భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎన్నికల కదన రంగంలో కలిసి నడుస్తామని ఆయా పార్టీల అగ్రనాయకులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
సీట్లపైనే పేచీ
ఈ ఏడాది ఆరంభంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో అంటీముంటనట్టుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీకి ధీటుగా బదులిస్తున్న భారత రాష్ట్ర సమితితోనే ఎన్నికల్లో కలిసి నడుస్తామని నేరుగా ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇటు సీపీఐ, అటు సీపీఎం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కీలక సీట్ల కోసం పట్టుబట్టాయి.
ముఖ్యంగా కొత్తగూడెం, వైరా సీట్లను సీసీఐ.. పాలేరు, భద్రాచలం సీట్లను సీపీఎం కోరాయి. ఈ అంశంపై నాలుగైదు దఫాలుగా ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్షంగా దాదాపు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కమ్యూనిస్టులతో పొత్తు ప్రస్థావన అనేది లేకుండా పోయింది.
కాంగ్రెస్‌తో కలిసి..
ఎన్నికల పొత్తుపై మాట వరుసకై నా చెప్పకుండా బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడం కమ్యూనిస్టు పార్టీలకు మింగుడు పడలేదు. దీంతో అనివార్యంగా కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందించాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కమ్యూనిస్టు నేతలు ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపారు. పై స్థాయిలో చర్చలు జరుగుతుండటంతో పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్థానిక హస్తం నేతలు ప్రకటించారు.
అయితే పొత్తులపై ఎంతకీ స్పష్టత రావడం లేదు. మరోవైపు రోజులు గడుస్తున్న కొద్దీ ఆశావహులు సైతం తమ వంతు ప్రయత్నంగా టికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఏకై క జనరల్ స్థానంగా ఉన్న కొత్తగూడెం నుంచి హస్తం పార్టీ తరఫున పోటీ ఎక్కువగా ఉంది.
కొత్తగూడెంపై పట్టు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో జాతీయ స్థాయిలో పార్టీ పరంగా మంతనాలు సాగిస్తున్నారు. కొత్తగూడెంలో సీపీఐకి గతంలో ఎన్నడూ లేనంత అనుకూల పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటూ పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు.
కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన ఉంటే కొత్తగూడెం నుంచి సీపీఐ బరిలో ఉండాల్సిందేనని ఖరాఖండీగా చెబుతున్నారు. దీంతో కూనంనేని పట్టుదల కాంగ్రెస్ నేతల్లో కలవరపాటు కలిగిస్తోంది.
టికెట్‌పై ఆశతో..
కొత్తగూడెం సీటు నుంచి కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తాను పోటీ చేయబోయే స్థానాన్ని పార్టీ పెద్దలు నిర్ణయిస్తారంటూ పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు బీసీ వర్గాల నుంచి ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణ ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు నాగ సీతారామలు సైతం గడపగడపకూ తిరుగుతూనే ఢిల్లీ–కొత్తగూడెం మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఇలా నేతలంతా పోటీ కోసం రాత్రీ పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు.
హస్తం ఉండాల్సిందే
కొత్తగూడెం సీటును కమ్యూనిస్టులకు కేటాయించారంటూ జోరుగా ప్రచారం జరగడం కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో ఎవరికి వారు తమ గాడ్‌ఫాదర్లకు ఫోన్లు చేసి పొత్తుల చిక్కులపై వాకబు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు పొత్తు కారణంగా అన్యాయం జరగకుండా చూడాలంటూ విన్నవించుకున్నారు. పొత్తు విషయంలో ముందుగానే ఓ స్పష్టత ఇస్తే బాగుండేదని, ఎంతకీ తేల్చక పోవడం వల్ల తాము ఈ సీటుపై నమ్మకం పెట్టకుని పని చేస్తున్నామని టికెట్ ఆశిస్తున్న నేతలు అంటున్నారు.
ఇదే సమయంలో పార్టీ హై కమాండ్‌కు ఎదురు సమాధానం చెబితే అసలుకే ఎసరు వస్తుందనే భయం కూడా లేకపోలేదు. దీంతో నేరుగా నేతలు బటయకు రాకుండా తమ అనుచరులు, మద్దతుదారులతో ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో ఉంటుందంటూ ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ఉండాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment