
సమీక్షకు కథలు చెప్పడానికి వస్తారా.?
ఒంగోలు సబర్బన్: మీరు చెప్పే కథలు వినడం కోసం ఇక్కడకు పిలిపించానా.. సమీక్షకు కథలు చెప్పడానికి వస్తారా.? అంటూ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో స్థానిక ప్రకాశం భవనంలో శుక్రవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య సమస్యల పరిష్కారంపై ఎందుకు దృష్టి సారించడంలేదని మండిపడ్డారు. పనిచేయడం కోసమే ప్రభుత్వం మీకు జీతాలిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ మందలించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదంటూ హెచ్చరించారు. చెత్త తరలించేందుకు రిక్షాలు, క్లాప్ మిత్రలు, తాగునీటి వాటర్ ట్యాంకులు శుభ్రం చేయడం, క్లోరినేషన్, రోడ్ల వెంట చెత్త కుప్పల తొలగింపు తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షలో అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
పెద్దారవీడు పీఈఓ, వై.పాలెం ఎంపీడీఓకు
షోకాజ్ నోటీసులు...
సమావేశానికి పెద్దారవీడు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాజరు కాకపోవడంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తన అధ్యక్షతన సమావేశం ఉన్నప్పటికీ పెద్దారవీడు అధికారి ఎందుకు రాలేదని డీపీఓ జి.వెంకట నాయుడుని ప్రశ్నించారు. తనకు కూడా ఎలాంటి సమాచారం లేదని ఆయన సమాధానమిచ్చారు. దీంతో పెద్దారవీడు ఈఓకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. యర్రగొండపాలెం ఈఓ కూడా రాకపోవడంపై కలెక్టర్ ప్రశ్నించారు. స్థానికంగా వేరే కార్యక్రమం ఉన్నందున తాను అనుమతిచ్చానని యర్రగొండపాలెం ఎంపీడీఓ చెప్పారు. దాంతో ఎంపీడీఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఓలు, ఎంపీడీఓలతో తాను సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. కనీసం తన దృష్టికి తీసుకురాకుండా ఈఓ గైర్హాజరుకు ఎలా అనుమతిస్తారంటూ ఎంపీడీఓను నిలదీశారు. యర్రగొండపాలెం ఎంపీడీఓకు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జెడ్పీ సీఈఓను కలెక్టర్ ఆదేశించారు. చెత్త తరలించడానికి రిక్షాల సమస్య ఉందని, నెలకు రూ.6000 జీతానికి క్లాప్ మిత్రలు పనిచేయడం లేదని పలువురు ఈఓలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రిక్షాల సమస్య పరిష్కారానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారా, ఉన్నతాధికారులకు తెలియజేశారా, అలాంటివేమైనా ఉంటే చెప్పండి, వాటి గురించి అలోచించకుండా ఇక్కడకు వచ్చి ఈ కథలు ఎందుకు చెబుతున్నారంటూ కలెక్టర్ మండిపడ్డారు. దీనికోసమా మిమ్మల్ని ఇక్కడకు పిలిపించింది, క్షేత్రస్థాయిలో మీరు ఉండి ఏం పనిచేస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాప్ మిత్రలకు ఇచ్చే వేతనాలను స్థానిక వనరుల నుంచే సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలన్నారు. తమ పరిధిలోని సమస్యలపై ఎంపీడీఓలు, డీఎల్‌పీఓలు దృష్టి పెట్టాలని ఆమె ఆదేశించారు. సమీక్ష సమావేశం అజెండా ముందుగానే చెప్పినప్పటికీ సరిగ్గా సన్నద్ధం కాకుండా మొక్కుబడి సమాధానాలు చెప్పడానికి వచ్చారా అని కలెక్టర్ ప్రశ్నించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇండికేటర్స్‌లో జిల్లా స్థానం పేలవంగా ఉంటే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వచ్చే శుక్రవారం నాటికి ఆయా ఇండికేటర్స్‌లో గణనీయమైన పురోగతి సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, పంచాయతీల ఈఓలు పాల్గొన్నారు.
పారిశుధ్య సమస్యలపై ఎందుకు
దృష్టి సారించడం లేదు
పలువురు ఈఓలు, ఎంపీడీఓలపై కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆగ్రహం
షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశం