సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బియ్యం సేకరణ అంశాన్ని బుధవారం లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ జి.రంజిత్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆహార ధాన్యాల సేకరణ, పీడీఎస్ ద్వారా సరఫరా, బఫర్‌స్టాక్ ఉంచడం కోసం ఎఫ్‌సీఐకి ఆదేశాలిచ్చినా.. లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపించారు. దీనిపై జోక్యం చేసుకుని ఎఫ్‌సీఐకి దిశానిర్దేశం చేయాలని ప్రధానిని కోరారు.
బొగ్గు బ్లాక్‌ల వేలంపై..: తెలంగాణలోని కళ్యాణ్‌ఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి బొగ్గు గనులను వేలానికి ఉంచినట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దుచేసి వాటిని సింగరేణి కాలరీస్‌కు కేటాయించాలని అభ్యర్థించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణితో పాటు ఇతర సంస్థలు వేలంలో పాల్గొని, నిబంధనల ప్రకారం బొగ్గు బ్లాక్‌లను తీసుకోవచ్చని టీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, దయాకర్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు.
రాజ్యసభలో తెలంగాణ..: తెలంగాణకు 14, 15 ఆర్థిక కమిషన్ల కింద నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. 14వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రూ.5,375.29 కోట్లు కేటాయించగా, రూ.5,059.97 కోట్లు విడుదల చేశామని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. 15వ ఆర్థిక సంఘం కింద రూ.9,048 కోట్లు కేటాయించగా రూ.2,529.50 విడుదల చేశామని వివరించారు. మిరప, ఇతర పంటలు తామర తెగు లు ముప్పును ఎదుర్కోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ మహమ్మారి కారణంగా ఏపీలో 80%, తెలంగాణలో 60%పైగా పంట నష్టం వాటిల్లిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment