సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్-2021పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ మేరకు బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. ఆశగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. బడ్జెట్ సామాన్యునికి అనుకూలంగా లేదని, తెలంగాణకు కేంద్ర మళ్ళీ మొండి చేయి చూపించిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. సామాన్యునికి, పేదలకు, చిన్న చిన్న ఆర్థిక రంగాలకు బడ్జెట్ ఏ మాత్రం చేయూతనివ్వలేదని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ పెట్టలేదని, దేశంలోని ఆర్థిక వ్యవస్థలన్నింటిని విదేశీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. చదవండి: కేంద్ర బడ్జెట్-2021: కిషన్‌రెడ్డి స్పందన
ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాల కోసం మాత్రమే ఈ బడ్జెట్ పెట్టినట్టు కనపడుతుందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ నేతలు గాడిదలు కాస్తున్నారా అని విమర్శనస్త్రాలు సంధించారు. బీజేపీ వల్ల దేశ ఆర్ధికవ్యవస్థకు పెను ప్రమాదం వాటిళ్లబోతోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షలు, పెద్ద నోట్ల రద్దు ఫేక్ నోట్లు, నల్లధనం బయటికి వస్తుందన్న కేంద్రం ఏ ఒక్కటి గురించి కూడా చర్చించలేదన్నారు. రాష్ట్రంలో పెండింగ్ పనులు, కొత్త ప్రాజెక్టులు రాలేదని, డ్రై ఫోర్ట్ ఇస్తామని ఆ ఊసే లేదని విమర్శించారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు ఈ ఎంపీలకు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment