మంత్రి సత్యవతి,ఎంపీలు వద్దిరాజు,కవితతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్తున్న ఇల్లెందు అసమ్మతి నేతలు
భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులు, టికెట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అంతా ‘చలో హైదరాబాద్’ అంటున్నారు. ఇప్పటికే కొందరు రాజధానిలో మకాం వేయగా.. మరికొందరు నేడు, రేపు హైదరాబాద్ బాట పట్టనున్నారు.
చల్లారని ఇల్లెందు సెగ..
ఇల్లెందు నియోజవకర్గంలో బీఆర్‌ఎస్‌లో చెలరేగిన అసమ్మతి ఎంతకీ చల్లారడం లేదు. రెండు వారాల క్రితం మంత్రి హరీశ్‌రావుకు తమ ఇబ్బందులు చెప్పుకున్న అసమ్మతి వర్గం నేతలు గురువారం హైదరాబాద్ వెళ్లి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ, పార్టీ అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, కృష్ణప్రసాద్, మధుకర్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు.
సుమారు రెండు గంటల పాటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అసమ్మతి నేతలు చెప్పిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నుంచి వచ్చే ఏ ఆదేశాలనైనా పాటించేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు.
సోమవారం తొలి జాబితా..
కమలం పార్టీకి సంబంధించి ఇల్లెందు నుంచి ఊకె అబ్బయ్య, భద్రాచలం నుంచి కుంజా సత్యవతి వంటి మాజీ ఎమ్మెల్యేలు ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొత్తగూడెం నుంచి పోటీకి రంగాకిరణ్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పినపాక నుంచి కేంద్ర సర్వీసులకు చెందిన కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా బీజేపీ మొదటి జాబితా వచ్చే సోమవారం వెలువడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.
‘గులాబీ’ అభ్యర్థుల పయనం..
అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. గత నెల రోజులుగా వీరంతా నియోజకవర్గాల స్థాయిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదితర అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. అయితే ఎన్నికలు సమీపించిన వేళ ఇల్లెందు, అశ్వారావుపేటలో అసమ్మతి చెలరేగడం అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
ఈనెల 15న హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ సమావేశం జరగనుంది. టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు ఆ సమావేశంలోనే బీ ఫామ్‌లు ఇస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, రేగాకాంతారావు, హరిప్రియనాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు నేడు, రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు.
ఢిల్లీ టు హైదరాబాద్..
కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు అంశం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఆశావహులంతా గత పది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు టికెట్ల కేటాయింపు కోసం నియమించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జోరుగా సాగాయి. దీంతో ఆశావహులు తమకు సానుకూలంగా ఉన్న అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడే మకాం వేశారు.
లంబాడా సామాజిక వర్గానికే ఇల్లెందు టికెట్ ఇవ్వాలంటూ ఆజ్మీరా శంకర్‌నాయక్, ప్రవీణ్ నాయక్, రామచంద్రునాయక్ తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక కొత్తగూడెం టికెట్ బీసీలకే ఇవ్వాలంటూ ‘గూడెం’ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
గుర్రుగా ఉన్న పొదెం..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వామపక్షాలకు పొత్తు కుదిరితే భద్రాచలం అసెంబ్లీ స్థానం సీపీఎంకు కేటాయిస్తారనే ప్రచారం విపరీతంగా జరగడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆమీతుమీ తేల్చుకునేందుకు భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పొత్తులో ఇతర పార్టీకి టికెట్ కేటాయించడమేంటని ఆయన పార్టీ పెద్దలను నేరుగా ప్రశ్నిస్తున్నారు.
ఒక వేళ పొత్తుల్లో భద్రాచలం స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైతే పినపాక నుంచి పోటీ చేయాలని పొదెం వీరయ్యకు కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే భద్రాచలం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకుంటే ములుగు నుంచి పోటీకి సిద్ధమని ఆయన పార్టీ పెద్దలకు కబురు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం, ములుగు తప్ప మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని పొదెం వీరయ్య కుండబద్ధలు కొట్టినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment