సోరెస్‌ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌ బంద్‌! | Jharkhand Band Against Hemant Soren Arrest | Sakshi
Sakshi News home page

Jharkhand Band: సోరెస్‌ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌ బంద్‌!

Published Thu, Feb 1 2024 9:47 AM | Last Updated on Thu, Feb 1 2024 10:24 AM

Jharkhand Band Against Hemant Soren Arrest - Sakshi

బీహార్ తర్వాత జార్ఖండ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  హేమంత్ సోరెన్‌ అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌కు చెందిన పలు సంస్థలు గురువారం జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈరోజు (గురువారం) హైకోర్టులో హేమంత్ సోరెన్ పిటిషన్‌పై విచారణ జరగనుండగా, మరోవైపు చంపై సోరెన్ పట్టాభిషేకంపై చర్చలు జరుగుతున్నాయి.

జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఈడీ కార్యాలయంలో నేటి (గురువారం) ఉదయం నుంచి దర్యాప్తు సంస్థ అధికారులు హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా ఈడీ తనను అరెస్ట్‌ చేయడంపై హేమంత్ సోరెన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది.

ఈడీ అరెస్టుకు ముందు హేమంత్ సోరెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక కవితను పోస్ట్ చేసి.. ఇది తనకు కేవలం విరామమేనని రాశారు. తాను ఎప్పుడూ పోరాడుతుంటానని, భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తానని, ఎప్పుడూ రాజీ కోసం వేడుకోననని దానిలో పేర్కొన్నారు.

హేమంత్ సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఒకటిన రాష్ట్రంలో బంద్ పాటించనున్నట్లు గిరిజన సంస్థలు ప్రకటించాయి. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను సమర్పించారు. జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

హేమంత్ సోరెన్ గురించి బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ మాట్లాడుతూ హేమంత్‌ సోరెన్‌ రూ. 70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, చివరికి రాంచీలోని డిఫెన్స్ భూమిని కూడా అమ్మేశారని ఆరోపించారు. హేమంత్ సోరెన్ చట్టమే అత్యున్నతమనే విషయాన్ని మర్చిపోయారని, 40 గంటల పాటు కనిపించకుండా పోయారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జార్ఖండ్‌కు ‍మచ్చతెచ్చారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement