Union Budget 2021: Vijayasai Reddy Disappointed With Budget Allotted To AP - Sakshi
Sakshi News home page

ఏపీకి నిరాశ మిగిల్చిన బడ్జెట్‌

Published Mon, Feb 1 2021 5:38 PM | Last Updated on Mon, Feb 1 2021 7:45 PM

Budget 2021: Vijayasai Reddy Respond On Allocation Of Budjet To AP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత మిధున్‌ రెడ్డి, సహచర పార్టీ ఎంపీలతో కలిసి సోమవారం ఇక్కడి విజయ్‌ చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిందని ఆయన అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను బడ్జెట్‌లో విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఇది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఊసే లేదు..
ఎన్నడూ లేనటుంవటి బడ్జెట్‌ వస్తున్నదంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు గత బడ్జెట్‌లకు ఏమాత్రం భిన్నంగా లేదన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌లకు సంబంధించి తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున వాటికి వేల కోట్ల రూపాయల విలువైన రోడ్ల ప్రాజెక్ట్‌లను బడ్జెట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. అలాగే మెట్రో రైల్‌ విషయానికి వస్తే... కొచ్చి, బెంగుళూరు, చెన్నై, నాగపూర్‌లలో మెట్రో రైల్‌ కోసం వేల కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్‌ కావాలని అడుగుతున్నాం. కానీ దాని గురించి బడ్జెట్లో  ప్రస్తావన కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రాజెక్టు విషయంలో ఆత్మనిర్భర్‌ ఆంధ్రప్రదేశ్‌ ఊసే లేదని అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో రూ. 55,656 కోట్ల సవరించిన అంచనాల గురించి కూడా బడ్జెట్‌లో చెప్పలేదు. దీని మీద నెలకొన్న అస్పష్టతను తొలగించే ప్రయత్నం బడ్జెట్‌లో చేయలేదు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఖరగ్‌ఫూర్‌ నుంచి విజయవాడ, నాగపూర్‌ నుంచి విజయవాడ సరుకు రవాణా కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కానీ దానివల్ల రాష్ట్రానికి ఒరికే  ప్రయోజనం ఏమీ ఉండదు. కడప-బెంగుళూరు రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని ఇప్పటికి అనేకమార్లు అడిగాం. ఆ కేటాయింపులపై ప్రస్తావన లేదు. ఉద్యానవన పంటల రవాణా కోసం మరిన్ని కిసాన్ రైళ్లు అడిగాం. దేశం మొత్తంమీద 11.8% పండ్లు ఆంధ్రప్రదేశ్‌లోనే పండుతాయి. కాబట్టి దేశంలోని వివిధ నగరాలకు వాటిని త్వరితగతిన  రవాణా చేసేందుకు ఎక్కువ కిసాన్ రైళ్లు నడపాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్ మొహన్‌ రెడ్డి కేంద్రాన్ని అడుగుతూ వచ్చారు. బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదని విజయసాయి రెడ్డి అన్నారు.  ప్రత్యేక హోదా విషయంలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కానీ, ఈనాటి బీజేపీ ప్రభుత్వానికి కానీ మొదటి నుంచి ఆసక్తి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. హోదా విషయాన్ని కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘాలపై నెట్టివేస్తూ వచ్చిందని అన్నారు.

బడ్జెట్‌ విషయంలో వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్స్.. 

  • దేశవ్యాప్తంగా నాలుగు వైరాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. అందులో ఒక వైరాలజీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ సభ్యులంతా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
  • దేశంలో ఏడు టెక్స్‌టైల్స్‌ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. వాటిలో ఒకటి రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
  • విస్టాడోమ్‌ రైల్వే బోగీలు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం-అరకు మధ్య మరిన్ని విస్టాడోమ్‌ కోచ్‌లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
  • ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ సివిల్ సప్లైస్‌ కార్పొరేషన్‌కు కేంద్రం చెల్లించాల్సిన రూ.4,282 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
  • రాష్ట్రంలోని 13 జిల్లాలను త్వరలోనే 26 జిల్లాలుగా ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.
  • అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం అనేది చాలా ప్రధానమైన అంశమని ముఖ్యమంత్రి శ్రీ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. నదులన్నింటినీ అనుసంధానం చేసిన పిమ్మట టెలీమెట్రీ పరికరాల సాయంతో ప్రతి 15 రోజులకు ఒకసారి నదులలో ప్రవాహాన్ని అంచనా వేసి  ఆయా రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణత ప్రాతిపదికగా నదీ జలాలని కేటాయించాలన్నది మా ప్రభుత్వ విధానం. దాన్ని అనుసరించాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
  • పన్నుల సంస్కరణల విషయానికి వస్తే.. ఒక లక్షరూపాయలకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచాలనేది మా డిమాండ్‌. దాన్ని కూడా ఈసారి బడ్జెట్‌లో పరిగణలోకి తీసుకోలేదు.
  • బడ్జెట్‌లో ఒకే ఒక్క ఆశాజనకమైన అంశం కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌అభివృద్ధి, పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.35,000 కోట్లు ఖర్చు పెడుతోంది. అంతే తప్ప ఈ బడ్జెట్‌ వలన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు.
  • కరోనా నేపథ్యంలో అభివృద్ధికాముక బడ్జెట్ కావాలి కానీ సర్వసాధారణ బడ్జెట్‌ అవసరం లేదు. అప్పు చేసి అయినా డబ్బును చెలామణిలోకి తెస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. అభివృద్ధి అనేది అప్పుడే సాధ్యమౌతుందని అన్నారు.
  • ఈస్ట్రన్‌ రైల్వే కారిడార్‌లో ఖరగ్‌పూర్‌ - విజయవాడ వరకు సరుకు రవాణా కారిడార్ వేశారు. దీంతో మేం సంతృప్తి పడటం లేదని అన్నారు.
  • బడ్జెట్‌లో విశాఖపట్నంకు ఫిషింగ్ హబ్‌ కేటాయించారు. కానీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 ఫిషింగ్ హార్బర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దాంతో పోల్చి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక ఫిషింగ్ హార్బర్‌ ఏమాత్రం సరిపోదని అన్నారు.
  • వ్యవసాయ రంగానికి సంబంధించి..  పీఎం కిసాన్‌- రైతు భరోసా కింద ప్రతి రైతుకు సీఎం శ్రీ జగన్ గారు రూ.13,500 ఇస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,000 మాత్రమే ఇస్తోంది. ఆ మొత్తాన్ని రూ.10,000లకు పెంచాలని విజ్ఞప్తి చేయటం జరిగింది. రాష్ట్రంలో 65% ప్రజలు వ్యవసాయ ఆధారిత పనులపై జీవిస్తున్నారు. పీఎం కిసాన్ కేటాయింపుల్లో ఏమాత్రం మార్పు లేదు. దీన్ని రూ.10,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
  • కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌లో 1350 వ్యాధులు మాత్రమే కవర్ అవుతుంటే.. సీఎం శ్రీ జగన్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీలో 2,434 వ్యాధులు కవర్ అవుతాయి. దీనినిబట్టి ఆరోగ్యశ్రీ ఎంతో ఉత్తమమైనదని తెలుస్తోంది. ఆరోగ్యశ్రీలా ఆయుష్మాన్‌ భారత్‌ కూడా అన్ని వ్యాధులు కవర్ చేయాలని కోరారు.
  • రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దానికి సంబంధించి మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద బడ్జెట్‌లో రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. నవరత్నాల కింద 2020-21 రాష్ట్ర బడ్జెట్‌లో సామాజిక సంక్షేమం కోసం  చేసిన కేటాయింపుల్లో 110% పెరుగుదల కనిపిస్తుంటే  కేంద్ర బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు.
  • దేశంలో నిరుద్యోగ శాతం డిసెంబర్ 2020 నాటికి 38.7 మిలియన్లుగా ఉంది. గతేడాదితో (2019) పోల్చి చూస్తే 27.4 మిలియన్లుగా ఉంది. నిరుద్యోగ శాతం 11.3 మిలియన్లు పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించటానికి సీఎం శ్రీ జగన్‌ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాలంటీర్లు, సెక్రటేరియట్‌ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ప్రత్యేకంగా పెట్టుకోవటం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా రాష్ట్రం ముందుకు వచ్చిందని అన్నారు.
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద పని దినాలను  100 నుంచి 150 రోజులకు పెంచాలని కోరుతున్నాం. కానీ బడ్జెట్‌లో దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదని చెప్పారు.
  • ఈ బడ్జెట్‌ చాలా నిరాశజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు ఆశించిన స్థాయిలో ఈ బడ్జెట్‌లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారాయన.
  • దీనిని కేంద్ర బడ్జెట్ అని పిలిచే బదులు. వెస్ట్‌ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్‌ను పరిశీలించి చూస్తే ఇది మిగతా రాష్ట్రాలకు వర్తించదేమో అన్న అనుమానం కలుగుతోందని అన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement