సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నష్టాలకు కేంద్రం నుంచి ఆర్థిక చేయూత ఉంటుందని ఆశించిన ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. తాజా బడ్జెట్‌లో ఆర్టీసీలకు కోవిడ్ నష్టాలకు సాయం చేసే అంశాన్ని పొందుపరచలేదు. రోడ్డు రవాణా సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉన్న నేపథ్యంలో.. కోవిడ్ నష్టాలకు ఎంతోకొంత సాయం అందుతుందన్న ఆర్టీసీ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కోవిడ్ వల్ల ఆర్టీసీ దాదాపు రూ.2 వేల కోట్ల వరకు నష్టపోయిందని ఇటీవల సంస్థ తేల్చింది. అందులో కొంత మొత్తం కేంద్రం నుంచి వస్తుందని ఆశించింది. ఆ మేరకు బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని ఎదురుచూసింది. కానీ, బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం, తర్వాత బడ్జె ట్ పుస్తకంలో అది కనిపించకపోవటంతో ఇక సాయం అందదన్న నిర్ణయానికి వచ్చింది. 2019లో సమ్మె జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వ వాటా, ఆర్థిక సాయం అంశం పలుమార్లు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ వాటా, ఆర్థిక సాయంపై ప్రశ్నించారు కూడా. కోవిడ్ మహమ్మారి రూపంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణాకు నష్టం వాటిల్లిన నేపథ్యం లో.. మళ్లీ కేంద్రం వాటా, సాయం అంశం చర్చకు వచ్చింది.
సాయం లేకపోగా నష్టం చేసే చర్యలా..
కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్‌లో నగరాల్లో ప్రజా రవాణాను బలోపేతం చేసే పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అంశాన్ని పొందుపరిచిన విషయం తెలిసిందే. ప్రైవేటు సంస్థలు బస్సులను నిర్వహించేలా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా దీనిపై కార్మిక సంఘాల వైపు నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లుగా నగరాల్లో ప్రజా రవాణా బలోపేతం పేరుతో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తే అది తుదకు ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్టే అవుతుందని ఆర్టీసీ బోర్డు మాజీ సభ్యుడు, సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆర్టీసీలో వాటా ఉన్నందున కేంద్రం ఆర్థిక రూపంలో సాయం చేయాలని, కానీ ఇలా ఆర్టీసీలను నష్టపరిచే నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు.