Telangana News: భద్రాద్రి రామయ్య భక్తులకు.. రైల్వేశాఖ తీపి కబురు!
Sakshi News home page

భద్రాద్రి రామయ్య భక్తులకు.. రైల్వేశాఖ తీపి కబురు!

Published Thu, Sep 7 2023 12:08 AM | Last Updated on Thu, Sep 7 2023 2:10 PM

- - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య భక్తులకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. రామయ్య చెంతకు రైలు సౌకర్యం కల్పించే భద్రాచలం – మల్కన్‌గిరి (ఒడిశా) మార్గం నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుమార్గం నిర్మాణానికి ఫైనల్‌ లోకేషన్‌ సర్వేను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నల్గొండ జిల్లాలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు సింగరేణి బొగ్గును మరింత వేగంగా వ్యాగన్ల ద్వారా సరఫరా చేసే లక్ష్యంతో డోర్నకల్‌ – మిర్యాలగూడ రైల్వై లైన్‌కు రైల్వే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మార్గానికి కూడా ఫైనల్‌ లొకేషన్‌ సర్వేను మంజూరు చేసింది. ఈ లైన్‌ అందుబాటులోకి వస్తే బొగ్గు రవాణాలో డోర్నకల్‌ – భద్రాచలంరోడ్‌ బ్రాంచ్‌లైన్‌ మరింత కీలకంగా మారుతుంది.

కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ఐరన్‌ ఓర్‌ గనులకు కేంద్రమైన కిరోండల్‌ వరకు కొత్త రైలు మార్గం నిర్మాణానికి ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. కొత్తగూడెం – కిరోండల్‌ మధ్య దూరం కేవలం 180 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం కిరోండల్‌కు విశాఖపట్నం నుంచి మాత్రమే రైలుమార్గం అందుబాటులో ఉంది. ఈ మార్గం నిడివి 440 కి.మీ. దీంతో దగ్గరి దారిగా కొత్తగూడెం నుంచి కిరండోల్‌కు రైలుమార్గాన్ని నిర్మిస్తామంటూ 2014 – 15 సంవత్సర బడ్జెట్‌లో రైల్వేశాఖ ప్రకటించింది.

సర్వే కోసం కేవలం రూ.10 లక్షలు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ప్రాథమిక సర్వేను 2018 బడ్జెట్‌లో మంజూరు చేసింది. తాజాగా ఫైనల్‌ సర్వే రిపోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. భద్రాలచం – మల్కన్‌గిరి రైల్వేలైన్‌ తెలంగాణ – ఆంధ్రా మీదుగా ఒడిశాకు వెళ్తుండగా కొత్తగూడెం – కిరోండల్‌ మార్గం తెలంగాణ మీదుగా నేరుగా ఛత్తీస్‌గఢ్‌ వెళ్లేలా నిర్మించే అవకాశం ఉంది.

ప్రాథమిక సర్వేకు ఏడాది..
దట్టమైన ఏజెన్సీ ప్రాంతాలైన తెలంగాణలోని భద్రాచలం (పాండురంగాపురం రైల్వేస్టేషన్‌) నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరిని కలుపుతూ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి రైల్వేశాఖ 2021లో పచ్చజెండా ఊపింది. ఈ రెండు పట్టణాల మధ్య 173 కిలోమీటర్ల మేర లైన్‌ నిర్మించేందుకు ప్రాథమిక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3 కోట్లు కేటాయించింది. ఏడాది పాటు జరిగిన ప్రాథమిక సర్వే రిపోర్ట్‌ 2022 జూన్‌లో వచ్చింది.

ఇందులో ఒడిశాలోని మల్కన్‌గిరిలో బయలుదేరితే.. బదాలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి స్టేషన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కన్నాపురం, కూటుగుట్ట, పల్లు, నందిగామ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో భద్రాచలం, పాండురంగాపురంలో స్టేషన్లు నిర్మించాలని సర్వేలో పేర్కొన్నారు. ఈ రైలు మార్గం దారిలో గోదావరి, శబరితో పాటు చిన్నా పెద్దా కలిపి 213 వంతెనలు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,592 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ లైన్‌కు సంబంధించి ప్రాథమిక రిపోర్టు వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి ఈ రైల్వేలైన్‌ నిర్మాణంపై ఉలుకూపలుకు లేదు. దీంతో భద్రాచలంరోడ్‌ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి, మణుగూరు – రామగుండం రైల్వేలైన్ల తరహాలో ఇది కూడా సర్వేలకే పరిమితం అవుతుందనే భావన జిల్లా వాసుల్లో ఏర్పడింది.

ఫైనల్‌ లొకేషన్‌ సర్వే..
దేశవ్యాప్తంగా ప్రాథమిక సర్వే రిపోర్టులను పరిశీలించిన రైల్వేశాఖ అందులో ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఏ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఒకసారి ఫలానా రైల్వే లైన్‌ నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్‌ కేటాయింపునకు ముందు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) చేపడుతుంది. ఈ సర్వేలో మరింత స్పష్టంగా వివరాలు సేకరిస్తుంది.

అందులో రైలుమార్గం వెళ్లే దారిలో వర్షాల ప్రభావం, వరద, కాంటూరు లెవల్స్‌, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి ఎలాంటి డిజైన్‌ ఉపయోగించాలి, నిర్మాణ ప్రదేశాలకు మ్యాన్‌ పవర్‌ను ఎలా పంపాలి, వారికి ఎక్కడ బస ఏర్పాటు చేయాలి, నిర్మాణ సామగ్రిని చేరవేయడం ఎలా అనే ప్రతీ అంశంలో క్షుణ్ణంగా వివరాలు సేకరించి రిపోర్ట్‌ తయారు చేస్తారు. దీని ఆధారంగా మొత్తం పనిని పలు బిట్లుగా విభజించి నిధులు మంజూరు చేస్తారు.

రెండేళ్లలో పనులు..
రైల్వే లైన్‌ నిర్మించే మార్గంలో ఉండే భౌగోళిక అననుకూలతలను బట్టి ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు ఎంత సమయం పడుతుందనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏడాదిలోగానే రైల్వేశాఖ ఫైనల్‌ సర్వేను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ఫైల్‌ రైల్వే బోర్డుకు చేరుతుంది.

అక్కడ ఆర్థిక పరమైన మదింపు తర్వాత నిధులు కేటాయిస్తారు. ప్రస్తుత రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఒడిశాకు చెందినవారు కావడంతో మల్కన్‌గిరి – భద్రాచలం రైల్వే లైన్‌ నిర్మాణ పనుల్లో పురోగతి వేగంగా సాగుతోంది. ఇదే స్పీడ్‌ కొనసాగితే మరో రెండేళ్లలో ఈ రైలుమార్గం నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే భద్రాచలం నుంచి దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు కొత్త రైళ్లను ప్రారంభించే అవకాశం కలుగుతుంది. ఫలితంగా జిల్లా వాసులకు రైలు ప్రయాణ సౌకర్యం మరింత విస్తృతం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement