
పులి మనకు ఎదురొచ్చినా.. మనం పులికి ఎదురెళ్లినా.. ‘పోయేది’ మనమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఒకవేళ మన టైం బాగోక పులిని మనం చూసినా లేదా అది మనల్ని చూసినా ఏం చేయాలి?. సింపుల్..

మీరు పులిని చూశారు.. అది మిమ్మల్ని చూడలేదు. అలాంటప్పుడు ఎక్కడున్నారో అక్కడే కదలకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. శ్వాస వేగంగా తీసుకోకూడదు. చెప్పడం ఈజీగానీ.. పులిని చూశాక.. ఎవరైనా గాబరా పడటం సహజం, అయితే.. ఇక్కడ మీరు ఎంత కామ్‌గా ఉంటారన్న దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది.

పులి వెళ్లేంతవరకూ ఆగండి. వెళ్లాక.. అది వెళ్లిన దిశకు వ్యతిరేక దిశలో వెంటనే వెళ్లిపోండి. ఇక్కడ తప్పించుకుపోవడం ఒక్కటే మీ లక్ష్యంగా ఉండాలి. అంతే తప్ప.. ఏదైనా కొత్తగా చేసి హీరోయిజం చూపిద్దాం అనుకుంటే.. అడవిలో అదే హీరో అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోండి.

ఈసారి పులే మిమ్మల్ని చూసింది. మొట్టమొదట చేయకూడని పని పరుగెత్తడం. మీరు ఉసేన్ బోల్ట్ కాదు.. అదైతే కన్ఫర్మ్. పైగా వెంటాడుతూ.. వేటాడటంలో పులులు స్పెషలిస్టులు. అందుకే అలా చేయొద్దు.. ఒకవేళ మీరు కూర్చునే పొజిషన్‌లో ఉంటే.. ముందుగా లేచి నిల్చొండి. ఎందుకంటే.. పులులు సాధారణంగా జింకల్లాంటి వాటిపై వెనుక నుంచి దాడి చేస్తాయి.. ముఖ్యంగా అవి కూర్చునే పొజిషన్‌లో ఉన్నప్పుడు వేటాడతాయి. పైగా.. అవి తాము వేటాడే జంతువులకు, మనుషులకు మధ్య తేడాను గుర్తించలేవు. అందుకే లేచి నిల్చోవడం ద్వారా మీరు పులి వేటాడే జంతువు కాదన్న విషయాన్ని తెలియజేయాలి. గతంలో కూడా మన దేశంలో అడవుల్లో వంగి.. కట్టెలు ఏరుకుంటున్న వారు లేదా వంగి పనిచేసుకుంటున్న మనుషులపై వెనుక నుంచే అత్యధిక శాతం పులి దాడులు జరిగాయి.

లేచి నిల్చున్నారు సరే.. తర్వాతేం చేయాలి? పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి.. దాన్ని అడిగి కాదు.. దాన్ని గమనించడం ద్వారా.. సాధారణంగా పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉంటే.. అది ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది.. మీ మీదే దృష్టి పెడుతుంది.. కాళ్లను వంచుతుంది.. దాని చెవులు ఇలా వెనక్కి వెళ్లినట్లుగా అవుతాయి. ఆగ్రహంగా గాండ్రించి.. ముందుకు దూకుతుంది.

ఆగండాగండి.. ఇక్కడో విషయం చెప్పాలి. కుక్కల చెవులు కూడా వెనక్కి వెళ్తాయి మనపట్ల స్నేహభావంతో.. ఇక్కడ కూడా చెవులు వెనక్కి వెళ్లాయి కదా.. ఫ్రెండే అని అనుకోకండి.. బాలయ్య బాబు ఏదో సినిమాలో చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ అని తెలుసుకోండి. పులి చెవులు వెనక్కి వెళ్లాయంటే.. అది వార్నింగ్ కిందే లెక్క.. నువ్వక్కడ ఉండటం దానికి ఇష్టం లేదన్నమాట.

ఉన్నచోట ఉన్నట్లే ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ.. వెళ్లండి. వీపు చూపొద్దు. చూపితే వెంటనే దాడి తప్పదు. గతంలో మధ్యప్రదేశ్‌లోని భాందవ్‌గఢ్ నేషనల్ పార్కులో మూడు పులులు రావడంతో ఓ ఏనుగు భయపడి.. మావటిని కిందన పడేసి వెళ్లిపోయింది. దాంతో ఆ మావటి వెనక్కి తిరిగి పరిగెట్టకుండా.. ఇలాగే ఒక్కో అడుగూ నెమ్మదిగా వెనక్కి వేసుకుంటూ.. రెండు గంటల తర్వాత ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాడట!

ఒకవేళ దగ్గర్లో చెట్టు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది. మీకు చెట్లెక్కడం బాగా వస్తే.. వెంటనే ఎక్కేయండి. కనీసం 15 అడుగుల ఎత్తు ఎక్కేదాకా ఆగొద్దు. చాన్స్ ఉంటే ఇంకా పైకి ఎక్కండి. మీకు వేగంగా చెట్లు ఎక్కగలిగే సామర్థ్యం ఉంటేనే ట్రై చేయండి. లేకపోతే వద్దు. పులులు 15 అడుగుల ఎత్తు దాకా ఎగరగలవు. పులులు చెట్లెక్కడంలో స్పెషలిస్టులు కావు.

ఒకవేళ దగ్గర్లో చెరువు ఉంది..పులి కొంచెం దూరంగా ఉంది.. అయినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలో దూకొద్దు.. మీకు ఒలింపిక్స్‌లో గోల్డ్ వచ్చి ఉంటే మాత్రం దూకండి. ఎందుకంటే.. పులులు మనకన్నా బాగా ఈదగలవు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. బాగా సౌండ్ చేయగల మెటల్ వస్తువులు ఉంటే.. హోరెత్తించేయండి. చేతిలో ఏం లేదు.. పులి దాడి చేయడానికి వస్తుంటే.. అప్పుడు చాలా గట్టిగా అరవండి. ఎంతలా అంటే.. దాని చెవులకు చిల్లులు పడేలా.. ఇలాంటి టైంలో అది కన్ఫ్యూజ్ అవుతుంది.

అన్ని ఆప్షన్లు అయిపోయాయి.. ఇక చేసేదేమీ లేదంటే మాత్రం పోరాడాల్సిందే. దగ్గర్లో ఏది దొరికితే.. అది పట్టుకోండి. రాయి, కర్ర ఏదైనా సరే. పులి శరీరంలో కళ్లు, ముక్కు బలహీన ప్రదేశాలు. అక్కడే బలంగా దాడి చేయాలి. పులి బలం దాని పంజా, కోరలు.. వాటి నుంచే తప్పించుకోవాలి. అది దాడి చేయడానికి వచి్చనప్పుడు పులికి ఎంత దగ్గరగా అయితే.. అంత దగ్గరగా ఉండి పోరాడాలి. దాని పీకను పట్టుకొని.. గట్టిగా హత్తుకోవాలి. ధృతరాష్ట్ర కౌగిలిలాగ.. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకూడదు.

గట్టిగా అదిమి పట్టుకుంటే.. అది ఆశ్చర్యపోతుంది. పులులు సాధారణంగా దాన్ని ఇష్టపడవు. అవి ప్రేమలో ఉన్నప్పుడు లేదా వేరే పులులతో పోరాడుతున్నప్పుడు కూడా బాగా దగ్గరగా అలముకున్నట్లు ఉండవు. మెడ జాగ్రత్త. పులికి దొరికితే అంతే. పోరాడుతున్నంత సేపు.. గట్టిగా అరుస్తూనే ఉండాలి. పులులు సాధారణంగా పోరాటాలను ఇష్టపడవు. కానీ అది పోరాటానికి దిగిందంటే మాత్రం చంపడానికే దిగుతుంది. అది తప్పించుకోవాలని అనుకుంటేనో.. లేదా మనం చేసిన ఏ పనితోనైనా అది ఆశ్చర్యపోతేనో తప్ప!









