విప్రో.. ఓకే | Wipro Q3 net profit flat at Rs 2,969 cr, declares interim dividend | Sakshi
Sakshi News home page

విప్రో.. ఓకే

Published Thu, Jan 13 2022 4:38 AM | Last Updated on Thu, Jan 13 2022 4:38 AM

Wipro Q3 net profit flat at Rs 2,969 cr, declares interim dividend - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం యథాతథంగా రూ. 2,969 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,968 కోట్లు ఆర్జించింది. అయితే క్యూ2తో పోలిస్తే 1.3 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం దాదాపు 30 శాతం ఎగసి రూ. 20,314 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 15,670 కోట్ల టర్నోవర్‌ మాత్రమే సాధించింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 19,667 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 3.2 శాతం వృద్ధి సాధించింది.

2–4 శాతం మధ్య
ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్వీసుల ఆదాయం 2–4 శాతం మధ్య పుంజుకోనున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 269.2–274.5 కోట్ల డాలర్ల మధ్య టర్నోవర్‌ నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. త్రైమాసికవారీగా తాజా గైడెన్స్‌ను ప్రకటించింది. కాగా.. క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధితో దాదాపు 264 కోట్ల డాలర్లకు చేరింది. జీతాల పెంపు నేపథ్యంలోనూ పటిష్ట నిర్వహణ మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో జతిన్‌ దలాల్‌ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 30,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాలలోకి తీసుకునే వీలున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీహెచ్‌ఆర్‌వో సౌరభ్‌ గోవిల్‌ వెల్లడించారు.

ఇతర హైలైట్స్‌
► క్యూ3లో 10,306 మంది ఉద్యోగులను నియమించుకుంది.
► డిసెంబర్‌కల్లా ఐటీ సర్వీసుల మొత్తం సిబ్బంది సంఖ్య 2,31,671కు చేరింది.  
► వార్షికంగా 41,363 మందికి ఉపాధి కల్పించింది.
► షేరుకి రూ. 1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
► క్యూ3లో 80 శాతంమంది రెండోసారి ఉద్యోగులకు జీతాల పెంపు
► గత 12 నెలల్లో 80 శాతంమంది సిబ్బందికి మూడు విడతల్లో ప్రమోషన్లు


ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్‌ఈలో స్వల్ప నష్టంతో రూ. 691 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది.

పటిష్ట పనితీరు
ఆదాయం, మార్జిన్లలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. ఆర్డర్‌ బుకింగ్స్‌ సైతం ఊపందుకున్నాయి. గత 12 నెలల్లో 10 కోట్ల డాలర్ల ఆదాయ లీగ్‌లో 7 సంస్థలను(క్లయింట్లు) జత చేసుకున్నాం. క్యూ3లో ఎడ్‌జైల్, లీన్‌స్విఫ్ట్‌ సొల్యూషన్స్‌ కొనుగోళ్లను పూర్తిచేశాం. తద్వారా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోగలిగాం.

– థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో లిమిటెడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement