
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాటలో కేంద్రం తన స్పీడ్ పెంచింది. ఈ దిశలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్రం గురువారం అనుమతినిచ్చింది. దీనితో ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి (వ్యూహాత్మక విక్రయాలు) మార్గం సుగమం అయ్యింది. ఇక ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ బుధవారమే ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
ఆయిల్, గ్యాస్ రంగంలో తక్షణం పెట్టుబడుల ఉపసంహరణ వరుసలో భారత్ రెండవ అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నిలుస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో తన పూర్తి 52.98 శాతం వాటాలను విక్రయిస్తోంది. ‘‘ఆయిల్, సహజ వాయువు రంగాలకు సంబంధించి ఎఫ్‌డీఐ విధానానికి కొత్త క్లాజ్‌ను జోడించడం జరిగింది. దీని ప్రకారం, వ్యూహాత్మక విక్రయాలకు సూత్రప్రాయ ఆమోదం పొందిన సంస్థల్లోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్‌లో (కఠిన ఆమోదాలు అవసరం లేని) అనుమతించడం జరుగుతుంది’’ అని డీపీఐఐటీ (పారిశ్రామిక అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ) ఒక నోట్‌లో పేర్కొంది.
విదేశీ కంపెనీల ఆసక్తి..
బీపీసీఎల్‌లో ప్రభుత్వ పూర్తి వాటా కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేసిన 3 కంపెనీల్లో రెండు విదేశీ కంపెనీలే. ప్రభుత్వం నుంచి 52.98% వాటాను కొనుగోలు చేసే సంస్థ, టేకోవర్ నిబంధనల ప్రకారం ఇతర వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వవచ్చు. బీపీసీఎల్ కొనుగోలు రేసులో వేదాంతాతో పాటు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, ఐ స్వేర్డ్ క్యాపిటల్స్ అనుబంధ విభాగం థింక్ గ్యాస్‌లు పోటీపడుతున్నాయి.
ఇప్పటివరకూ 49 శాతమే!
2008 మార్చిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమోట్ చేస్తున్న చమురు రిఫైనర్‌లో ఎఫ్‌డీఐ పరిమితి 26% నుంచి 49%కి పెరిగింది. బీపీసీఎల్ అమ్మకం పూర్తయితే, ఐఓసీ మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏౖకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది.
ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా!
ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్‌ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్‌లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం.
చిన్న విమానాశ్రయాలు షురూ..!
దేశంలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రోత్సాహం, మారుమూల, దూర ప్రాంతాలకు విమాన సర్వీసుల విస్తరణకు తొలి అడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లు, 2021కు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. పెగాసస్, రైతుల సమస్యలపై సభ్యులు ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్చా లేకుండా పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. దేశంలో 128 విమానాశ్రయాలు త్వరలో ఏర్పాటవుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment