సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి 2021-22 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రం బడ్జెట్ యాప్‌ను విడుదల చేసింది. ఇక విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్... కరోనా లాక్‌డౌన్ దెబ్బకు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీయే సర్కారు తీసుకున్న చర్యల గురించి వివరించారు. ‘‘అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం. లాక్‌డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం పంపిణీ చేశాం. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించాం. 80 మిలియన్ల జనాభాకు ఉచిత గ్యాస్ అందజేశాం’’ అని పేర్కొన్నారు.
అదే విధంగా... కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో రెండు వ్యాక్సిన్లు భారత్‌తో పాటు ఇతర దేశాలకు వాక్సిన్ల డోసులు ఎగుమతి చేస్తున్నామని ప్రకటించారు. ‘‘100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం. కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం’’ అని తెలిపారు.(చదవండి: లైవ్ అప్‌డేట్స్: బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ )
ఇక గతంలో ఎన్నడూలేని పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్న ఆర్థిక మంత్రి.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. గతేడాది లాక్‌డౌన్ అమలు చేయాలన్న నిర్ణయం కఠినమైనదేనన్న నిర్మలా సీతారామన్... లాక్‌డౌన్ విధించకపోతే మరింత ఘోరమైన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో.. ఆరేళ్ల కాలానికి గానూ 64,180 కోట్లతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన ప్రకటించిన ఆర్థిక మంత్రి.. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment