న్యూఢిల్లీ: సాధారణ బీమా వ్యాపారం (జాతీయీకరణ) సవరణ బిల్లు, 2021కి లోక్‌సభ మంగళవారం ఎటువంటి చర్చా లేకుండా ఆమోదం వేసింది. పెగాసస్, ఇతర సమస్యలపై సభ్యుల ఆందోళనల నడుమ ఈ బిల్లును సభలో ఆమోదం నిమిత్తం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో కేంద్రం తన వాటాల విక్రయానికి మార్గం సుగమం చేయడం బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రైవేటుపరం కానుంది. అయితే ఈ పేరును ఇంకా కేంద్రం ఖరారు చేయలేదు.
ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ గత వారమే ఆమోదముద్ర వేసింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్‌ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్‌లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. ఇక రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సవరణల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment