![Chief Minister of Khyber Pakhtunkhwa Arrested](/styles/webp/s3/article_images/2024/10/6/pak-main.jpg.webp?itok=BwPwr0gT)
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో అత్యంత సమస్యాత్మక ప్రావిన్స్‌గా మారిన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గుండాపుర్‌ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుండాపుర్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ(పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్)కి చెందిన నేత. ఆయన పార్టీ నిరసనల్లో పాల్గొంటున్న సందర్భంలో అరెస్టయ్యారు. అయితే ఆయన అరెస్ట్‌ను పాక్ ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు.
పాక్ ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటూనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఖాన్ పార్టీ చేపట్టిన నిరసనకారులకు గుండాపుర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి కేపీ హౌస్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పీటీఐ తెలిపింది.
‘పాక్ రేంజర్లు కేపీ హౌస్‌లోకి బలవంతంగా ప్రవేశించి ముఖ్యమంత్రి గుండాపుర్‌ను అరెస్టు చేసే ప్రయత్నంలో దూకుడు ప్రదర్శించారు. అధికార దుర్వినియోగం చేశారు. ఇది పాకిస్తాన్‌లో అమలవుతున్న చట్టవిరుద్ధమైన పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది’ అంటూ పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. కాగా అక్రమ ఆయుధాలు, మద్యం రికవరీకి సంబంధించి ముఖ్యమంత్రిని కోర్టులో హాజరుపరచడానికి ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి: జావెలిన్ దిగిందా లేదా!
Comments
Please login to add a commentAdd a comment