Personal transportation
-
ఫిబ్రవరిలో 3.35 లక్షల వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత రవాణాకు బలమైన డిమాండ్ కొనసాగడంతో ఫిబ్రవరిలో 3.35 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆటో మొబైల్ రంగంలో ఇప్పటి వరకు ఫిబ్రవరిలో నమోదైన అత్యధిక టోకు అమ్మకాలు రికార్డు ఇవే కావడం విశేషం. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ ఎంఅండ్ఎం, కియా మోటార్స్, టయోటో కిర్లోస్కర్ కంపెనీలు చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు పెరిగాయి. బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) టీవీఎస్ మోటార్ అమ్మకాలు నిరాశపరిచాయి. వాణిజ్య వాహనాలకు గిరాకీ లభించింది. -
పెట్రోల్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: ఇంధనాల వినియోగం ఆగస్టులో మిశ్రమంగా నమోదైంది. కోవిడ్–19 పరిస్థితులతో ప్రజలు వ్యక్తిగత రవాణా సాధనాలకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో నెలవారీగాను పెట్రోల్‌కు డిమాండ్ కొనసాగగా, డీజిల్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థల ప్రాథమిక గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఆగస్టులో 2.43 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయించాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 13.6 శాతం అధికం. 2019 ఆగస్టు (కోవిడ్‌కి పూర్వం) అమ్మకాలు 2.33 మిలియన్ టన్నులు. మరోవైపు, దేశీయంగా అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు జులైతో పోలిస్తే ఆగస్టులో 9.3 శాతం తగ్గాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 15.9 శాతం పెరిగి 4.94 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2019 ఆగస్టుతో పోలిస్తే 9.8 శాతం క్షీణించాయి. కోవిడ్ పూర్వ స్థాయితో పోల్చినప్పుడు గత నెల డీజిల్ వినియోగం 8 శాతం తగ్గింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ విజృంభించడానికి ముందు మార్చిలో ఇంధనాల వినియోగం దాదాపు సాధారణ స్థాయికి తిరిగి వచ్చింది. కానీ ఇంతలోనే సెకండ్ వేవ్ రావడంతో ప్రతికూల ప్రభావం పడి మే నెలలో పడిపోయింది. కరోనా కట్టడి కోసం అమలవుతున్న ఆంక్షలను సడలిస్తుండటంతో ఆ తర్వాత నెలల్లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. ప్రభుత్వ రవాణా సాధనాలకు బదులుగా వ్యక్తిగత వాహనాలకు ప్రజలు ప్రాధాన్యమిస్తుండటంతో జులైలోనూ పెట్రోల్ వినియోగం పెరిగింది. మరోవైపు, తాజాగా ఆగస్టులో వంట గ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 1.85 శాతం వృద్ధి చెంది 2.33 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. విమానయాన సర్వీసులు క్రమంగా పెరిగే కొద్దీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 42 శాతం పెరిగి 3,50,000 టన్నులకు చేరాయి. -
కారు మళ్లీ టాప్‌గేరు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 నేపథ్యంలో వ్యక్తిగత రవాణా వాహనాలకు నెలకొన్న డిమాండ్ ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఆటో కంపెనీలు ఫిబ్రవరి వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌లు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా కంపెనీలు కూడా డీలర్లకు పెద్ద ఎత్తున వాహనాలను సరఫరా చేశాయి. మారుతీ సుజుకీ ఫిబ్రవరిలో మొత్తం 1.52 లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 1.36 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. కాంపాక్ట్, యుటిలిటీ వాహన విభాగాల్లో అధికంగా విక్రయాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే నెలలో దేశీయ వాహన అమ్మకాల్లో 29 శాతం వృద్ధిని సాధించినట్లు హ్యుందాయ్ ఇండియా ప్రకటించింది. టాటా మోటార్స్ కంపెనీ ప్యాసింజర్ విభాగంలో మొత్తం 27,225 యూనిట్లను విక్రయించి రెండు రెట్ల వృద్ధిని సాధించింది. -
ప్రీ–కోవిడ్ స్థాయికి పెట్రోల్ డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో దారుణంగా పడిపోయిన పెట్రోల్ డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య భద్రతల దృష్ట్యా ప్రయాణికులు ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకే ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ సెప్టెంబర్ ప్రథమార్థంలో పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు ప్రీ–కోవిడ్ స్థాయిని అందుకున్నాయని ప్రిలిమినరీ ఇండస్ట్రీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అమ్మకాలు 9.45లక్షల టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 9లక్షల విక్రయాలతో పోలిస్తే ఇది 2.2శాతం అధికం. ఇక నెలవారీ పరిశీలిస్తే ఆగస్ట్ 1–15 మధ్య మొత్తం అమ్మకాలు 9లక్షల టన్నులుగా ఉన్నాయి. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు(మార్చి 25)తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. మరోవైపు డీజిల్‌కు డిమాండ్ పెరగడం లేదు. సమీక్షించిన కాలంలో వార్షిక ప్రాతిపదిక డీజిల్ అమ్మకాలు 6శాతం క్షీణత నమోదు చేశాయి. ఇక నెలవారీగా ఆగస్ట్‌తో పోలిస్తే అమ్మకాలు 19.3శాతం పెరిగాయి. అదే విధంగా వార్షిక ప్రాతిపదికన జెట్ ఫ్యూయల్ అమ్మకాలు 60శాతం క్షీణత చవిచూడగా, ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు 12.5శాతం వృద్ధిని సాధించాయి. కార్ల అమ్మకాలు 14శాతం పెరగ్గా, ద్విచక్ర వాహన అమ్మకాలు 3శాతం తగ్గాయి. లాక్డౌన్ సడలింపులతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతుంది. అయితే రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పరిమితులతో కూడిన లాక్డౌన్ విధింపులు డిమాండ్ పుంజుకునేందుకు ఆటంకాన్ని కల్గిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అన్‌లాక్ ప్రక్రియతో డిమాండ్ రికవరీ సంకేతాలు కన్పిస్తున్నాయని అయితే నెలవారీ వినియోగ వృద్ధిని అధిగమించేందుకు ఈ ఏడాది చివరి వరకు పట్టవచ్చని ఐఓసీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య అన్నారు. -
మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో ఓలా ఒప్పందం
హైదరాబాద్: వ్యక్తిగత రవాణాకు సంబంధించిన మొబైల్ యాప్ ఓలా, మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఓలా బ్యాడ్జ్ కింద కార్లను నిర్వహించే డ్రైవర్లకు కారు సర్వీసింగ్ సేవలపై మహీంద్రా ఫస్ట్ చాయిస్ 50 శాతం వరకూ రాయితీ ఇస్తుందని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఫస్ట్ చాయిస్ సంస్థ కార్ల సర్వీసింగ్‌కు సంబంధించి ఓలా డ్రైవర్లకు రెండు రకాల ప్యాకేజీలను ఆఫర్ చేస్తోందని ఓలా సీఓఓ ప్రణయ్ జివ్రాజ్కా పేర్కొన్నారు. మహీంద్రా ఫస్ట్ చాయిస్ సర్వీసెస్ వర్క్ షాపుల్లో కారు సర్వీసింగ్ చేయించుకున్నవారికి కార్ ఫ్రెషనర్స్, డాష్‌బోర్డ్ మెమెంటోల వంటివి ఉచితంగా కూడా లభిస్తాయని వివరించారు. ఓలాతో ఒప్పందం కారణంగా వేలాదిమంది ఓలా డ్రైవర్లకు సేవలందించే అవకాశం లభించిందని మహీంద్రా ఫస్ట్ చాయిస్ సర్వీసెస్ సీఈఓ వైవిఎస్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. చెల్లింపుల టెక్నాలజీ సంస్థ జిప్క్యాష్లో కొంత వాటాను కొనుగోలు చేశామని ఓలా పేర్కొంది. సొంత డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటులో భాగంగా జిప్క్యాష్లో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మైనారిటీ వాటాను కొనుగోలు చేశారు.