
మైసూరు: ఇటీవల బాలున్ని చంపి తిన్న పులిని అటవీ శాఖాధికారులు పట్టుకోగలిగారు. హెచ్‌డీ కోటె తాలూకా కల్లహట్టి గ్రామంలో రైతు కృష్ణనాయక, మాదేవీబాయి దంపతుల కుమారుడు చరణ్ నాయక్ (9)ను తీసుకుని సెప్టెంబర్ 4న పొలానికి వెళ్లారు, అప్పుడు పులి బాలున్ని ఎత్తుకెళ్లి చంపి తినింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
పులిని వెంటనే పట్టుకోవాలని ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం కూడా పులిని బంధించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో దసరా వేడుకల కోసం మైసూరుకు వచ్చిన గజ బృందంలోని అర్జున్ ఏనుగు ద్వారా పులి కోసం అడవుల్లో అన్వేషణ సాగించారు. సుమారు 16 రోజులపాటు అన్వేషణ సాగించినా ఫలితం దక్కలేదు. దీంతో అర్జున్ ఏనుగు వెనక్కి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో డ్రోన్ ద్వారా వెతుకులాట చేయగా, పులి కదలికలు కనిపించాయి. ఆ కదలికల ఆధారంగా పులి తరచూ తిరిగే స్థలాలను ఊహించారు. మంగళవారం రాత్రి కల్లటి గ్రామానికి చెందిన తావరే నాయక అనే వ్యక్తి పొలం వద్ద బోనును ఉంచగా పులి అందులోకి చిక్కింది. తరువాత పులిని నాగరహోలె అడవికి తరలించారు.