చంపై సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నిర్ణయం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా .. చంపై సోరెన్ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. చంపై.. హేమంత్ సోరెన్‌కు దగ్గరి బంధువని చెబుతారు. చంపై ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది. చంపై సోరెన్ ‘జార్ఖండ్ టైగర్’గా పేరొందారు.
చంపై సోరెన్ జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంపై క్యాబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు,షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై కూడా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు చంపైని ‘జార్ఖండ్ టైగర్’ అని పిలవడం ప్రారంభించారు.
చంపై 2005లో తొలిసారిగా జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. సెప్టెంబర్ 2010 నుండి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంపై.. జూలై 2013 నుండి డిసెంబర్ 2014 వరకు ఆహార, పౌర సరఫరాలు, రవాణా కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.
2014లో జార్ఖండ్ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీనితో పాటు హేమంత్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అక్రమ భూ కుంభకోణం కేసులో చిక్కుకున్న హేమంత్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కాంగ్రెస్ కూటమి సోరెన్ ప్రభుత్వంలో శాసనసభా పక్ష నేతగా రవాణా మంత్రి చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి. హేమంత్ సోరెన్‌కు చంపై అత్యంత సన్నిహితుడని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment