అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 39,000 పాయింట్లకు చేరువ కాగా, నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగబాకింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు తగ్గి 73.29కు చేరినా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 3 శాతం మేర ఎగసినా, కరోనా కేసులు పెరుగుతున్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 277 పాయింట్లు ఎగసి 38,974 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 11,503 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీల లాభాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి.
సగం తగ్గిన లాభాలు
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 567 పాయింట్లు, నిఫ్టీ 161 పాయింట్లు చొప్పున పెరిగాయి. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా సూచీల లాభాలు సగం మేర తగ్గాయి. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న అమెరికా అథ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందన్న వార్తల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ జోష్‌తో ప్రపంచ మార్కెట్లు పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ రికవరీ వార్తలు, అమెరికా, భారత్‌లలో ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించిన ఆశావహ వార్తలు, క్యూ2 ఆర్థిక ఫలితాలు, మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు తుది తీర్పు... ఈ అంశాలన్నింటితో మార్కెట్ జోరు కొనసాగగలదని నిపుణులంటున్నారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలతో మార్కెట్ దూసుకెళ్తోందని వారంటున్నారు.
టీసీఎస్ మార్కెట్ క్యాప్ @ రూ.10 లక్షల కోట్లు
షేర్ల బైబ్యాక్ వార్తల కారణంగా ఐటీ దిగ్గజం టీసీఎస్ 7.3% లాభంతో రూ.2,707 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 8 శాతం లాభంతో రూ. 2,727 వద్ద ఆల్‌టైమ్ హైను తాకింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.69,082 కోట్లు పెరిగి రూ.10,15,714 కోట్లకు ఎగసింది. రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో భారత కంపెనీ ఇదే. మార్కెట్ క్యాప్ పరంగా భారత్‌లో రెండో అతి పెద్ద కంపెనీ కూడా ఇదే. రూ.15 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది.
ఏంజెల్ బ్రోకింగ్ ‘డిస్కౌంట్’ లిస్టింగ్
10 శాతం నష్టంతో క్లోజింగ్
ఏంజెల్ బ్రోకింగ్ షేర్ స్టాక్ మార్కెట్లో బలహీనంగా లిస్టయింది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ఇష్యూ ధర, రూ.306తో పోల్చితే 10% నష్టంతో రూ.275 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 16 శాతం నష్టంతో రూ.257 వద్ద కనిష్ట స్థాయిని తాకిన ఈ షేర్ చివరకు 10 శాతం నష్టంతో రూ.276 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,256 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో 9 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 85 లక్షల మేర షేర్లు ట్రేడయ్యాయి. గత నెలలో ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించింది.
మళ్లీ ఐపీఓకు ఆంటోని వేస్ట్ ఐపీఓ
ఘన వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఐపీఓలో భాగంగా రూ.98.5 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) మార్గంలో 99 లక్షల షేర్లను విక్రయించనున్నది. ఈ ఏడాది మార్చి4న ఆరంభమై 6న ముగియాల్సిన ఈ ఐపీఓను 16వ తేదీ వరకూ పొడిగించారు. కరోనా కల్లోలం కారణంగా తగిన స్థాయిలో బిడ్‌లు రాకపోవడంతో ఐపీఓను ఈ కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా సెబీకి ఐపీఓ పత్రాలను సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment