని అభయారణ్యం పెద్దపులులకు సంరక్షణగా అనువుగా ఉన్నా పులులు మాత్రం ఉండడం లేదు.
అనేక కారణాలు
పొరుగు రాష్ట్రాల నుంచి గోదావరి నది దాటి జిల్లా అటవీప్రాంతానికి పెద్దపులులు అప్పుడప్పుడు వస్తున్నా స్థిర స్థావరం ఏర్పాటుచేసుకోవడం లేదు. అటవీప్రాంతం ఉన్నా పులులకు కావాల్సిన శాఖాహా ర జంతువులైన జింకలు, దుప్పులు, సాంబార్ వంటి జంతువుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
దట్టమైన అటవీ ప్రాంతంలో గుత్తికోయ గుంపులు విస్తరించడం, అడవుల్లోనూ రహదారుల నిర్మాణం కూడా ఇంకో కారణం కావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పులి ఉండాలంటే..
జిల్లా అటవీ ప్రాంతంలో పులులు మనగడ కొనసాగించాలంటే వాటికి ఆహారమైన దుప్పులు, కణుజులు, సాంబారులు అధికంగా ఉండాలి. అవి అధికంగా ఉన్నచోట పెద్దపులి నివాసం ఉండే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా అటవీ ప్రాంతంలో జింకలు ఉన్నా ఎక్కువ లేవు, ఉన్నవాటిని అటవీ ప్రాంతంలోగుత్తికోయ గిరిజనులు మాయం చేస్తున్నారని ఫారెస్టు అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment