
సాక్షి, అమరావతి: అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో రూ.2,480 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఈ అక్టోబర్‌లో రూ.2,870 కోట్లకు చేరుకున్నాయి. పన్ను ఎగవేతదారులను గుర్తించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం పన్ను ఆదాయం పెరగడంలో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య 90 శాతం దాటిందన్నారు.
అక్టోబర్‌లో వసూలైన రూ.2,870 కోట్లు రాష్ట్రంలో జరిగిన లావాదేవీలపై వచ్చిన జీఎస్టీ ఆదాయమని, ఇందులో ఎస్‌జీఎస్టీ మినహాయింపులు తీసేస్తే ఆ మేరకు రాష్ట్రానికి వచ్చే నికర జీఎస్టీ ఆదాయం తగ్గుతుందని వాణిజ్యపన్నుల అధికారులు వివరించారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో నమోదైన రూ.1.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ల తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే ప్రధమం.