న్యూఢిల్లీ : కరోనా పడగ నీడలో ఏడాదిగా బిక్కు బిక్కు మంటూ బతకడంతో ఆరోగ్యానికున్న ప్రాధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఆరోగ్య సంరక్షణే మార్గమని నిర్ణయానికొచ్చింది. కరోనాని నిర్మూలనకు ప్రజలందరికీ టీకాలు ఇవ్వడమే మార్గమని భావించి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి 35 వేల కోట్లు కేటాయించింది. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం నివారణ, చికిత్స, సంరక్షణే లక్ష్యాలుగా అడుగులు వేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ కాకుండా మరో కొత్త ఆరోగ్య పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన పేరిట వస్తున్న ఈ పథకం కోసం 64 వేల కోట్లు కేటాయించింది. ఇన్నాళ్లూ ఆరోగ్య రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన కేంద్రం ఇప్పుడు నిధుల్ని ఒకేసారి 137శాతం పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 2020–21 సంవత్సరంలో ఆరోగ్య రంగంలో బడ్జెట్ అంచనాలు రూ.94,452 కోట్లు కాగా, 2021–22లో రూ.2 లక్షల 23 వేల 846 కోట్లు బడ్జెట్ అంచనాలున్నట్టు వెల్లడించారు.
స్వచ్ఛ భారత్ నుంచి స్వాస్థ్య భారత్
ఆరోగ్య రంగమంటే రోగాలు, చికిత్స, ఆసుపత్రులు, ల్యాబ్‌లు మాత్రమే కాదు. సంపూర్ణ ప్రజారోగ్యం కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడం. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, రక్షిత నీరు, పోషకాహారాన్ని తీసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే అనారోగ్యమే మన దరి చేరదు. సరిగ్గా ఈ అంశాలనే ప్రాతిపదికగా తీసుకొని ఆరోగ్య రంగాన్ని మొదటి స్తంభంగా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఇన్నాళ్లూ అమల్లో ఉన్న సప్లిమెంటరీ న్యూట్రిషియన్ ప్రోగ్రామ్, పోషణ్ అభియాన్ కార్యక్రమాల్ని కలిపేసి మిషన్ పోషణ్ 2.0 కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. దీని కింద 112 జిల్లాల్లో పోషకాహారాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇక జల జీవన్ మిషన్‌కు రూ.50 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద వచ్చే అయిదేళ్లలో రూ.2 లక్షల 87 వేలు ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా 2.86 కోట్ల ఇళ్లకు మంచినీటి సౌకర్యం, పట్ణణ ప్రాంతాల్లో 4,378 స్థానిక సంస్థలకు మంచినీటి సరఫరా, 500 అమృత్ నగరాల్లో ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపడతారు. ఇక మన చుట్టుపక్కల ప్రాంతాలు అద్దంలా మెరిసిపోవడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద రూ. లక్షా 41వేల 678 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాల నిర్వహణ, మురికి నీటి నిర్వహణ, నిర్మాణ రంగం, కూల్చివేతల సమయంలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటారు. అదే విధంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 42 పట్టణాల్లో వాయుకాలుష్యాన్ని తగ్గించడం కోసం రూ.2,217 కోట్లు కేటాయించారు.
సంక్షోభం పాఠాలతో సంరక్షణ వైపు అడుగులు
కేటాయింపులు ఇలా..
కోవిడ్ వ్యాక్సిన్ 35వేల కోట్లు,
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 71,268.77కోట్లు
ఆత్మనిర్భర్ స్వాస్థ్య యోజన పథకం 64,180 కోట్లు
2,663 కోట్లు ఆరోగ్య రంగంలో పరిశోధనలు
50 వేల కోట్లు జల్ జీవన్ మిషన్‌కు
‘‘కరోనా వంటి విపత్తులు మరిన్ని ఎదురైనా భారత్ ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉందని ఈ సారి ఆరోగ్య రంగ కేటాయింపులు తేటతెల్లం చేస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం పారిశుద్ధ్యం, పౌష్టికాహారం, కాలుష్య నియంత్రణ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజారోగ్యం మరింత బలం పుంజుకునే అవకాశాలున్నాయి. ప్రాథమిక ఆరోగ్యంతో పాటుగా ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యంపైన కూడా దృష్టి కేటాయించడం హర్షణీయం. బడ్జెట్‌లో ఆరోగ్య రంగాన్ని అగ్రభాగంలో నిలపడం వల్ల అభివృద్ధికి కూడా బాటలు పడతాయి
– ప్రొఫెసర్ కె.శ్రీకాంత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ)
స్వాస్థ్య భారత్
బడ్జెట్‌లో కొత్తగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన పథకాన్ని తెచ్చారు. ప్రాథమిక, మాధ్యమిక, ప్రాంతీయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడం కోసం ఈ పథకం కోసం రూ. 64,180 కోట్లు కేటాయించారు. వచ్చే ఆరేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్‌తో పాటు ఈ కొత్త ఆరోగ్య పథకం అమలవుతుంది. ఈ పథకం ద్వారా ఏమేం
చేస్తారంటే...
ఆరోగ్య శ్రేయస్సు కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఏర్పాటు
► గ్రామీణ ప్రాంతాల్లో 17,788, పట్టణ ప్రాంతాల్లో 11,024 ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
► కొత్తగా నాలుగు ప్రాంతాల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ వైరాలజీ
► ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు, రెండు మొబైల్ ఆస్పత్రులు
►దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ప్రజారోగ్య ల్యాబ్స్, 11 రాష్ట్రాల్లో బ్లాక్ స్థాయిలో 3,382 ప్రజారోగ్య కేంద్రాల ఏర్పాటు
►నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), దానికి అనుబంధంగా పనిచేసే అయిదు శాఖల్ని మరింత పటిష్టపరచడం
► ప్రస్తుతం ఉన్న 33 ప్రజారోగ్య కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటుగా కొత్తగా 17 కేంద్రాల ఏర్పాటు
►ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతం కోసం ప్రాంతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు
► తొమ్మిది బయో సేఫ్టీ లెవల్
► ల్యాబొరేటరీల ఏర్పాటు
సామాజిక న్యాయం, సాధికారతకు రూ.11,689
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌లో మొత్తం రూ.11,689 కోట్ల కేటాయింపులు జరిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 28.35 శాతం నిధులు పెరిగాయి. వెనుకబడిన తరగతుల వారికి 2020–21 బడ్జెట్‌లో రూ.8,207.56 కోట్లు కేటాయించగా, 2021–22 బడ్జెట్‌లో రూ.10,517.62 కోట్లు కేటాయించారు. గత దానితో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువ. దివ్యాంగుల సాధికారికత కోసం 2020–21లో రూ.900 కోట్లు కేటాయించగా, ఈసారి 1,171.77 కోట్లు కేటాయించారు. ఇది గతంతో పోలిస్తే 30.19 శాతం ఎక్కువ.
జాతీయ కమిషన్లకు రూ.250 కోట్లు..
మూడు జాతీయ కమిషన్లు.. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్, సఫాయ్ కరంచారిస్ జాతీయ కమిషన్లకు 2021–22 బడ్జెట్‌లో మొత్తం రూ.250 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయించారు. కేంద్ర ఉపకార వేతనాలకు సంబంధించి ఎస్సీ, ఓబీసీ, ఈబీసీలకు నేషనల్ ఫెలోషిప్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఎస్సీలకు, ఓబీసీలకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు.
స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలకు రూ.377 కోట్లు..
స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్స్ డిసేబిలిటీ స్టడీస్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యూనివర్సల్ డిజైన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్‌లకు మొత్తం రూ.377 కోట్లు కేటాయించారు.
సామాజిక సేవలకు రూ.1,017 కోట్లు..
సామాజిక సేవల రంగానికి 2020–21 బడ్జెట్‌లో రూ.784 కోట్లు కేటాయించగా, 2021–22 బడ్జెట్‌లో రూ.1,017 కోట్లు కేటాయించారు. అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం చేపట్టే జాతీయ కార్యక్రమాలకు సంబంధించి గత బడ్జెట్‌లో రూ.436.89 కోట్లు కేటాయించగా, ఈసారి 709 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment