
నల్లమల అభయారణ్యానికి మరో మూడు పులికూనలు రానున్నాయి. తిరుపతి జూపార్కులో ఉన్న వీటిని చిన్నమంతనాల బీటు పరిధిలో వదిలిపెట్టేందుకు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 11 నెలలుగా జూ అధికారుల సంరక్షణలో ఉన్న పులిపిల్లలను వాటి సహజ సిద్ధ ఆవాసానికి తరలించేందుకు ముందుగా అడవిలో ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా చేసి ఆపై అడవిలో వదలనున్నారు.
పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో పెరుగుతున్న పులి పిల్లలు త్వరలోనే వాటి సహజసిద్ధ వాతావరణమైన నల్లమల అభయారణ్యంలోకి అడుగిడనున్నాయి. పులి పిల్లలను నల్లమలకు తరలించేందుకు కొన్ని రోజులుగా అటవీశాఖ తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. సుమారు ఎనిమిది నెలల కిందట నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి స్థానికులకు కనిపించిన విషయం పాఠకులకు విదితమే.
ఫిబ్రవరి మొదటి వారంలో పులి పిల్లలు దొరికిన నాటి నుంచి తల్లి పులి కోసం అన్ని ప్రాంతాలను అన్వేషించిన అటవీశాఖ అధికారులు తల్లిపులి దొరకక పోవటంతో పులి పిల్లలను తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల జూ పార్కులోనే మృతి చెందింది. ఈ క్రమంలో పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. క్రమేపి అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని సహజ సిద్ధంగా ఉండే అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు.
నల్లమలలో అనువైన ప్రాంతాల పరిశీలన
పులిపిల్లలను సంరక్షించేందుకు అవసరమైన ప్రాంతాలను అడిషనల్ పీసీసీఎఫ్ ఏకే.నాయక్, ఆంధ్రప్రదేశ్ జూ పార్కుల డైరక్టర్ శాంతి ప్రియ పాండే, రాహుల్ పాండే లాంటి ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజుల క్రితం నల్లమలలో పర్యటించి కొన్ని ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఇందులో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతమైన చిన్న మంతనాల బీటు పరిధిలోని పెద్దపెంట ప్రాంతాన్ని అనువుగా ఉందని నిర్ధారించారు.
దీంతో పెద్దపెంటలోనే పులికూనలను సంరక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దపెంట ప్రాంతంలో వాతావరణం పులులు సంచరించేందుకు అనువుగా ఉండటంతో పాటు, అక్కడి శీతోష్ణస్థితి వన్యప్రాణులు జీవించేందుకు అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పులుల సంరక్షణకు సంబంధించి ఎన్‌ఎస్‌టీఆర్ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
పులిపిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్‌లు:
నల్లమలలోని పెద్దపెంట వద్ద పెద్దపులి పిల్లల సంరక్షణకు ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సహజంగా తల్లిని వీడిన వన్యప్రాణుల పిల్లలకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి కొన్ని రోజుల పాటు వేటాడే ప్రక్రియను నేర్పిస్తారు. తరువాత వాటిని అభయారణ్యంలో వదిలి పెట్టే రీ వైల్డింగ్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. సహజంగా కొత్తపల్లిలో దొరికిన నాటికి పులిపిల్లల వయస్సు మూడు నెలలు. నాటి నుంచి నేటి వరకు 11 నెలల కాలంగా ఆ పిల్లలు వేటాడే తమ సహజసిద్ధ గుణాలను మరిచి కేవలం జూ అధికారులు అందజేసే అహారంతోనే జీవిస్తున్నాయి.
అడవికి రారాజుగా పేరొందిన పులుల విషయంలో ఈ పక్రియ అంత మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. పులి అంటేనే వన్యప్రాణులను వేటాడే స్వభావం కలిగింది. అటువంటి పెద్దపులి పిల్లలను ప్రస్తుత పరిస్థితుల్లో జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి అడవి కుక్కలు, అడవి పందులతో పాటు స్వజాతికి చెందిన పులుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాక దొరికిన జంతువుల పిల్లలకు రీ వైల్డింగ్‌లో భాగంగా ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు నేర్పిస్తారు. ఎన్‌క్లోజర్‌లలో పెరిగే పులి పిల్లలు వ్యక్తిగతంగా 50 జంతువులను స్వంతంగా వేటాడి తినగలిగిన నాడే దాన్ని అభయారణ్యంలోకి వదిలి వేసే పరిస్థితిలు ఉంటాయి.
అలా వేటాడలేక పోయిన నాడు వాటికి ఎదురు పడిన జింకల కొమ్ములు, అడివి పందుల దంతాల ధాటికి ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. దీంతో పాటు మగపులులు ఎదురుపడితే మేటింగ్‌కు ప్రయత్నిస్తాయని, అలా కాకుండా ఆడపులులు ఎదురు పడితే వీటిపై దాడికి పాల్పడే ప్రమాదం ఉందని పలువురు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందు వల్లే ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేసి వాటికి ఇతర జంతువులను వేటాడే శక్తి యుక్తులు కలిగేలా పులిపిల్లలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు.
ఒకే కాన్పులో నాలుగు ఆడపులి పిల్లలు పుట్టడం అపూర్వ సంఘటన
తిరుపతి వెంకటేశ్వర జూ పార్కులో తల్లిపులి నుంచి విడిపోయి అధికారుల సంరక్షణలో పెరుగుతున్న పులి పిల్లల పుట్టుక అపురూపమైందిగా పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. సాధారణంగా అంతరించి పోతున్న పులుల సంతతిపై పర్యావరణ ప్రేమికుల్లో కొంత మేర ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో ఒకే కాన్పులో నాలుగు పులిపిల్లలు పుట్టడంతో పాటు, అవి తల్లి పులి నుంచి విడిపోయి బాహ్య ప్రపంచానికిలోకి రావటం ఎంతో అరుదని వారు పేర్కొంటున్నారు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆడపులి పిల్లల వల్ల భవిష్యత్తులో మరెన్నో లాభాలు ఉన్నాయని, దీని వల్ల ఎక్కువ పులుల సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment