న్యూఢిల్లీ: చమురు విషయంలో సౌదీ అరేబియా పెత్తనానికి చెక్ చెప్పే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా క్రూడాయిల్ కొనుగోళ్ల కోసం ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వ రంగ రిఫైనరీలను ఆదేశించింది. నిబంధనలు తమకు అనుకూలంగా ఉండే విధంగా చర్చలు జరపాలని ప్రభుత్వం సూచించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మధ్యప్రాచ్య ప్రాంతం కాకుండా ఇతరత్రా దేశాల నుంచి కూడా చమురు కొనుగోళ్లు జరిపే అవకాశాలను అన్వేషించాలంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)కి కేంద్రం సూచించినట్లు వివరించారు.
ఉమ్మడిగా బేరసారాలు జరపడం ద్వారా భారత్‌కు ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చమురు ఉత్పత్తి కోత విషయంలో సౌదీ అరేబియాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు ధరలు ఫిబ్రవరిలో పెరగడం మొదలైనప్పడు.. నియంత్రణలను సడలించుకుని ఉత్పత్తి పెంచడం ద్వారా రేట్లు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలంటూ సౌదీ అరేబియాను భారత్ కోరింది. అయితే, దీన్ని సౌదీ పట్టించుకోలేదు. పైగా రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కున్న చమురును వాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీనితో చమురు అవసరాల కోసం మధ్యప్రాచ్యంపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన భారత్.. ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మొదలుపెట్టింది.
ఎగుమతి దేశాల కుమ్మక్కు..
సింహభాగం చమురు అవసరాల కోసం భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. 85% పైగా చమురును దిగుమతి చేసుకుంటోంది. ‘సాధారణంగా సౌదీ అరేబియా, చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) నుంచే భారత్ ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతోంది. అయితే, వాటి నిబంధనలు కొనుగోలుదార్లకు ప్రతికూలంగా ఉంటున్నాయి‘ అని అధికారి వివరించారు. భారతీయ కంపెనీలు మూడింట రెండొంతుల కొనుగోళ్లు స్థిరమైన వార్షిక కాంట్రాక్టుల ఆధారంగా జరుపుతుంటాయి. వీటి వల్ల సరఫరాకు కచ్చితమైన హామీ ఉంటున్నప్పటికీ, ధరలు.. ఇతరత్రా నిబంధనలు మాత్రం సరఫరాదారు దేశాలకే అనుకూలంగా ఉంటున్నాయి. ‘కాంట్రాక్టులో కుదుర్చుకున్న మొత్తం పరిమాణాన్ని కొనుగోలుదారులు కొనాల్సిందే. అయితే, ఒపెక్ కూటమి గానీ రేట్లను పెంచుకునేందుకు ఉత్పత్తి తగ్గించుకోవాలనుకుంటే ఆ మేరకు సరఫరాలను తగ్గించేసేలా సౌదీ సహా ఇతర ఉత్పత్తి దేశాలకు అనుకూలంగా నిబంధనలు ఉంటున్నాయి.
ఒపెక్ నిర్ణయాలకు వినియోగదారులెందుకు మూల్యం చెల్లించాలి? ఇంత పరిమాణం కొనుక్కుంటా మంటూ కుదుర్చుకున్న ఒప్పందానికి కొనుగోలుదారులు ఎలా కట్టుబడి ఉంటున్నారో.. సరఫరాపై ఉత్పత్తి దేశాలు కూడా కాంట్రాక్టుకు కట్టుబడి ఉండాలి కదా‘ అని అధికారి వ్యాఖ్యానించారు. సరఫరా మాత్రమే కాకుండా రేట్ల విషయంలోనూ ఆ దేశాలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వార్షిక టర్మ్ కాంట్రాక్టుకు మించి చమురు కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలుదారులు కనీసం 6 వారాల ముందుగా తెలియజేయాల్సి ఉంటోందని, ఉత్పత్తి దేశం ప్రకటించిన సగటు అధికారిక రేటునే చెల్లించాల్సివస్తోందని వివరించారు. ‘సాధారణంగా లోడింగ్ జరిగిన రోజున ఏ రేటు ఉందో అదే ధరను తీసుకోవాలి. తద్వారా అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు కొనుక్కుంటే కొనుగోలుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సౌదీ, ఇతర ఒపెక్ దేశాలు మాత్రం అవి నిర్దేశించే అధికారిక రేటే చెల్లించాలని పట్టుబడుతుంటాయి‘ అని అధికారి చెప్పారు.
వ్యూహం ఇలా..
ప్రస్తుతం దేశీ రిఫైనింగ్ సంస్థలు ఎక్కువగా వార్షిక టర్మ్ కాంట్రాక్టుల ద్వారా చమురు కొనుగోళ్లు జరుపుతున్నాయి. కొత్త వ్యూహం ప్రకారం నెమ్మదిగా టర్మ్ కాంట్రాక్టుల వాటాను తగ్గించుకుంటూ స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోళ్లను పెంచుకునే అంశంపై దృష్టి పెట్టనున్నాయి. ధరలు ఎప్పుడు తగ్గితే అప్పుడు భారీగా కొనుక్కునేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ధరలపరమైన వెసులుబాటుతో పాటు ఏ కారణంతోనైనా ఉత్పత్తి పడిపోయినా సరఫరా కచ్చితంగా ఉండే రకంగా కాంట్రా క్టులు ఉండాలని కోరుకుంటున్నాం‘ అని అధికారి తెలిపారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు భారత్ చమురు కొనుక్కుంటుందని పేర్కొన్నారు. ‘ఎప్పుడు కావాలి, ఎంత కావాలి (కొనుగోలు పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వెసులుబాటు) అనేది ఎప్పుడైనా నిర్ణయించుకునే హక్కుతో పాటు కచ్చితమైన సరఫరా కోసం హామీ ఉండాలని భావిస్తున్నాం‘ అని వివరించారు. దేశీ రిఫైనర్లు దశాబ్దం
క్రితం మొత్తం క్రూడ్ కొనుగోళ్లలో 20% చమురును స్పాట్ మార్కెట్లో కొంటుండగా.. ప్రస్తుతం దీన్ని 30–35%కి పెంచుకున్నాయి.
సౌదీ చమురు పెత్తనానికి చెక్!
Published Sat, Apr 3 2021 5:28 AM | Last Updated on Sat, Apr 3 2021 10:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment