Wipro Ltd.
-
విప్రో.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం యథాతథంగా రూ. 2,969 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,968 కోట్లు ఆర్జించింది. అయితే క్యూ2తో పోలిస్తే 1.3 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం దాదాపు 30 శాతం ఎగసి రూ. 20,314 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 15,670 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 19,667 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 3.2 శాతం వృద్ధి సాధించింది. 2–4 శాతం మధ్య ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్వీసుల ఆదాయం 2–4 శాతం మధ్య పుంజుకోనున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 269.2–274.5 కోట్ల డాలర్ల మధ్య టర్నోవర్ నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. త్రైమాసికవారీగా తాజా గైడెన్స్‌ను ప్రకటించింది. కాగా.. క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధితో దాదాపు 264 కోట్ల డాలర్లకు చేరింది. జీతాల పెంపు నేపథ్యంలోనూ పటిష్ట నిర్వహణ మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 30,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాలలోకి తీసుకునే వీలున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► క్యూ3లో 10,306 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► డిసెంబర్‌కల్లా ఐటీ సర్వీసుల మొత్తం సిబ్బంది సంఖ్య 2,31,671కు చేరింది. ► వార్షికంగా 41,363 మందికి ఉపాధి కల్పించింది. ► షేరుకి రూ. 1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ► క్యూ3లో 80 శాతంమంది రెండోసారి ఉద్యోగులకు జీతాల పెంపు ► గత 12 నెలల్లో 80 శాతంమంది సిబ్బందికి మూడు విడతల్లో ప్రమోషన్లు ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 691 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. పటిష్ట పనితీరు ఆదాయం, మార్జిన్లలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. ఆర్డర్ బుకింగ్స్ సైతం ఊపందుకున్నాయి. గత 12 నెలల్లో 10 కోట్ల డాలర్ల ఆదాయ లీగ్‌లో 7 సంస్థలను(క్లయింట్లు) జత చేసుకున్నాం. క్యూ3లో ఎడ్జైల్, లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్ కొనుగోళ్లను పూర్తిచేశాం. తద్వారా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోగలిగాం. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో లిమిటెడ్ -
మెట్రోతో డీల్- ఈక్విటీ బైబ్యాక్- విప్రో స్పీడ్
ముంబై, సాక్షి: జర్మన్ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో ఏజీతో 70 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,150 కోట్లు) డీల్ కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఐదేళ్లపాటు అమల్లో ఉండే ఈ కాంట్రాక్టును తదుపరి దశలో నాలుగేళ్లకు పొడిగించుకునేందుకు వీలున్నట్లు తెలియజేసింది. తద్వారా 100 కోట్ల డాలర్లకు డీల్ విలువ చేరే వీలున్నట్లు అంచనా వేసింది. డీల్‌లో భాగంగా మెట్రో ఏజీ జర్మనీ, మెట్రో సిస్టమ్స్ రుమేనియాకుగల ఐటీ యూనిట్లను విప్రో చేజిక్కించుకోనుంది. భాగస్వామ్యంలో భాగంగా జర్మనీ, రుమేనియాలలోగల 1,300 మంది ఉద్యోగులు విప్రోకు బదిలీకానున్నారు. వెరసి విప్రో వీరికి డిజిటల్ టెక్నాలజీస్, కొత్త అవకాశాపై అవగాహన, ఇంజినీరింగ్ నైపుణ్యం తదితరాలను అందించనుంది. (వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్! ) బైబ్యాక్ 29న ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో ఈ నెల 29 నుంచీ ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. 2021 జనవరి 11 వరకూ కొనసాగనున్న బైబ్యాక్‌లో భాగంగా 23.75 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరుకి రూ. 400 ధర మించకుండా చేపట్టనున్న బైబ్యాక్ కోసం రూ. 9,500 కోట్ల వరకూ వెచ్చించనుంది. మరోపక్క ఐటీ సేవల దేశీ దిగ్గజం టీసీఎస్ సైతం ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించిన విషయం విదితమే. జనవరి 1వరకూ కొనసాగనున్న బైబ్యాక్‌లో భాగంగా టీసీఎస్ రూ. 3,000 ధర మించకుండా షేర్లను కొనుగోలు చేయనుంది. కాగా.. విప్రో ఇంతక్రితం 2019లోనూ షేరుకి రూ. 325 ధర మించకుండా 32.31 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 10,500 కోట్లను వెచ్చించడం గమనార్హం! షేరు జూమ్ జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీతో భారీ డీల్, ఈక్విటీ షేర్ల బైబ్యాక్ నేపథ్యంలో విప్రో లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5.5 శాతం జంప్‌చేసింది. రూ. 384ను అధిగమించింది. వెరసి చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. (నాతో డీల్‌కు కుక్ నో చెప్పారు: మస్క్) -
విప్రో ఉద్యోగులకు గుడ్‌న్యూస్!
బెంగళూరు, సాక్షి: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో.. 2021 జనవరి 1 నుంచి అర్హతగల ఉద్యోగులకు వేతన పెంపును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జూనియర్ విభాగం(బీ3 కంటే తక్కువ)లో జీతాలను పెంచనున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అంతేకాకుండా మధ్యస్థాయి విభాగం(సీ1 కంటే పైన)లోనూ వేతన పెంపును పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. అర్హతగల జూనియర్ ఉద్యోగులకు వచ్చే నెల 1 నుంచి పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే సీ1 కేటగిరీలో 2021 జూన్ 1 నుంచి పెంపును అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. విప్రోలో బీ3 బ్యాండ్‌లోనే అధిక శాతం ఉద్యోగులున్నట్లు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కంపెనీకున్న 1.8 లక్షల మంది ఉద్యోగులలో బీ3 వాటా 80 శాతంగా పేర్కొంటున్నారు. ఇతర వివరాలు ఇలా.. బీ3కి ప్రమోషన్లు సంబంధిత వర్గాల అంచనాల ప్రకారం విప్రోలో అర్హతగల ఆఫ్‌షోర్ ఉద్యోగులకు 6-8 శాతం స్థాయిలో వేతన పెంపు ఉండవచ్చు. ఆన్సైట్ సిబ్బందికి 3-4 శాతం స్థాయిలో జీతాలు పెరిగే వీలుంది. కాగా.. ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 నేపథ్యంలో ఐటీ కంపెనీలు అప్రైజల్ సైకిల్‌కు సంబంధించి పునరాలోచనలో పడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. సాధారణంగా విప్రో జూన్ నుంచి ఇంక్రిమెంట్లను అమలు చేస్తుందని, అయితే సీ1 బ్యాండ్ ఉద్యోగులు ఒక పెంపును మిస్ అయినట్లు తెలియజేశారు. అయితే సంక్షోభ కాలంలోనూ తమ ఉద్యోగులు ప్రస్తావించదగ్గ పనితీరును చూపినట్లు విప్రో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్- డిసెంబర్), క్యూ4(జనవరి-మార్చి)లలో బిజినెస్ మెట్రిక్స్ ఆధారంగా ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే అమలు చేయనున్నట్లు విప్రో తెలియజేసింది. ఇప్పటికే జులై- సెప్టెంబర్ కాలానికి చెల్లింపులు పూర్తయినట్లు పేర్కొంది. బీ3 బ్యాండ్ వరకూ అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు డిసెంబర్ 1 నుంచి ప్రమోషన్లు ఇచ్చినట్లు విప్రో తెలియజేసింది. తద్వారా దాదాపు 7,000 మంది ఉద్యోగులు లబ్ది పొందినట్లు పేర్కొంది. ఇది గత మూడేళ్లలోనే అత్యధికమని తెలియజేసింది. కొత్త సీఐవో కంపెనీకి 25 ఏళ్లపాటు సర్వీసులు అందించిన రోహిత్ అడ్లఖా సీఐవో పదవి నుంచి తప్పుకున్నట్లు విప్రో వెల్లడించింది. దీంతో కొత్త సీఐవోను ఎంపిక చేసేటంతవరకూ ప్రెసిడెంట్, సీవోవో బీఎం భానుమూర్తి ఆ బాధ్యతలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. రోహిత్ ఇప్పటివరకూ చీఫ్ డిజిటల్ ఆఫీసర్, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌కు హెడ్‌గా సైతం బాధ్యతలు నిర్వహించినట్లు తెలియజేసింది. -
టీసీఎస్- విప్రో.. రికార్డ్స్- సెన్సెక్స్ జూమ్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 501 పాయింట్లు దూసుకెళ్లి 40,380కు చేరగా.. నిఫ్టీ 137 పాయింట్లు జమ చేసుకుని 11,876 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించిన వార్తలతో ఐటీ సేవల బ్లూచిప్ కంపెనీ విప్రో లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టీసీఎస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలు సాధించింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 4.8 శాతం పెరిగి రూ. 7,475 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికితోడు ఈక్విటీ షేర్ల బైబ్యాక్నకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 3,000 ధర మించకుండా 1.42 శాతం ఈక్విటీని బైబ్యాక్ చేయనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. 5.33 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 16,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 2,878కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4.7 శాతం ఎగసి రూ. 2,866 వద్ద ట్రేడవుతోంది. విప్రో లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించినట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 13న సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2 ఫలితాలు సైతం అదేరోజు విడుదల చేసే వీలున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే ఐటీ బ్లూచిప్ కంపెనీ టీసీఎస్, మధ్యస్థాయి ఐటీ కంపెనీ మజెస్కో లిమిటెడ్ ఈక్విటీ బైబ్యాక్‌ను ప్రకటించిన విషయం విదితమే. ఈ బాటలో విప్రో మూడో కంపెనీగా నిలవనున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 354కు చేరింది. తద్వారా రెండు దశాబ్దాల గరిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 368 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది! -
విప్రో- కొత్త సీఈవో జోష్
కొత్త సీఈవో, ఎండీగా క్యాప్‌జెమినీ సీవోవోగా పనిచేసిన థియర్రీ డెలాపోర్ట్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించడంతో విప్రో కౌంటర్‌కు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. రూ. 214 సమీపంలో ట్రేడవుతోంది. అయితే ఐటీ సేవల రంగంలోని ఇతర దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ 1.2 శాతం చొప్పున డీలాపడి ట్రేడవుతుండటం గమనార్హం. కాగా.. క్యాప్‌జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా ఇటీవల వరకూ బాధ్యతలు నిర్వహించిన డెలాపోర్ట్ జూన్ 1 నుంచి కొత్త సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు విప్రో తాజాగా పేర్కొంది. ఇప్పటివరకూ విప్రో సీఈవోగా కొనసాగుతున్న అబిదాలీ నీముచ్‌వాల ఈ నెల31కల్లా బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. విప్రోలో నాలుగేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీముచ్‌వాల వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. -
విప్రో ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై : సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డిజిటల్ రంగంలోని ఉద్యోగులకు భారీగా స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చింది. వీరితోపాటు కొత్తగా చేరిన ఉద్యోగులకు కూడా ప్రోత్సాహక రివార్డులను ప్రకటించడం విశేషం. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రో జూనియర్ లెవల్ ఉద్యోగుల నుంచి అయిదేళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులకు వేతనాలను పెంచింది. ముఖ్యంగా మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి డిజిటల్ టెక్నాలజీలో పని చేస్తోన్న ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ప్రకటించింది. ఇండియాలోని ఆఫ్‌షోర్ ఉద్యోగులు, ఆన్లైన్ ఉద్యోగులు, అమెరికా, యూరోప్‌లలోని ఉద్యోగులకు వేతనాలను 6 శాతం -8 శాతం మధ్య పెంచింది. సవరించిన జీతాలు జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. సగటున ఆఫ్‌షోర్ ఉద్యోగులకు హైసింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్, ఆన్సైట్ ఉద్యోగులకు లో నుంచి మిడిల్ సింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేటివ్, ఫ్యూచర్ ఓరియెంటెడ్ టెక్నాలజీపై పని చేస్తున్న ప్రారంభ ఉద్యోగులకు ప్రోత్సహకంగా ప్రత్యేకమైన ఇన్సెంటివ్‌లు, రివార్డులు ఇవ్వనుంది. కాగా విప్రోలో మార్చి 31, 2019 నాటికి 1.7 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎక్కువగా 1 నుండి 5 ఏళ్ల అనుభవం కలిగిన వారు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో విప్రో క్యాంపస్ సెలక్షన్ ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ ప్రకటించింది. విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్ ప్రకటించగా, ఆయన స్థానంలో వారసుడు రిషద్ ప్రేమ్ జీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జూలై 31 నుంచి బాధ్యతలను తీసుకోనున్న సంగతి తెలిసిందే. -
6శాతం పెరిగిన విప్రో లాభం
సాక్షి, ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మంగళవారం ప్రకటించిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో ఆరుశాతం లాభాన్ని నమోదు చేసింది. రూ. 13,469 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఐటి సేవల ఆదాయం రూ. 13,169 కోట్లుగా నమోదు చేసింది. బ్యాంకింగ్ , ఆర్థిక సేవల విభాగంలో పెరుగుదల ఈ త్రైమాసిక లాభాలకు మద్దతు ఇచ్చిందని విప్రో వెల్లడించింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన మూడు నెలల ఫలితాల్లో లాభం రూ. 2,192 కోట్ల (337.5 మిలియన్ డాలర్లు)కు పెరిగింది. గత ఏడాది ఇదే కాలానికి రూ. 2,067 కోట్ల లాభాన్ని విప్రో ప్రకటించింది. కాగా కంపెనీ సగటున రూ. 2,080 కోట్లు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. -
విప్రో ఫలితాలు ఓకే
బెంగళూరు: దేశీ ఐటీ దిగ్గజం విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో రూ.2,227 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 1,729 కోట్ల లాభంతో పోలిస్తే(వార్షిక ప్రాతిపదికన) 29 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా వార్షికంగా 21.7 శాతం పెరుగుదలతో రూ.11,704 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.9,613 కోట్లుగా ఉంది. పరిశ్రమ విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.2,106 కోట్లుగా, ఆదాయాన్ని రూ.10,541 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)ను అంతంతమాత్రంగానే విప్రో ప్రకటించింది. డాలర్ రూపంలో 1.715-1.755 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని పేర్కొంది. డాలరుతో రూపాయి మారకం విలువన 61.62గా పరిగణించి ఈ గెడైన్స్‌ను ఇచ్చింది. కాగా, క్యూ4లో ఆదాయం డాలర్ రూపంలో 1.72 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం పెరిగింది. యూరప్‌లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, అమెరికాలో పటిష్టమైన వృద్ధి, మెరుగైన వ్యయ నిర్వహణ వంటివి ఫలితాల జోరుకు కారణాలుగా నిలిచాయి. సీక్వెన్షియల్‌గా: గతేడాది డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం రూ.2,015 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మార్చి క్వార్టర్లో లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 11,327 కోట్ల నుంచి 3.3 శాతం సీక్వెన్షియల్ వృద్ధిని నమోదు చేసుకుంది. పూర్తి ఏడాదికి ఇలా: 2013-14 పూర్తి ఏడాదిలో విప్రో నికర లాభం రూ,7,797 కోట్లకు ఎగబాకింది. 2012-13లో రూ.6,636 కోట్లతో పోలిస్తే 17.5% వృద్ధిచెందింది. మొత్తం ఆదాయం రూ.33,685 కోట్ల నుంచి రూ.43,755 కోట్లకు పెరిగింది. 16% వృద్ధి నమోదైంది. ఉత్పాదకత పెంపునకు అనుసరించిన మెరుగైన వ్యూహాలు, కాంట్రాక్టుల అమలు గడువును తగ్గించుకోవడంపై దృష్టిపెట్టడం ద్వారా పటిష్టమైన ఫలితాలను సాధించగలిగామని విప్రో సీఈఓ టీకే కురియన్ చెప్పారు. ఇతర ముఖ్యాంశాలు.. ఐటీ సేవల విభాగం ఆదాయం క్యూ4లో రూ.10,619 కోట్లుగా కంపెనీ వెల్లడించింది. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 24% చొప్పున పెరిగింది. పూర్తి ఏడాదికి ఈ విభాగం మొత్తం ఆదాయం 18% వృద్ధితో రూ.39,950 కోట్లకు ఎగసింది. క్యూ4లో కొత్తగా 59 మంది క్లయింట్లు జతయ్యారు. ఇందులో 5 మెగా డీల్స్ కూడా ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి ఏడాదికి డివిడెండ్ మొత్తం రూ. 8కి చేరింది. మార్చి చివరినాటికి విప్రో ఐటీ సేవల వ్యాపారంలో సిబ్బంది సంఖ్య 1,46,053 మందిగా నమోదైంది. ఆఫ్‌షోర్ సిబ్బందికి 6-8 శాతం, ఆన్సైట్ ఉద్యోగులకు 2-3 శాతం పెంపుదలకు అవకాశం ఉందని విప్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్) సౌరభ్ గోవిల్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 2.39 శాతం ఎగబాకి రూ.586 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో టేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.