TSRTC launches Hyderabad on Wheels bus Tiger photo exhibition - Sakshi
Sakshi News home page

టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమం.. దేశంలోనే తొలిసారిగా..

Published Sat, Jun 10 2023 12:09 PM | Last Updated on Sat, Jun 10 2023 2:37 PM

TSRTC: Photo Exhibition On The Bus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవ వైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌' బస్సులో టైగర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్‌ టైగర్‌' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది.

హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను ప్రజలకు వివరించనుంది. ఈ ఎగ్జిబిషన్‌లో ఐసీబీఎం-స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ డీన్‌(అకడమిక్స్‌), వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ప్రొఫెసర్‌ జితేందర్‌ గొవిందాని తీసిన పులుల ఫొటోలను టీఎస్‌ఆర్టీసీ ప్రదర్శిస్తోంది. 

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ ప్రాంగణంలో శుక్రవారం  'హైదరాబాద్‌ ఆన్ వీల్స్' బస్సులో టైగ‌ర్ ఫొటో ఎగ్జిబిష‌న్ ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(పీసీసీఎఫ్) రాకేశ్ మోహన్ డోబ్రియాల్, ఐఎఫ్ఎస్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రారంభించారు. అనంతరం ఇండియన్ ఫోటో ఫెస్టివల్(ఐపీఎఫ్), ఐసీబీఎం-స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ సహకారంతో టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌లోని పులుల ఫొటోలు అద్బుతంగా ఉన్నాయని కొనియాడారు.

రాకేశ్ మోహన్ డోబ్రియాల్ మాట్లాడుతూ.. పులుల సంర‌క్ష‌ణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి టీఎస్ఆర్టీసీ బస్సులో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ అటవీ శాఖ కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని పులుల సంర‌క్ష‌ణకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. రెండు టైగర్ రిజర్వ్ లలో దాదాపు 30 పులులు ఉన్నాయని చెప్పారు.

పులులు అడవుల్లో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, పులుల ఆవాసాలు ఉన్న చోట మంచి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. తమ ఆధీన ప్రాంతంలో ఉండే అన్ని జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవి తోడ్పాడుతాయని వివరించారు. పులులను కాపాడటమంటే అడవులను, వాటిలోని జీవరాశిని, జీవవైవిద్యాన్ని రక్షించడమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. 

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పులులను సంరక్షిస్తే పర్యావరణాన్ని సంరక్షించినట్లే అని ఆయన చెప్పారు. పులుల‌ను సంర‌క్షణ‌పై ప్ర‌జ‌ల‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు వారిని భాగ‌స్వామ్యం చేయాల‌నే ఉద్దేశ్యంతోనే ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఆర్గనైజేషన్‌ తో కలిసి టీఎస్‌ఆర్టీసీ 'హైదరాబాద్‌ ఆన్ వీల్స్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఫోటోగ్రఫీ చాలా ప్రభావవంతమైన మీడియా అని.. ఫోటోస్, విజువల్స్ ద్వారా సమాజం ప్రభావితం అయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు.

మాటల ద్వారా వ్యక్తికరించలేని భావాలను ఫోటోలు చెప్తాయని వివరించారు. ఈ ఫొటో గ్ర‌ఫీ ప్రాముఖ్య‌త‌ను వివ‌రించేందుకు ప్ర‌త్యేక బ‌స్సును ఏర్పాటు చేసిన దేశంలోనే మొద‌టి ప్రజా రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అని తెలిపారు. 'ప్రాజెక్ట్‌ టైగర్‌' 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా 'హైదరాబాద్‌ ఆన్ వీల్స్'లో టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించామని చెప్పారు. అడవుల్లోకి వెళ్లలేని వారు ఈ ఎగ్జిబిషన్ లోని పులుల ఫోటోలను చూసి మంచి అనుభూతుని పొందవచ్చని అన్నారు. హైదరాబాద్ లోని జనసమర్థ ప్రాంతాల్లో హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సు తిరుగుతుందని, ప్రజలందరూ ఈ ఫోటోలను వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తోన్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. పర్యవరణహితం కోసం టీఎస్ఆర్టీసీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్ట ప్లాన్ చేస్తోందని వివరించారు.

హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌ బస్సులో టైగర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఐపీఎఫ్ వ్యవస్థాపకుడు ఆక్విన్‌ మాథ్యూస్‌ అన్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంతో కష్టంతో కూడుకున్నదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులులపై అవగాహన కల్పించాలని నిర్ణయించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారిని ఈ సందర్భంగా అభినందించారు.
చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ

దాదాపు 13 ఏళ్లుగా ఎంతో కష్టపడి తీసిన తన ఫొటోలను హైదరాబాద్ ఆన్ వీల్స్ బస్సులో ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఐసీబీఎం-స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ డీన్‌(అకడమిక్స్‌), వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ప్రొఫెసర్‌ జితేందర్‌ గొవిందాని అన్నారు. అడవుల్లో ఒక్కో పులి ఫొటో తీయడానికి రెండు మూడు నెలలు కష్టపడాల్సి వచ్చిందని వివరించారు. యువతకు పులుల సంరక్షణపై అవగాహన లేదని, వారికి పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ సైదులు,  ఐపీఎఫ్‌ ప్రతినిధురాలు తరుషా సక్సేనా, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement