డిస్కంలకు రూ. 21 వేల కోట్ల రుణం | Minister RK Singh Says 21 Thousand Crore Loan To Give Telugu States For Power Discoms | Sakshi
Sakshi News home page

డిస్కంలకు రూ. 21 వేల కోట్ల రుణం

Published Tue, Mar 9 2021 6:45 PM | Last Updated on Tue, Mar 9 2021 7:02 PM

Minister RK Singh Says 21 Thousand Crore Loan To Give Telugu States For Power Discoms - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థలకు పునరుజ్జీవం కల్పించేందుకు సమూల సంస్కరణలు చేపట్టినట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి  అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ సంస్కరణల్లో భాగంగా ఈ రెండు రాష్ట్రాల డిస్కంలకు ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద రూ. 21 వేల కోట్ల రుణం సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ రుణంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 8,370 కోట్లు, తెలంగాణకు రూ.12,652 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కొన్ని షరతులకు లోబడి ఆర్‌ఈసీ, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లు ఈ రుణాన్ని డిస్కంలకు సమకూర్చుతాయని తెలిపారు. మంజూరు చేసిన రుణంలో మొదటి వాయిదా కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,300 కోట్లు, తెలంగాణకు రూ. 6,287 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్‌ స్కీమ్‌ కింద మంజూరు చేసే ఈ రుణం కొన్ని షరతులకు లోబడి మాత్రమే పంపిణీ జరుగుతుందని తెలిపారు. అందులో ప్రధానమైంది ప్రభుత్వ శాఖలు, విభాగాలు డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలను మూడు వార్షిక వాయిదాలలో విడుదల చేయడానికి అంగీకరిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో విద్యుత్‌ వినియోగానికి సంబంధించి స్మార్ట్‌ ప్రీ పెయిడ్‌ మీటర్లు విధిగా అమర్చాని, దాని వల్ల డిస్కంలకు ప్రభుత్వ చెల్లింపులు సకాలంలో జరిగే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యుత్‌ వినియోగదారుల్లో కొన్ని కేటగిరీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ విధానాన్ని కూడా సమూలంగా మార్చాలన్నారు.  సబ్సిడీకి సంబంధించిన బకాయలను ప్రతి మూడు మాసాలకు ఒకసారి విధిగా చెల్లించడానికి అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి షరతులకు ఆయా రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత మాత్రమే తదుపరి రుణ వాయిదాల విడుదల జరుగుతుందని మంత్రి చెప్పారు. 

ఆర్థిక కార్యకలాపాలను ఆయా డిస్కంలు బాధ్యాతాయుతంగాను, పారదర్శకంగాను నిర్వహించాలని తెలిపారు. అందుకోసం ప్రతి త్రైమాసికం ముగిసే నాటికి డిస్కంలు ఎనర్జీ ఆడిట్‌ ఫలితాలను ప్రచురించాలన్నారు. 2021 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం నుంచి ఫీడర్‌ వ్యాప్తంగా బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) మార్గదర్శకాలను అనుసరించి ఎనర్జీ అకౌంటింగ్‌ చేపట్టాలన్నారు. ట్రాన్సిమిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌లో విద్యుత్‌ నష్టాలను గణనీయంగా తగ్గించే దిశగా డిస్కంలు  ఆచరణ సాధ్యమైన కార్యాచరణను రూపొందించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ చర్యలు, సంస్కరణల ద్వారా డిస్కంలు నష్టాల ఊబి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుందని మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement