అదానీ స్కామ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. ఇంకోపక్క బీఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు వ్యూహాలు రచిస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ప్రకటించిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు రేవంత్ ప్రకటించి తొలి అస్త్రం సంధించగా అదే అదానీతో రేవంత్ కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, హరీశ్‌లు ఆరోపణలకు దిగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ఉలుకు, పలుకూ లేకుండా ఉండటం. బహుశా మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉన్నట్టుంది బాబు గారి పరిస్థితి!
సౌర విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీపై కూడా కాంగ్రెస్ తనదైన శైలిలో విరుచుకుపడింది. అయితే ఈ అంశం తెలంగాణలో రేవంత్‌కు కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తూంటే.. రేవంత్ మాత్రం కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, రేవంత్‌లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీతో సంబంధాలు, పెట్టుబడులపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు రాహుల్ కొంత తడబడాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఏమైందో కాని తెలంగాణ సీఎం స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దావోస్‌లో అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని, రేవంత్ స్వస్థలం కొడంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సంగతేమిటి? అని కూడా కేటీఆర్, హరీశ్‌కు ప్రశ్నిస్తున్నారు. అదానీకి తాము గతంలో రెడ్‌లైట్ చూపామని, రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రేవంత్ ప్రభుత్వం కమిషన్లు వేయడం, ఈ-ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల దుర్వినియోగం ఆరోపణతోపాటు కొన్ని ఇతర అంశాల విషయంలోనూ కేటీఆర్‌పై కేసులు పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా రేవంత్ బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల హామీల అమలు వైఫల్యంతోపాటు హైడ్రా వ్యవహారాలు, మూసీ నదీగర్భంలో ఇళ్ల కూల్చివేత, లగచర్ల భూసేకరణ వివాదం వంటి అంశాలతో బీఆర్‌ఎస్ జనాల్లోకి వెళుతోంది. వీటన్నింటి మధ్యలో వచ్చిన అదానీ కేసును కూడా అందిపుచ్చుకునేందుకు ఇరు పక్షాలూ ప్రయత్నిస్తున్నాయి.
నిజానికి అదాని విరాళానికి, ఆయనపై వచ్చిన కేసుకు సంబంధం ఉండకూడదు. కానీ.. రాజకీయాలలో పరిస్థితి అలా ఉండదు. అదానీ ప్రధాని మోడీకి సన్నిహితుడని, అతడిని రక్షిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు ఆరోపిస్తున్న విషయం కొన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు, నేతలకూ ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌తో చత్తీస్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. దీన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడులోని డీఎంకే ఆధ్వర్యంలోని కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి. జమ్ము-కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉండగా ఒప్పందం కుదిరింది. అంటే బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్రంలలో ఒప్పందం కుదురిందన్నమాట. ఇందులో అవినీతి జరిగి ఉంటే ఆ మకిలీ కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ అంటుకుంటున్నట్లు అవుతుంది కదా! బీజేపీ ఇదే వాదన చేసి కాంగ్రెస్ పై ద్వజమెత్తింది. ఈ క్రమంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇరుకునపడినట్లయింది.
ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!
విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణతో జరగక పోయినా ఆ ప్రభావం పెట్టుబడులపై పడుతోంది. రాజకీయంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై రేవంత్ వివరణ ఇస్తూ తానేదో అప్పనంగా వంద కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం తనకు ఇష్టం లేదని, స్కిల్ యూనివర్శిటీ వివాదాలలో చిక్కుకోరాదన్న భావనతో అదానీ విరాళాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అయితే తొలుత రేవంత్ ప్రభుత్వం సంతోషంగానే ఈ మొత్తాన్ని స్వీకరించడానికి సిద్దపడింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనివర్శిటీకి ఉపయోగపడుతుందని భావించింది. కానీ రాజకీయ విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు.
గతంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం కష్టమన్న భావను రేవంత్ వ్యక్తపరిచారు. వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదానీతో డేటా సెంటర్ తదితర అగ్రిమెంట్లు చేసుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై బీఆర్‌ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. నిజమే! ఏ పారిశ్రామిక వేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానిని స్వీకరించకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే రేవంత్ అన్నట్లు పరిశ్రమలు రాకపోతే తేలేదని అంటారు. తీరా ఏవైనా పరిశ్రమలు వస్తే ఆరోపణలు చేస్తుంటారని ఆయన అన్నారు.
అనుభవమైంది కనుక రేవంత్ ఈ మాటలు చెబుతున్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్ విపక్షంలో ఉంటే ఆయన కూడా ఇదే తరహా రచ్చ చేసేవారు. అంతెందుకు...గతంలో వైఎస్ జగన్ పై పెట్టిన ఆక్రమ కేసులలో అనేక పరిశ్రమలకు తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్ అడ్డుపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల ఉమ్మడి ఏపీకి చాలా నష్టం జరిగింది. అమెరికాలో అదానీ కేసు తేలకముందే ఇక్కడ రాజకీయ దుమారాన్ని సృష్టించుకుని పెట్టుబడులపై ప్రభావం పడేలా చేస్తారా అన్న చర్చ వస్తుంది.
మరో వైపు చంద్రబాబు నాయుడు ఏపీలో జగన్ టైమ్ లో ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ, అదే టైమ్‌లో అదానితో మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. జగన్ లేనిపోని ఆరోపణలు చేసే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదిరిన ఒప్పందం గురించి మాట్లాడదు. ఈ ఒప్పందం వల్ల రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. ఈనాడు రాసింది నిజమే అయితే చంద్రబాబు వెంటనే సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా! అదానితో జగన్ ప్రభుత్వం అసలు ఒప్పందమే చేసుకోకపోయినా, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వార్చుతోంది. అదానీ పై తన వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పరు.
జగన్ టైమ్ లో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సౌర, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను చేపట్టడానికి అదాని ముందుకు వచ్చారు. వాటిని కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అదానిని ఏమైనా అంటే అది మోడీకే తగులుతుందన్న భయంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలియడం లేదా? పోనీ జగన్ టైమ్ లో కుదిరిన అగ్రిమెంట్లను వదలివేసి కొత్తగా అదానితో ఎలాంటి ఒప్పందాలు ఉండబోవని చంద్రబాబు ప్రభుత్వం చెప్పగలుగుతుందా? అలాంటిది ఏమీ లేదు. పైగా అదానికి స్వయంగా ఎదురేగి స్వాగతం పలికి అనేక రంగాలతో పాటు అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆ గ్రూపు ముందుకు వచ్చిందని చంద్రబాబు ఆనందంగా ప్రకటించారు. అంటే అదానితో స్నేహం ఉండాలి. కాని జగన్ ను మాత్రం అప్రతిష్టపాలు చేయాలన్నమాట. చంద్రబాబు వ్యూహంలోని డొల్లతనం ఇక్కడే బహిర్గతం అయిపోతోంది. అదానీ, అంబాని వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడి తెస్తూంటే ఎవరూ వద్దనలేని పరిస్థితి ఉంది. కాకపోతే పారిశ్రామికవేత్తలపై వచ్చే ఆరోపణలను తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మాత్రం వాడుకుంటున్నారు.
ఇక్కడ ఒక సంగతి గమనంలోకి తీసుకోవాలి. అంబానీ, అదాని తదితర బడా పారిశ్రామికవేత్తలను కాదని కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయడానికి సిద్దపడవన్నది వాస్తవం. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అంబానీకి వ్యతిరేకంగా అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నేపథ్యంలో ఆయన శాఖే మారిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
ఈనాడు మీడియా ఇన్ని నీతులు వల్లిస్తుంటుంది కదా.. అంబానీకి వ్యతిరేకంగా ఒక్క వార్త ఇవ్వగలుగుతుందా? మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీకి అంబానీ సాయపడ్డారని చెబుతారు. ఇప్పుడు కూడా అంబానీ, అదానీలు బీజేపీకి సన్నిహితులే.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదానీపై విమర్శలు చేస్తున్నా, అధికారంలోకి వస్తే వారూ ఏమీ చేయరన్నది బహిరంగ రహస్యమే. అంబానీ, అదానీలను కాదంటే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. రాజకీయ దుమారం వేరు. వాస్తవ పరిస్థితి వేరు. ఇలాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, మరెవరైనా అతీతం కాదన్నది నిజం.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment