న్యూఢిల్లీ : వ్యక్తిగత ఆదాయపన్ను (ప్రత్యక్ష పన్ను) రేట్లలో కచ్చితంగా మార్పులు ఉంటాయన్న అంచనాలకు భిన్నంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. యథాతథ స్థితికే మొగ్గు చూపించారు. ఆదాయపన్ను శ్లాబుల్లోకానీ, రేట్లలో కానీ మార్పుల జోలికి వెళ్లలేదు. ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఆదాయం పెంచుకునేందుకు ఆదాయపన్ను రేట్లను పెంచకపోవడమే. రూ.2,50,000 లక్షల వరకు ఉన్న బేసిక్ ఎగ్జెంప్షన్ అలానే కొనసాగనుంది. రూ.2,50,000కు పైన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 వరకు ఉన్నా కానీ (మినహాయింపులు పోను) పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు. సెక్షన్ 87ఏ కింద రూ.12,500 రాయితీని పొందొచ్చు. దీంతో పలు సెక్షన్ల కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకున్న అనంతరం నికర ఆదాయం రూ.5లక్షల వరకు ఉంటే పన్ను బాధ్యత లేదు.
2020–21 ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న రేట్ల ప్రకారమే ఆదాయపన్ను చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 2020 బడ్జెట్‌లో నూతన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తూ.. పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చిన విధానంలో కొనసాగొచ్చంటూ మంత్రి సీతారామన్ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ రెండు విధానాలు ఇక ముందూ కొనసాగనున్నాయి. కాకపోతే ఒక్కసారి నూతన విధానాన్ని ఎంచుకుంటే, మళ్లీ తిరిగి పాత విధానానికి మారేందుకు వీలుండదు. నూతన పన్ను విధానంలో చాలా వరకు పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పన్నుల రేటు తక్కువగా ఉంటుంది.
భవిష్యనిధి చందాపై పన్ను
అధిక ఆదాయ వర్గాల భవిష్యనిధి వాటాలపై స్వల్ప పన్నును మంత్రి ప్రతిపాదించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి తరఫున చందా రూ.2.5లక్షలు మించితే, వడ్డీ ఆదాయంపై 1 శాతం పన్ను 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో అధిక విలువ కలిగిన డిపాజిటర్లను మంత్రి లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈపీఎఫ్ అని గుర్తు చేస్తూ.. నెలకు రూ.2లక్షల్లోపు ఆర్జించే వారిపై తాజా ప్రతిపాదన ఎటువంటి ప్రభావం చూపించదని మీడియా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు. రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ పరిమితిగా ఉందని, ఈ మొత్తంపై వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. రూ.2.5 లక్షలకు మించి చందాదారుల సంఖ్య మొత్తం సభ్యుల్లో ఒక శాతాన్ని మించదని వ్యయాల విభాగం సెక్రటరీ టీవీ సోమనాథన్ తెలిపారు.
75 దాటితే నో ఐటీ రిటర్న్స్
పెన్షన్ ఆదాయం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆదాయం కలిగిన 75 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న వారు ఇక మీదట ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ అందుకుం టున్న బ్యాంకులోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆదాయం కూడా వస్తుండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. 75 ఏళ్లు నిండిన వృద్ధులపై నిబంధనల అమలు భారాన్ని దించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు. రిటర్నుల దాఖలులో మినహాయింపునిచ్చినా కానీ, పన్ను బాధ్యత మాత్రం కొనసాగుతుంది. అంటే ఆదాయంపై నిబంధనల మేరకు పన్నును సంబంధిత బ్యాంకు మినహా యించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుందని ఆర్థిక శాఖా కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మీడియాకు స్పష్టం చేశారు. పెన్షన్, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒకే బ్యాంకు నుంచి ఉంటేనే ఈ వెసులుబాటు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఆదాయం వస్తూ, మరో బ్యాంకులో ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పెన్షన్, ఎఫ్‌డీలపై వడ్డీకాకుండా ఇతర రూపాల్లో ఆదాయం ఉన్నా కానీ రిటర్నుల దాఖలు తప్పనిసరి.
సొంతింటి రుణ వడ్డీపై పన్ను మినహాయింపు
అందుబాటు ధరల ఇళ్లను రుణంపై కొనుగోలు చేసుకునే వారికి ఈ బడ్జెట్‌లో ఊరట లభించింది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.1.5లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో అదనంగా కల్పించిన పన్ను మినహాయింపును.. మరో ఏడాది పాటు 2022 మార్చి 31 వరకు పొడిగిస్తూ బడ్జెట్‌లో నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఇళ్ల కొనుగోలుపైనా ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. వాస్తవానికి ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపు గతంలో ఉండగా, దీనికి అదనంగా మరో రూ.1.5లక్షలపైనా పన్ను మినహాయింపును సెక్షన్ 80ఈఈఏ కింద 2019 బడ్జెట్‌లో ప్రకటించారు. మొదటిసారి ఇంటి కొనుగోలు చేసుకునే వారు, అది కూడా రూ.45లక్షల బడ్జెట్ మించని ఇళ్ల కొనుగోలుదారులకే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంటే మొత్తం మీద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.3.5 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఇది కాకుండా ఇంటి రుణం అసలుకు చేసే జమలు రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద చూపించుకునే అవకాశం ఎలానూ ఉంది.
ఇంటిపై పన్ను ప్రయోజనాలు ఇవే..
సెక్షన్ 80సీ: ఇంటి రుణంలో అసలుకు (ప్రిన్సిపల్) చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్లలోపు విక్రయించకుండా ఉంటేనే ఈ మినహాయింపులకు అర్హులు. ఒకవేళ విక్రయిస్తే తిరిగి పన్ను చెల్లించాల్సి వస్తుంది.
సెక్షన్ 24బీ: ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే నూతన ఇల్లు కొనుగోలు/నిర్మాణం అన్నది రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సెక్షన్ 80ఈఈ: ఈ సెక్షన్ కింద రూ.50,000 వడ్డీ చెల్లింపులపై అదనపు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రుణం రూ.35 లక్షలకు మించకూడదు. ప్రాపర్టీ విలువ రూ.50లక్షలు మించకూడదు.
సెక్షన్ 80ఈఈఏ: రూ.45 లక్షలకు మించని, మొదటిసారి ఇల్లు కొనుగోలుపై సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా (24బీకి అదనంగా) మరో రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వారు సెక్షన్80ఈఈ కింద క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు.
సెక్షన్80సీ: ఈ సెక్షన్ కింద స్టాంప్ డ్యూటీ చెల్లింపులు రూ.1.5లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. చెల్లింపులు చేసిన ఆర్థిక సంవత్సరానికే క్లెయిమ్ చేసుకునే అర్హత ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment