ఊపిరితీసి..! | - | Sakshi
Sakshi News home page

ఊపిరితీసి..!

Published Fri, May 2 2025 1:26 AM | Last Updated on Fri, May 2 2025 1:26 AM

ఊపిరి

ఊపిరితీసి..!

పల్లె వైద్యం..
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న విలేజ్‌ క్లినిక్‌లను దెబ్బతీసే కుట్రలు, కుయుక్తులకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం ప్రకారం దొడ్డిదారుల్లో చర్యలు చేపట్టింది. వైద్యపరంగా పేదలకు అండగా నిలుస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఓ)లకు ఇంక్రిమెంట్లు నిలిపివేసింది. అత్యవసర సమయాల్లో ఆదుకునే పీఎఫ్‌ను సైతం ఆపేసింది. చివరకు విలేజ్‌ క్లినిక్‌లకు ఇస్తున్న అద్దె కూడా చెల్లించడం లేదంటే.. పాలకుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోంది. ఎన్నికల ముందు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని గంగలో కలిపేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సీహెచ్‌ఓలు ఆందోళన పేరుతో రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా క్లినిక్‌లు మూతపడ్డాయి.
● అధికారంలోకి వచ్చీరాగానే విలేజ్‌ క్లినిక్‌లపై కూటమి కుట్రలు ● భవనాలకు అద్దెలు చెల్లించకుండా వేధింపులు ● సీహెచ్‌ఓలకు ఇంక్రిమెంట్లు, పీఎఫ్‌ నిలిపివేత ● ఎస్యూరెన్స్‌ స్టాండర్స్‌ నిధులకు కోత ● సీహెచ్‌ఓలపై పడుతున్న ఆర్థిక భారం ● గత్యంతరం లేక సమ్మెకు దిగిన సీహెచ్‌ఓలు ● జిల్లాలో మూతపడిన 538 విలేజ్‌ క్లినిక్‌లు ● వారం రోజులుగా నిలిచిపోయిన వైద్య సేవలు

ఆగిన వైద్య సేవలు,

గ్రామీణ నీటి పరీక్షలు...

సీహెచ్‌ఓల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గత నెల 19వ తేదీ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత 24, 25 తేదీల్లో విజయవాడలో నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో 29వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో జిల్లాలోని విలేజ్‌ క్లినిక్‌లన్నీ మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్య సేవలు నిలిచిపోయాయి. కేవలం వైద్య సేవలే కాకుండా ప్రతి బుధవారం అన్ని గ్రామాల్లో మంచినీటి నాణ్యతను సీహెచ్‌ఓలు పరిశీలిస్తుంటారు. రెండు వారాలుగా నీటి నాణ్యత పరీక్షలు కూడా ఆగిపోవడంతో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. అయినా సరే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దారుణమని గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 8వ తేదీ మార్కాపురం వచ్చిన సీఎం చంద్రబాబుకు విలేజ్‌ క్లినిక్‌లలోని సమసల్యను సీహెచ్‌ఓలు వివరించినా ఫలితం కనిపించలేదు.

ఒంగోలు టౌన్‌:

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలు, ఏరియా వైద్యశాలలు, జిల్లా వైద్యశాలల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా, మందులకు ఇబ్బంది లేకుండా చేసింది. అందులో భాగంగా 2019లో విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. జిల్లాలో 538 క్లినిక్‌లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించింది. ఈ క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు అందించడమే కాకుండా 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 104 రకాల మందులు అందించింది. మంచం మీద ఉన్న రోగులకు ఇంటి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించడంతో పాటు మందులు కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా విలేజ్‌ క్లినిక్‌ల వైద్య సేవలు కొనసాగాయి. కూటమి ప్రభుత్వం రావడంతో కష్టాలు మొదలయ్యాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు గత పది నెలల్లో కూటమి ప్రభుత్వం చేయని కుట్రలు లేవని గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్సెంటివ్‌లు ఇవ్వకుండా వేధింపులు...

ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగాా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద సీహెచ్‌ఓలను నియమించారు. నెలకు రూ.25 వేల జీతంతో పాటు రూ.15 వేల ఇంక్రిమెంట్‌, ఇన్సెంటివ్‌లు ఇచ్చే ఒప్పందం మీద నియామకాలు జరిగాయి. గత ఐదేళ్లలో అలాగే ఇచ్చారు కూడా. కానీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సెంటివ్‌లను నిలిపివేసింది.

అద్దె చెల్లింపులు నిలిపివేత...

జిల్లాలో 538 విలేజ్‌ క్లినిక్‌లు ఉండగా, వాటిలో 202 క్లినిక్‌లకు సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాలలో వాటిని నిర్వహిస్తున్నారు. వీటికి ప్రతినెలా అద్దె చెల్లించకుండా కూటమి పాలకులు నిఽలిపివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కాలంగా అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానులు ఒత్తిడి చేస్తున్నారని సీహెచ్‌ఓలు వాపోతున్నారు. చేసేదేమీ లేక కొందరు తమకు వచ్చే జీతాల నుంచే క్లినిక్‌ల అద్దెలు చెల్లిస్తుండటం గమనార్హం. అసలే జీతం నుంచి ఇన్సెంటివ్‌లను కోత కోసిన బాధలో ఉన్న సీహెచ్‌ఓల నెత్తి మీద అద్దెల భారం కూడా పడింది. ఇంతటితో ఆగకుండా ఎన్‌క్వాష్‌ ఖర్చు కూడా సీహెచ్‌ఓల మీద వేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏడాదికోసారి నేషనల్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ స్టాండర్స్‌ ద్వారా విలేజ్‌ క్లినిక్‌ల పనితీరును పరిశీలించడం జరుగుతుంది. దీనికి రూ.50 వేలు ఖర్చవుతుంది. కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏడాదికి కేవలం రూ.10 వేలిచ్చి చేతులు దులిపేసుకుంటుండడంతో మిగతా 40 వేల ఖర్చు కూడా సీహెచ్‌ఓలే సొంతంగా భరించాల్సి రావడం ఉద్యోగులకు తలకుమించిన భారంగా మారింది. చివరికి క్లినిక్‌ను శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులను కూడా ఇవ్వకపోవడంతో సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మరికొందరైతే తామే స్వయంగా క్లినిక్‌ను శుభ్రం చేసుకుంటున్నారని, డిగ్రీలు చదివి, పీహెచ్‌డీలు చేసి చివరికి విలేజ్‌ క్లినిక్‌లను శుభ్రం చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.

పదోన్నతులపై మౌనం...

సీహెచ్‌ఓలకు పదోన్నతులిచ్చే అంశంపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సీహెచ్‌ఓలకు పదోన్నతులివ్వాల్సి ఉంది. ఈ మేరకు 2023 ఆగస్టు 29వ తేదీ 731 జీవో జారీ అయింది కూడా. సీహెచ్‌ఓలను రెగ్యులర్‌ చేయడానికి అవసరమైతే అసిస్టెంట్స్‌ సపోర్టు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీహెచ్‌ఓలు మండిపడుతున్నారు. ఇక, ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన పీఎఫ్‌ సౌకర్యాన్ని కూడా నిలిపివేయడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

మహిళా సీహెచ్‌ఓలకు రక్షణ కల్పించాలి

జిల్లాలో మొత్తం 538 మంది సీహెచ్‌ఓలు వుండగా వారిలో 438 మంది మహిళలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించే విషయంలో వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం అన్యాయం చేయడం బాధాకరం. ఇన్సెంటివ్‌లు ఇవ్వకుండా జీతంలో కోతలు పెట్టడం, విలేజ్‌ క్లినిక్‌లకు అద్దెలు కూడా చెల్లించపోవడం సరికాదు. – కల్వకుర్తి దీప్తి, సీహెచ్‌ఓ

న్యాయమైన డిమాండ్ల కోసమే సమ్మె

గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న సీహెచ్‌ఓల ప్రోత్సాహకాలు నిలిపివేయడం బాధాకరం. విలేజ్‌ క్లినిక్‌లను మరింత బలోపేతం చేయాల్సిన పరిస్థితిలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విచారకరం. పదినెలలుగా ఇన్సెంటివ్‌లు ఆపివేయడం, పదోన్నతుల్లో నిర్లక్ష్యం, ఇంక్రిమెంట్‌ సమస్య, పీఎఫ్‌ సౌకర్యం తీసేయడంతో అనివార్యంగా సమ్మెకు దిగాము.

– మందగిరి రాజేష్‌, ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఊపిరితీసి..!1
1/2

ఊపిరితీసి..!

ఊపిరితీసి..!2
2/2

ఊపిరితీసి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement