సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సూచన మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఎవరికీ నష్టం జరగదని, అవసరమైతే కంపెనీ ఉద్యోగులతో మాట్లాడతామన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల దేశానికి, ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కేంద్రం పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ నిర్ణయాన్నిబట్టి అన్ని కంపెనీలను కేంద్రం అమ్మేస్తోందనే భావన, ప్రచారం సరైంది కాదన్నారు. కేంద్ర బడ్జెట్‌లోని అంశాలను వివరించేందుకు చేపడుతున్న ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, డి.ప్రదీప్ కుమార్, జంగారెడ్డి, కృష్ణ సాగర్‌రావు, డా. ప్రకాశ్‌రెడ్డిలతో కలసి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు.
కంపెనీల పనితీరు ప్రాతిపదికనే...
ప్రభుత్వరంగ కంపెనీల పనితీరును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రాధాన్యత–ప్రాధాన్యేతర, వ్యూహాత్మక–వ్యూహాత్మకేతర అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీకి ఎలాంటి నష్టం జరగలేదని, తాము సహకార సమాఖ్య విధానాన్ని నమ్ముతామన్నారు. తెలంగాణ, ఏపీకి అనేక ప్రాజెక్టులు కేటాయించినట్లు చెప్పారు. బడ్జెట్‌లో తెలంగాణలోని రైల్వే లైన్లకు కేటాయింపులున్నాయని, ప్రస్తుతం రూ. 29 వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే 2,111 కి.మీ. నిడివిగల రోడ్ల నిర్మాణం కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ. 13 ,990 కోట్లు వచ్చాయని, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 9,172 కోట్లు వస్తాయని, ఆత్మనిర్భర భారత్ కింద తెలంగాణకు రూ. 400 కోట్లు ఏటా వస్తాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
పోలవరానికి నిధుల కేటాయింపులు...
కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలవరానికి ఒప్పందం మేరకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. స్టార్టప్‌లు, ఇతరత్రా రూపాల్లో ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా తెలంగాణ, ఏపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నుల కన్నా రాష్ట్ర పన్నులే ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని గమనించాలన్నారు. గ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్ విలువను బట్టి మారుతూ ఉంటుందన్నారు.
పన్నులు పెంచని బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: పేదలపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించామని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోవిడ్‌తో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో శనివారం బడ్జెట్–2021పై జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనురాగ్‌సింగ్‌తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొ న్నారు. ఠాకూర్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగంగా ఉందని, నెలకు సగటున రూ.లక్ష కోట్లు జీఎస్టీ వసూలు అవుతోందన్నారు. గతేడాది కంటే ఈసారి 34 శాతం అధికంగా మూలధన వ్యయం పెంచామని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు సమం చేసే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో అతిత్వరలో 3 ఆటోమొబైల్ తయారీ కేంద్రాలు రాబోతున్నాయని తెలిపారు. స్క్రాపింగ్ పాలసీతో మరింత మైలేజీ గల వాహనాలను కొనుగోలు చేయవచ్చన్నారు. కొత్త వ్యవసాయ చట్టం రైతులకు లాభం చేకూరుస్తుందని, కానీ ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. ఇన్నేళ్లలో రైతుల కోసం ఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మాదిరిగా ఖర్చు చేయలేదని వివరించారు.
బడ్జెట్ పట్ల సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందిలేదు. సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు. వాళ్లు బడ్జెట్‌పై ఏమీ మాట్లాడలేదు, స్పందించలేదు కదా. బడ్జెట్ బాగోలేదంటూ సీఎం మీకు ఫోన్‌చేసి చెప్పలేదు కదా’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం సందర్భంగా బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌ను ప్రశ్నించినప్పుడు సంజయ్ ఈవిధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment