జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర | Jharkhand Governor Calls Champai Soren Amid Government Forming Speculations | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర

Published Fri, Feb 2 2024 12:45 AM | Last Updated on Fri, Feb 2 2024 8:07 AM

Jharkhand Governor Calls Champai Soren Amid Government Forming Speculations  - Sakshi

రాంచీలోని ప్రత్యేక కోర్టు వద్ద సోరెన్‌ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు; గవర్నర్‌ను కలిసి వస్తున్న చంపయ్‌ సోరెన్‌

రాంచీ:  జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్‌ సోరెన్‌ను జార్ఖండ్‌ గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు.

జార్ఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్‌ సోరెన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్‌ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్‌–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్‌ సోరెన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం చంపయ్‌ సోరెన్‌ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్‌ చెప్పారని వెల్లడించారు. గవర్నర్‌ను చంపయ్‌ సోరెన్‌ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్‌–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది.

చంపయ్‌కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్‌కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్‌కు చేర్చాలని నిర్ణయించారు.

అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్‌ హౌజ్‌కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్‌ సోరెన్‌ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్‌ సోరెన్‌ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్‌ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది.  

రాంచీ జైలుకు హేమంత్‌ సోరెన్‌  
మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను అధికారులు రాంచీలోని హొత్వార్‌ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.

ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్‌ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్‌ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్‌ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

సుప్రీంకోర్టులో సోరెన్‌ పిటిషన్‌  
తన అరెస్టు అక్రమమంటూ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement