
సీఎం చంద్రబాబే న్యాయం చేయాలి
● టీడీపీ నేత భూకబ్జాపై బాధితుడి మొర
● సోషల్ మీడియాలో వీడియో వైరల్
మార్కాపురం: మార్కాపురం పట్టణ శివార్లలో ఉన్న తన భూమిని టీడీపీ నాయకుడు, మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి కబ్జా చేశాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని పట్టణంలోని తూర్పువీధికి చెందిన గొలమారి నారాయణరెడ్డి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశాడు. సర్వే నంబరు 1132/3 లో ఉన్న తన ఆస్తిని జీవీ సాయికుమార్‌రెడ్డి దగ్గర కొనుగోలుచేసి అనీల్‌కుమార్‌రెడ్డికి అమ్మాడన్నారు. అయితే ఈ ఆస్తి తన పేరుపై ఉందని, డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పినా వినకుండా తాము అధికారంలో ఉన్నామని చెబుతూ తమను బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రాణహాని జరిగితే వారే బాధ్యులని, మిగిలిన ఆస్తిని కూడా కబ్జా చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్, సబ్‌కలెక్టర్, తహశీల్దార్‌ను కోరుతున్నట్టు తెలిపారు. ఈ విషయమై పట్టణపోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నారాయణరెడ్డి కుమారుడు శివారెడ్డి తెలిపారు. తమ ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. టీడీపీ నేతల భూకబ్జాలపై ప్రజల నుంచి తీవ్రస్ధాయిలో నిరసన వ్యక్తమవుతోంది.
వృద్ధురాలి పర్సు చోరీ
గిద్దలూరు రూరల్: పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఓ వృద్ధురాలి నుంచి రూ.39 వేలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. పట్టణంలోని సీతారాములవారి ఆలయం వీధిలో నివాసం ఉంటున్న బత్తుల రంగలక్ష్మమ్మ అన్నా క్యాంటీన్ వద్ద భోజనం చేసేందుకు వెళ్లింది. భోజనం అనంతరం చేతిని శుభ్రం చేసుకునే క్రమంలో ఆమె వద్ద ఉన్న నగదుతో కూడిన పర్సును పక్కన పెట్టింది. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పర్సును అపహరించారు.