
పరిశ్రమలను ప్రోత్సహించాలి ●
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులు, ఏపీఐఐసీ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పాలసీ–2015, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), పీఎం విశ్వకర్మ యోజన, ఆంధ్రప్రదేశ్‌లో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పనితీరు (ఆర్‌ఏఎంపీ) పథకం కింద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్–కమ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఈఎస్‌డీపీలు), ఉద్యమ్ వర్క్‌షాప్, ఎంఎస్‌ఎంఈ సర్వే, ఇన్సెంటివ్ రిలీజ్, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థల సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ఉపాధి అవకాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కుకు అవసరమైన స్థల సేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
సమయం ఇచ్చి పనిచేయించుకోవాలి
ఒంగోలు సబర్బన్: రెవెన్యూ అధికారులకు సమయం ఇచ్చి పనిచేయించుకోవాలని, పారదర్శకంగా పనిచేయటానికి తహశీల్దార్లు సిద్ధంగా ఉన్నారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో ఓ ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా తహశీల్దార్లతో సమావేశంలో బొప్పరాజు ముఖ్య అతిథిగా మాట్లాడారు. తహశీల్దార్లు కష్టపడి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకోసం రాస్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తూ తహశీల్దార్లతో మమేకం అవుతున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తున్నామని చెప్పారు. తహశీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలంటే కార్యాలయాలకు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలన్నారు. కొత్త కొత్త చట్టాలు చేస్తున్నారని, అందుకు అనుగుణంగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు, కార్యదర్శి వాసుదేవరావు, ఒంగోలు కార్యాలయ కార్యదర్శి ఊతకోలు శ్రీనివాస రావుతో పాటు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు ఉన్నారు.

పరిశ్రమలను ప్రోత్సహించాలి ●