న్యూఢిల్లీ: ఇంధనాల వినియోగం ఆగస్టులో మిశ్రమంగా నమోదైంది. కోవిడ్–19 పరిస్థితులతో ప్రజలు వ్యక్తిగత రవాణా సాధనాలకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో నెలవారీగాను పెట్రోల్‌కు డిమాండ్ కొనసాగగా, డీజిల్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థల ప్రాథమిక గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఆగస్టులో 2.43 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయించాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 13.6 శాతం అధికం. 2019 ఆగస్టు (కోవిడ్‌కి పూర్వం) అమ్మకాలు 2.33 మిలియన్ టన్నులు.
మరోవైపు, దేశీయంగా అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు జులైతో పోలిస్తే ఆగస్టులో 9.3 శాతం తగ్గాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 15.9 శాతం పెరిగి 4.94 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2019 ఆగస్టుతో పోలిస్తే 9.8 శాతం క్షీణించాయి. కోవిడ్ పూర్వ స్థాయితో పోల్చినప్పుడు గత నెల డీజిల్ వినియోగం 8 శాతం తగ్గింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ విజృంభించడానికి ముందు మార్చిలో ఇంధనాల వినియోగం దాదాపు సాధారణ స్థాయికి తిరిగి వచ్చింది.
కానీ ఇంతలోనే సెకండ్ వేవ్ రావడంతో ప్రతికూల ప్రభావం పడి మే నెలలో పడిపోయింది. కరోనా కట్టడి కోసం అమలవుతున్న ఆంక్షలను సడలిస్తుండటంతో ఆ తర్వాత నెలల్లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. ప్రభుత్వ రవాణా సాధనాలకు బదులుగా వ్యక్తిగత వాహనాలకు ప్రజలు ప్రాధాన్యమిస్తుండటంతో జులైలోనూ పెట్రోల్ వినియోగం పెరిగింది. మరోవైపు, తాజాగా ఆగస్టులో వంట గ్యాస్ (ఎల్‌పీజీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 1.85 శాతం వృద్ధి చెంది 2.33 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. విమానయాన సర్వీసులు క్రమంగా పెరిగే కొద్దీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 42 శాతం పెరిగి 3,50,000 టన్నులకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment