మార్కెట్‌కు వ్యాక్సిన్‌..! | Sensex tops 48,600 and Nifty above 14,000 as investors welcome Budget | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు వ్యాక్సిన్‌..!

Published Tue, Feb 2 2021 4:45 AM | Last Updated on Tue, Feb 2 2021 8:17 AM

Sensex tops 48,600 and Nifty above 14,000 as investors welcome Budget - Sakshi

వచ్చేది ‘నెవర్‌ బిఫోర్‌ బడ్జెట్‌’ అంటూ  ఊరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  స్టాక్‌ మార్కెట్‌కు మాత్రం బూస్టర్‌ డోస్‌ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తూ.., ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్‌ – 2021కు దలాల్‌ స్ట్రీట్‌ సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కొత్త తుక్కు విధాన ప్రకటన, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్‌ చెల్లింపుల ప్రమోషన్, ఎన్‌పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్‌సీని ఏర్పాటు చేయడం లాంటి కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలు మార్కెట్‌ను ఆకట్టుకున్నాయి. కోవిడ్‌ సెస్, క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ వడ్డింపు లాంటి ఇబ్బందికర నిర్ణయాల ఊసు బడ్జెట్‌లో లేకపోవడం మార్కెట్‌కు ఉత్సాహానిచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్‌ల కంటే అత్యధికంగా మార్కెట్‌ను ఆకట్టుకున్న బడ్జెట్‌ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  చిదంబరం ఆర్థిక మంత్రిగా 1997 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన ‘డ్రీమ్‌ బడ్జెట్‌’ రోజున స్టాక్‌ మార్కెట్‌ 6% ర్యాలీ చేసింది.  24 ఏళ్ల తరువాత   సీతారామన్‌ తాజా బడ్జెట్‌ తో మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్‌ 5% ఎగసింది.

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతతో సూచీలు ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 332 పాయింట్ల లాభంతో 46,618 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల పెరుగదలతో 13,759 వద్ద మొదలయ్యాయి. ఆరురోజుల భారీ పతనం నేపథ్యంలో నెలకొన్న షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో సూచీలు ముందడుగు వేసేందుకే మొగ్గుచూపాయి. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని అంశాలు ఒక్కొక్కటి మార్కెట్‌ను మెప్పిస్తుండటంతో సూచీల జోరు మరింత పెరిగింది. బడ్జెట్‌ ప్రసంగంలో దేశ ఆర్థిక వృద్ధికి ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమన్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా ఒక్క ఫార్మా  తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు ఆకాశమే హద్దుగా ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 2478 పాయింట్లు పెరిగి 48,764 వద్ద, నిఫ్టీ 702 పాయింట్ల లాభంతో 14,336 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి తుదిదాకా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో చివరికి సెన్సెక్స్‌ 2,315 పాయింట్లు పెరిగి 48,601 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 647 పాయింట్లు లాభపడి 14,281 వద్ద ముగిసింది. గతేడాది ఏప్రిల్‌ 7 తర్వాత సూచీలకిది ఒకరోజులో అతిపెద్ద లాభం కావడం విశేషం. సూచీల భారీ లాభార్జనతో గత ఆరు రోజుల్లో కోల్పోయిన మొత్తం నష్టాల్లో 60 శాతాన్ని తిరిగిపొందాయి.

లాభాలే.. లాభాలు..
సీతమ్మ పద్దును స్టాక్‌ మార్కెట్‌ స్వాగతించడంతో బడ్జెట్‌ రోజున ఇన్వెస్టర్లు లాభాల వర్షంలో తడిసి ముద్దయ్యారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులో రూ.6.34 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. తద్వారా బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌క్యాప్‌ రూ.192.46 లక్షల కోట్లకు చేరుకుంది.

ఈ రంగాల షేర్లు ఎందుకు దూసుకెళ్లాయంటే...
► బ్యాంకింగ్‌ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఆస్తుల పునర్‌నిర్మాణ కంపెనీతో పాటు, ఆస్తుల నిర్వహణ కంపెనీల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా రూ.22 వేల కోట్ల రీ–క్యాపిటలైజేషన్‌ను ప్రకటించారు. ఫలితంగా ఇండస్‌ ఇండ్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు 15 శాతం నుంచి 11 శాతం లాభపడ్డాయి. ఆర్‌బీఎల్, యాక్సిస్, పీఎన్‌బీ, ఫెడరల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 6 నుంచి 11 శాతం ర్యాలీ చేశాయి.  

► జీవిత బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా ఈ రంగానికి చెందిన షేర్లు 12 శాతం నుంచి 4 శాతం లాభపడ్డాయి.  

► కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖకు ఈ ఏడాది రూ.1.80 లక్ష కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు ప్రకటించడంతో మౌలిక సదుపాయ రంగ కంపెనీలైన  ఎన్‌సీసీ లిమిటెడ్, అశోకా బిల్డ్‌కాన్, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్చన్స్, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ షేర్లు 14 శాతం నుంచి 5 శాతం లాభపడ్డాయి.  

► కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామనే ప్రకటనతో ఆటో షేర్ల ర్యాలీ కొనసాగింది.  కొత్త వాహనాలకు గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఆశలతో వాహన రంగ షేర్లు 10 శాతం వరకు లాభపడ్డాయి.

వచ్చేది ‘నెవర్‌ బిఫోర్‌ బడ్జెట్‌’ అంటూ  ఊరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  స్టాక్‌ మార్కెట్‌కు మాత్రం బూస్టర్‌ డోస్‌ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రాధాన్యతనిస్తూ.., ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్‌ – 2021కు దలాల్‌ స్ట్రీట్‌ సాదరంగా ఆహ్వానం పలికింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కొత్త తుక్కు విధాన ప్రకటన, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్‌ చెల్లింపుల ప్రమోషన్, ఎన్‌పీఏల కోసం ప్రత్యేకంగా ఏఆర్‌సీని ఏర్పాటు చేయడం లాంటి కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలు మార్కెట్‌ను ఆకట్టుకున్నాయి. కోవిడ్‌ సెస్, క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ వడ్డింపు లాంటి ఇబ్బందికర నిర్ణయాల ఊసు బడ్జెట్‌లో లేకపోవడం మార్కెట్‌కు ఉత్సాహానిచ్చింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్‌ల కంటే అత్యధికంగా మార్కెట్‌ను ఆకట్టుకున్న బడ్జెట్‌ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  చిదంబరం ఆర్థిక మంత్రిగా 1997 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టిన ‘డ్రీమ్‌ బడ్జెట్‌’ రోజున స్టాక్‌ మార్కెట్‌ 6% ర్యాలీ చేసింది.  24 ఏళ్ల తరువాత   సీతారామన్‌ తాజా బడ్జెట్‌ తో మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్‌ 5% ఎగసింది.

భారత ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ల డాలర్ల నుంచి 5 ట్రిలియన్ల డాలర్ల స్థాయికి పెంచేందుకు కేంద్ర బడ్జెట్‌ పునాది వేసింది. మౌలిక సదుపాయాలు, తయారీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణాన్ని మరింత పరిపూర్ణం చేయనుంది. పీఎస్‌యూ బ్యాంకుల రీ–క్యాపిటలైజేషన్‌తో దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో స్థిరత్వం కోవిడ్‌ ఆర్థిక వృద్ధికి, ఈక్విటీ మార్కెట్లకు కలిసొస్తుంది.
– విజయ్‌ చందోక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఎండీ

బడ్జెట్‌ స్వరూపం వృద్ధి ప్రాధాన్యతను కలిగి ఉంది. రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్‌కు దన్నుగా నిలిచే అవకాశం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ, ఆటో స్క్రాపేజీ పాలసీ, అసెట్‌ మోనిటైజేషన్‌ అంశాలు మార్కెట్‌కు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఫిబ్రవరి 5న వెలువడే ఆర్‌బీఐ పాలసీ విధాన ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది.  
– నీలేశ్‌ షా, కోటక్‌ మహీంద్ర అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ
 
No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement