సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసైకి మధ్య ఉన్న విభేదాలు ఆర్టీసీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బిల్లు పెండింగ్‌లో పడి తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మారకుండా ఆగిపోతామా? అనే సందిగ్ధం నెలకొంది. గవర్నర్ పెద్ద మనసుతో కొర్రీలు పెట్టకుండా బిల్లును అనుమతించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం రెండు గంటల పాటు బస్సు బంద్‌కు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున పోగై పీవీ మార్గ్ గుండా బయలుదేరి రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు.
దాడి ఎదురుదాడి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తమ సర్కార్ మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ అడ్డుపడుతున్నారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తుంది. ఇంకోవైపు ఇదంతా బీఆర్ఎస్ డైరెక్షన్‌లోనే జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఆర్టీసీ బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందిస్తూ ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023 విషయంలో గవర్నర్ పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గవర్నర్ కు బిల్లు పంపారు. గవర్నర్ బిల్లు చూడాలి. చదవాలి. సంతకం చేయాలి. గవర్నర్ అందుబాటులో లేరు అని చెబుతున్నా.. ప్రభుత్వం హడావుడి చేస్తోందని మండిపడ్డారు.
ఐదు అంశాలపై వివరణ
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా?
విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు. ఈక్రమంలో గవర్నర్ అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు తెలిసింది.
ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఆర్టీసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కల్పించాలని ఇటీవలి కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదివారంతో రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగుస్తున్నాయి. ఆలోగా బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి లభించడం అనుమానమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు నైరాశ్యంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment