న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక శిక్షణను కూడా అందిస్తున్నట్లు విద్యుత్, పునరుత్పాదక ఇందన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 2 లక్షల 62 వేల 841 బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటులో కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు.
బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆర్థిక, సాంకేతిక సహాయం కూడా అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒక క్యూబిక్ మీటర్ పరిమాణంలో ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్‌కు రూ.7,500 నుంచి 25 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో ఏర్పాటుచేసే ప్లాంట్‌కు రూ.35 వేల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాతపూర్వకంగా చెప్పారు. అలాగే దేశంలోని వివిధ బయోగ్యాస్ అభివృద్ధి, శిక్షణ కేంద్రాలతోపాటు భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ ద్వారా కూడా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక శిక్షణ కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బయోగ్యాస్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు పెద్ద ఎత్తున బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర నోడల్ ఏజెన్సీ కృషి చేస్తున్నట్లు మంత్రి రాతపూర్వకంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment