పెద్దపులులకు పుట్టినిల్లు భారతదేశం
ప్రపంచంలోని పులుల్లో 75శాతం మనదేశంలోనే...
నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం
అడవిలో పెద్దపులి... ఉంటే ఆ ప్రాంతమంతా వృక్ష సంపద, పచ్చదనం, వన్యప్రాణులతో పరిఢవిల్లుతుంది. వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. అందువల్ల అంతరించిపోతున్న పెద్దపులులను సంరక్షించేందుకు పర్యావరణవేత్తలు, ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2006లో 1,411 పులులు ఉండగా, 2023లో ఆ సంఖ్య 3,682కు చేరినట్లు ‘ప్రాజెక్ట్ టైగర్’ ప్రారంభించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రపంచంలోని పులుల్లో 75శాతం మన దేశంలోనే ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలోనూ పులుల సంతతి సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. కొత్త ప్రాంతాల్లోనూ పులులు సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
దేశంలో పులుల సంతతి పెరుగుదల ఇలా..
2006 - 1,411
2010 - 1,706
2014 - 2,226
2018 - 2,967
2022 - 3,167
2023 - 3,682
సాక్షి నెట్‌వర్క్: ఒకప్పుడు పులులకు భారతదేశం పుట్టినిల్లు. అటువంటిది వివిధ కారణాల వల్ల పులుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. దానివల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోంది. ఈ క్రమంలో పులులను కాపాడుకోవడంతోపాటు వాటి సంతతిని పెంచాల్సిన ఆవశ్యకతను పర్యావరణవేత్తలు, పాలకులు గుర్తించారు. ఇందులో భాగంగా మన దేశంలో 1972లోనే వైల్డ్ లైఫ్ యాక్ట్ చేశారు. అప్పటి నుంచి పులుల వేటను నిషేధించారు. దానికి కొనసాగింపుగా అంతరించిపోతున్న పులులను కాపాడుకునేందుకు 1973లో ‘ఆపరేషన్ టైగర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పులులను పరిరక్షించాలనే లక్ష్యంతో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 2010 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ టైగర్ సమ్మిట్‌లో జూలై 29వ తేదీని ‘ప్రపంచ పులుల దినోత్సవం’ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఏటా జూలై 29వ తేదీన ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పులుల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆంధ్రాలో 75 పెద్దపులులు
రాష్ట్రంలో కూడా పెద్ద పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కింద పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం 2007లో ప్రకటించిన ప్రకారం ఆంధ్రాలోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల అటవీ ప్రాంతాలు టైగర్ రిజర్వ్ జోన్‌లో ఉన్నాయి. కడప, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం రిజర్వు, గోదావరి జిల్లాల్లోని పాపికొండలు ప్రాంతంలోనూ పులుల జాడ కనిపించింది. మన రాష్ట్రంలో 2014లో 40 పులులు ఉండగా, 2023 నాటికి 75కు పెరిగాయి.
పులులు ఎక్కువగా ఉన్న మూడు రాష్ట్రాలు
మధ్యప్రదేశ్ 785
కర్ణాటక 563
ఉత్తరాఖండ్ 560
ఆంధ్రాలో పులులు ఎక్కడ ఉన్నాయంటే...
నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ 64
శేషాచలం అటవీప్రాంతం 9
పాపికొండలు 2
Comments
Please login to add a commentAdd a comment