న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఆమోద ముద్ర వేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం ఈ విషయం వెల్లడించింది. విలీన ప్రతిపాదనకు ఏఎం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం సమాచారమిచ్చిందని బీవోబీ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన బ్యాంక్ ఏర్పాటు దిశగా ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ఏఎం గతంలో నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 29న బీవోబీ బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది.
మిగతా రెండు బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనలకు ఇప్పటికే ఓకే చెప్పాయి. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పాటయ్యే కొత్త సంస్థ కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. విలీన బ్యాంకు వ్యాపార పరిమాణం దాదాపు రూ.14.82 లక్షల కోట్లుగా ఉంటుంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత స్థానాన్ని ఇది దక్కించుకుంటుంది. విలీన బ్యాంక్ మొండిబాకీల నిష్పత్తి 5.71 శాతంగా ఉండనుంది. పీఎస్‌బీల సగటు 12.13 శాతం కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. విలీన ప్రతిపాదనకు ఏఎం అనుమతుల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో బీవోబీ షేరు .. 0.30 శాతం పెరిగి రూ. 115.20 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment