అడుగు జాడలను పరిశీలించిన డీఎఫ్‌ఓ.. పులి కోసం కొనసాగుతున్న అన్వేషణ
మంగపేట: కొద్దిరోజులుగా ములుగు జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. తాజాగా తాడ్వాయి మండలం పంబాపూర్ అటవీ ప్రాంతం నార్త్ బీటు పరిధిలో సంచరించినట్లు అటవీశాఖ మంగపేట రేంజ్ అధికారి అశోక్ తెలిపారు. పంబాపూర్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తి పులి గాండ్రింపులు వినిపించాయని చెప్పడంతో తాడ్వాయి రేంజ్ అధికారి సత్తయ్యతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పులి జాడ కోసం గాలించారు.
పంబాపూర్ అటవీ ప్రాంతంలోని వట్టివాగు సమీపం వరకు వెళ్లిన పులి, తిరిగి వెనక్కి వచి్చనట్లు ఆనవాళ్లను గుర్తించారు. అది మంగపేట మండలం కొత్తూరు మొట్లగూడెం లేదా మల్లూరువాగు ప్రాజెక్టు అటవీ ప్రాంతానికి లేదా కాటాపురం, గంగారం మీదుగా లవ్వాల అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
పాదముద్రల సేకరణ
ములుగు జిల్లా మంగపేట మండల పరిధి చుంచుపల్లి, తిమ్మాపురం అటవీ ప్రాంతంలో రెండు రోజుల నుంచి పెద్ద పులి సంచరించిన ప్రాంతాన్ని జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) రాహుల్ కిషన్‌జాదవ్ గురువారం సందర్శించారు.
చుంచుపల్లి, పాలాయిగూడెం గ్రామాల మధ్య గోదావరి నదిని దాటివచ్చిన ప్రాంతంలో పులి పాదముద్రలను పరిశీలించారు. అనంతరం తిమ్మాపురం అటవీ ప్రాంతంలోని చౌడొర్రె వద్ద పులి పాద ముద్రలను పీఓపీ విధానం ద్వారా సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment