ముంబై: చాలా ఏళ్ల విరామం తర్వాత బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు 8 శాతాన్ని దాటాయి. ప్రభుత్వరంగంలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అత్యధికంగా 8–8.5 శాతం వరకు రేట్లను ఆఫర్ చేస్తోంది. ద్రవ్యోల్బణం మించి రాబడిని బ్యాంక్‌లు 200–800 రోజుల డిపాజిట్లపై ఇస్తున్నాయి. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకోవంతో రుణాలకు డిమాండ్ నెలకొంది. రుణ డిమాండ్‌ను అందుకునేందుకు బ్యాంక్‌లు నిధుల కోసం వేట మొదలు పెట్టాయి. ఫలితంగా డిపాజిట్ రేట్లను సవరిస్తున్నాయి. జనవరి నెలకు ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండడం గమనించాలి.
రుణాలకు డిమాండ్..
జనవరి 13తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల రుణ వృద్ధి 16.5 శాతంగా (వార్షికంగా చూస్తే) ఉంది. కానీ, అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 10.6 శాతంగా ఉంది. ఇక గత ఏడాది కాలంలో డిపాజిట్లలో వృద్ధి 6 శాతం మించి లేదు. ఇటీవల వడ్డీ రేట్లు పెరగడంతో డిపాజిట్లలోనూ వృద్ధి మొదలైందని చెప్పుకోవాలి. ఏడాది కాల పోస్టాఫీసు డిపాజిట్‌పై రేటు 6.6 శాతంగా ఉంటే, రెండేళ్ల కాలానికి 6.8 శాతంగా ఉంది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్ 7.35 శాతంగా ఉంది. వీటితో ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పోటీపడుతున్నాయి. ఆర్‌బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచింది. దీంతో బ్యాంకులు సైతం రుణాలపై ఇంతే మేర రేట్లు పెంచాయి. ఫలితంగా డిపాజిట్లపై మరింత రాబడిని ఆఫర్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, రుణాలపై పెంచిన స్థాయిలో రేట్లను డిపాజిట్లపై ఆఫర్ చేయకపోవడాన్ని గమనించొచ్చు.
బ్యాంకుల వారీ రేట్లు..
ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 200–800 రోజుల కాలానికి వడ్డీ రేట్లు 7–7.25శాతం స్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20వేల శాఖలతో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ 400 రోజుల డిపాజిట్‌పై 7.10 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అదనంగా ఇస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల డిపాజిట్‌పై 7.35 శాతం రేటును ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ 800 రోజుల డిపాజిట్‌పై 7.30 శాతం, పీఎన్‌బీ 666 రోజుల డిపాజిట్‌పై 7.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజులు డిపాజిట్‌పై ఇంతే మేర ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 200 రోజుల డిపాజిట్‌పై 7 శాతం ఇస్తుంటే, కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం, యూకో బ్యాంక్ 666 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 7 శాతం చొప్పున ఇస్తున్నాయి.
చాలా కాలం తర్వాత ఎఫ్‌డీలకు కళ!
Published Wed, Mar 1 2023 4:30 AM | Last Updated on Wed, Mar 1 2023 10:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment