'దాగిన డబ్బంతా బయటకు వస్తుంది'
ఇంతవరకు లెక్కలోకి రాకుండా ప్రైవేటు రంగంలో చలామణి అవుతున్న డబ్బు మొత్తం ఇప్పుడు ప్రభుత్వ రంగంలోకి వస్తుందని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెద్దనోట్లను రద్దచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న మొత్తాలలో డిపాజిట్లు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, పెద్ద మొత్తాలు డిపాజిట్ చేసేవారిపై మాత్రం ఇప్పటి ఉన్న పన్ను చట్టాల ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు. ఆదాయపన్ను పరిమితి లోపల ఉన్న మొత్తాలను డిపాజిట్ చేయడానికి ప్రజలు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు.
ఇక మీదట ప్రజల ఖర్చు అలవాట్లు మారుతాయని, కొన్నాళ్ల పాటు తాము ఇబ్బంది పడుతున్నామని అనుకుంటారు గానీ, తర్వాత వాళ్లకు కూడా తెలుస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. చిన్న కొనుగోళ్ల విషయంలో కొన్నాళ్ల పాటు ఇబ్బందులు ఉంటాయి కానీ, కావల్సినంత కరెన్సీ ఉంది కాబట్టి దీర్ఘకాలంలో ఇది ప్రయోజనకరమే అవుతుందన్నారు. బ్యాంకులు వీలైనంత ఎక్కువ సమయం పనిచేసి ప్రజలకు కొత్త నోట్లు అందిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. ఇందుకోసం బ్యాంకింగ్ శాఖ, రిజర్వు బ్యాంకు తగిన చర్యలు తీసుకున్నాయన్నారు.
ఏ ప్రభుత్వం పనిచేయాలన్నా ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఆయన చూపిన ఎజెండా ప్రకారమే మంత్రులంతా పనిచేయాలని, విస్తృత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుందని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ కేబినెట్‌లో మంచి వాతావరణం ఉన్నందువల్ల చాలావరకు నిర్ణయాలను తామంతా విస్తృత ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థికరంగంలోని పలు అంశాలు అందరికీ అందుబాటులో ఉండాలని, తద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వీలవుతుందని అన్నారు. దానికి తగినట్లుగా చట్టాలలో కావల్సిన మార్పుచేర్పులు చేశామన్నారు.
తాము గత ప్రభుత్వ అనుభవాల నుంచి నేర్చుకున్నామని, నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ కాలం ప్రభుత్వం దగ్గరే నానుస్తూ ఉంటే ఫలితాలు బాగోవని, కాంట్రాక్టులు రద్దుచేయాల్సి రావడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయని, అంతా బ్యాక్ ఫైర్ అవుతుందని తెలుసుకున్నామన్నారు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయని వాటిని కూడా మేం అమలుచేశామని తెలిపారు.