ఇంత నాటకీయత దేనికి?! | Champai Soren sworn in as Jharkhand new CM | Sakshi
Sakshi News home page

ఇంత నాటకీయత దేనికి?!

Published Sat, Feb 3 2024 3:53 AM | Last Updated on Sat, Feb 3 2024 3:53 AM

Champai Soren sworn in as Jharkhand new CM - Sakshi

జార్ఖండ్‌ చుట్టూ ఈ వారమంతా చోటుచేసుకున్న పరిణామాలు దేశ ప్రజానీకాన్ని నివ్వెరపరిచాయి. జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ జాడ తెలియడం లేదనీ, ఆయన గురించి జనవరి 27 నుంచి వెదుకుతున్నామనీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గత నెల 28న చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 30 గంటల పాటు ఆయన ఆచూకీ లేదు. ఢిల్లీ వెళ్లారన్న సమాచారం ఉన్నా అక్కడి నివాసంలో ఆయన అధికారు లకు చిక్కలేదు. అన్ని మార్గాలనూ దిగ్బంధించి వెతుకులాడిన దర్యాప్తు అధికారులకు చివరకు నిరాశే మిగిలింది. జనవరి 31న ఆయన తనంత తానే రాంచీ నివాసంలో ప్రత్యక్షం కావటం, గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించటం, అటుపై ఆయన్ను రాత్రి 9.30కి ఈడీ అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి.

హేమంత్‌ స్థానంలో కొత్త సీఎంగా ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పేరున్న చంపయ్‌ సోరెన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ నెల 5 లోపు బలపరీక్ష నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు తరలివచ్చారు. రాష్ట్ర గవర్నర్‌ ప్రభుత్వం ఏర్పాటుకు పిలుస్తారో లేదోనన్న ఆందోళన సమసిపోయాక, తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం ఎలా అన్నది జేఎంఎంకు సమస్యగా మారినట్టుంది. కూటమి సర్కారులో భాగస్వామి అయినకాంగ్రెస్‌ మిత్రధర్మంగా తెలంగాణలో తలదాచుకోవటానికి చోటిచ్చింది. 

ఈ వ్యవహారంలో ఈడీ పట్టుదల... ఏదేమైనా దానికి చిక్కరాదన్న హేమంత్‌ తీరు... మీడియాకు కావలసినంత మేతనిచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలో వున్న నాయకుణ్ణీ, అందులోనూ ఒక ఆదివాసీ నేతనూ వెంటాడటం అంత అత్యవసరం ఎందుకైందో బోధపడదు. ఆయనపై వున్న కేసులు తీవ్రమైనవే కావొచ్చు, వాటి విషయమై ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావించివుండొచ్చు... దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఫోర్జరీ పత్రాలతో ఆయన రాంచీలోనూ, వేరేచోట్లా భూములు కాజేశారని ఆ సంస్థ ఆరోపణ. కానీ ఆయన చట్టానికి దొరక్కుండా తప్పించుకుపోయే సాధారణ వ్యక్తేమీ కాదు. అలాగని బ్యాంకులకు వేలకోట్లు ఎగనామంపెట్టి విదేశాలకు పోయిన కొందరిలా వ్యాపారో, పారిశ్రామికవేత్తో కాదు.

ఆయన ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుడు. జార్ఖండ్‌ సీఎం. జనం మధ్యనే ఉండి, వారి మద్దతుతో రాజకీయాల్లో కొనసాగదల్చు కున్నవారు. హేమంత్‌ సోరెన్‌ ఉద్దేశపూర్వకంగా ఈడీ సమన్లను బేఖాతరు చేయటం వల్ల వారంలో పూర్తయ్యే దర్యాప్తు నెలరోజులు పట్టొచ్చు. లేదా మరికొన్ని నెలలు కొనసాగొచ్చు. ఈలోగా మిన్ను విరిగి మీద పడుతుందా? ఇప్పటికే 41 చోట్ల సోదాలు చేసి, అయిదు సర్వేలు నిర్వహించామని ఈడీ చెబుతోంది. హేమంత్‌ ఢిల్లీ నివాసంలో నిర్వహించిన దాడిలో భారీగా నగదు, కీలకమైన పత్రాలు లభించాయన్నది ఈడీ ప్రకటన సారాంశం. ఈ విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నా రని హేమంత్‌ సోరెన్‌ ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈడీ సిబ్బందిపై కేసు కూడా పెట్టారు. దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు.

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతు న్నాయి. ఈ ఏడాది ఆఖరుకు జార్ఖండ్‌ అసెంబ్లీ గడువు కూడా ముగుస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయాలనుకోవటం అప్రదిష్ట పాలు చేయటానికేననీ, తనను రాజకీయంగా దెబ్బతీసే కుట్రనీ హేమంత్‌ చేస్తున్న ఆరోపణ జనం విశ్వసించే అవకాశం లేదా? హేమంత్‌ కూడా ఇంత నాటకీయతకు తావివ్వకుండా ఉండాల్సింది. రాజకీయంగా ఆయన ఇబ్బందులు ఆయనకుండొచ్చు. తన అరెస్టు ఖాయమని తెలిశాక తదుపరి సీఎం ఎవరన్న అంశంలో గృహచ్ఛిద్రాలు కమ్ము కున్నాయి. సతీమణి కల్పనా సోరెన్‌ వైపు ఆయన మొగ్గుచూపగా, హేమంత్‌ దివంగత సోదరుడి సతీమణి, ఎమ్మెల్యే సీతా సోరెన్‌ పేచీకి దిగటం సమస్య అయిందంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో, మెరుగైన పాలన అందించటంలో హేమంత్‌ సర్కారుకు మంచిపేరే ఉంది.   

జార్ఖండ్‌ ఏర్పడి 24 ఏళ్లు కావస్తుండగా 2014–19 మధ్య అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మినహా ఏ ప్రభుత్వమూ పూర్తిగా అయిదేళ్లూ పాలించలేకపోయింది. అస్థిరత్వమే రాజ్యమేలిన ఆ రాష్ట్రంలో తొలిసారి 2019 ఆఖరులో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమికి 47 స్థానాలు లభించాయి. 81 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో అధికార కూటమికి ఇంత మెజారిటీ ఉండటం అదే మొదటిసారి. చిత్రమేమంటే అంతకు ఆర్నెల్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు బీజేపీ–ఏజేఎస్‌యూ కూటమి 12 గెల్చుకుంది. జార్ఖండ్‌లో గతంలో బీజేపీతో జేఎంఎం కూటమి కట్టిన సందర్భాలు లేకపోలేదు. కానీ మౌలికంగా రాష్ట్రంలో తనకు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని గ్రహించాక గత దశాబ్ద కాలంగా బీజేపీతో పొత్తుకు జేఎంఎం సుముఖత చూపటం లేదు.

పైగా ఆదివాసీలను హిందువులుగా చూపాలన్న సంఘ్‌ పరివార్‌ వైఖరికి భిన్నంగా వారిని ప్రత్యేక మతస్థులుగా గుర్తించాలని హేమంత్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కారణాల వల్లే ఈడీ ఆయన్ను వేధిస్తున్నదని ఆదివాసీలు నమ్మితే అది రాజకీయంగా బీజేపీకి నష్టంగా పరిణమిస్తుంది. ఏదేమైనా ఈ వ్యవహారంలో ఈడీ అత్యుత్సాహం ప్రదర్శించిందన్న అప్రదిష్టను మూటకట్టుకుంది. ఇప్పటికే ఆ సంస్థ తీరును విపక్షాలు తూర్పారబడుతున్నాయి. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా హేమంత్‌ సోరెన్‌ మాదిరే ఈడీ సమన్లను ధిక్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ సంయమనంతో వ్యవహరించి నిందకు తావులేకుండా చూసుకోవాలి. అలాగే జార్ఖండ్‌లో ఎలాంటి రాజకీయ అస్థిరతకూ బీజేపీ తావీయరాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement