సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మగపులిది అసహజ మరణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ దరిగాం–సర్కెపల్లి మధ్య బూడిదమామిడి అడవుల్లో ఈ నెల 6న ఏడాదిన్నర ఆడపులి, ఈ నెల 8న ఐదేరాళ్ల మగపులి (ఎస్9) కళేబరాలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఆడపులి మరోపులితో పోరులో చనిపోగా, మగపులి విషంతో చనిపోయినట్టు అధికారులు గుర్తించారు.
మంగళవారం ఎన్‌టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) నియమించిన టీంతో కలిసి పీసీసీఎఫ్ ఆర్‌ఎం డొబ్రియల్, చీఫ్ వైల్డ్‌లైఫ్ ఇన్‌చార్జి ఎంసీ పర్గేన్, సీసీఎఫ్ శాంతారామ్, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీఓ వేణుబాబు, ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్, పశువైద్యాధికారులు, ఎన్జీఓ, ఇతర సిబ్బందితో వివరాలు తీసుకున్నారు. అనంతరం ఎన్‌టీసీఏ నిబంధనల మేరకు అడవిలోనే పులి, పశుకళేబరాలను దహనం చేశారు.
పులిపై విష ప్రయోగం
ఒక పులి అంతర్గత పోరులో, మరో పులి విషం పెట్టడంతో చనిపోయినట్టు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నాం. మగపులి మెడకు ఉచ్చు కూడా ఉంది. అది వదులుగా ఉంది. పులి ఉచ్చు పడితే తనంతట తాను తీసుకునే ప్రయత్నం చేస్తుంది.
కనిపిస్తున్న ఆధారాలను బట్టి పులి వేటాడిన పశుకళేబరంలో ఎవరైనా విషం కలిపి ఉండొచ్చు. దానిని తిన్న పులి చనిపోయి ఉండొచ్చనిపిస్తోంది. నమూనాలు మూడు ల్యాబ్‌లకు పంపుతున్నాం. నివేదిక వస్తే స్పష్టత వస్తుంది. ఘటనపై కేసు నమోదు చేశాం. విచారణలో స్థానిక పోలీసు సాయంతో నేరస్తులను పట్టుకుంటాం. – ఆర్‌ఎం డొబ్రియల్
పులులెలా చనిపోతున్నాయి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్ టైగర్ కారిడార్‌లో వరుస ఘటనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మొదట రెండు పులుల ఆవాస ఆధిపత్య పోరులో ఒకటి చనిపోయిందని తేల్చారు. మరో పులి అదే తీరుగా పొట్లాటలో మృతి చెందిందని చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఒకేచోట రెండు మరణించడం, పశువుల కళేబరాలు ఉండడంతో ఆ దిశగా విచారణ మొదలైంది. ‘తడోబా–అందేరి’, ‘తిప్పేశ్వర్’కు పెన్‌గంగా, ప్రాణహిత పక్కనే ఉన్న కాగజ్‌నగర్ పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్‌గా ఉంది.
దరిగాం సమీపప్రాంతాల్లోనే ఎస్9 మగపులి, ఎస్6 అనే ఆడపులితో జతకట్టడంతో నాలుగు పిల్లలు జన్మించాయి. వాటి వయసు రెండేళ్లు దాటడంతో ఆవాసం వెతుక్కుంటున్నాయి. మరోవైపు ఎస్6 కోసం మరో మగపులి రావడం, అక్కడే ఎస్9 కూడా ఉండడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఇలా తల్లి, నాలుగు పిల్లలు, మగపులులతో అక్కడే సంచరిస్తున్నాయి. అడవిలో వన్యప్రాణుల లభ్యత లేక స్థానిక గిరిజన రైతుల పశువులే వాటికి ఆహారంగా మారాయి. రెండేళ్లుగా ఆరు పశువులను చంపగా, కొందరికే పరిహారం రాగా, మరికొందరికి అందలేదు.
పశువులపై దాడులతో ప్రతీకారమా...
పశువులను చంపేస్తున్న పులులను హతమార్చాలని ఎవరైనా కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ మొదలైంది. గతంలో పులులకు ఉచ్చులు బిగిసి ఇబ్బంది పడిన ఘటనలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం చెన్నూరు డివిజన్‌లో అమర్చిన ఉచ్చుకు కే4 ఆడపులి చిక్కి నడుము భాగంలో ఉండిపోయింది. ఇప్పటికీ ఆ పులి జాడ లేదు. అదే డివిజన్ శివ్వారం, ఉట్నూరు డివిజన్‌లోనూ ఉచ్చులతో పులులకు ముప్పు జరిగాయి.
ఎస్6, ఆ పిల్లలు సురక్షితమేనా?
ఎస్6తోపాటు మరో మూడు పిల్లలు క్షేమంగా ఉన్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. పులుల మరణానికి ముందు చివరగా దరిగాం పరిధిలోనే ఓ పశువును హతమార్చి భుజిస్తుండగా కెమెరాకు చిక్కాయి. ఆ తర్వాత వాటి జాడ లేదు. ఆవాసాల ఆధిప్యత పోరు, కొత్త పులి రాకతో ఘర్షణతో వేరే చోటుకు వెళ్లాయా? లేక విషం, ఉచ్చుల బారిన పడ్డాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి ఆచూకీకి 50 మంది యానిమల్ ట్రాకర్స్ వెతుకుతున్నారని, ఈ చుట్టుపక్కల యాభైదాకా కెమెరా ట్రాక్‌లను అమర్చి పర్యవేక్షిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment