ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్లు రూ.30,497 కోట్లు | Revenue deficit grants to AP were Rs 30497 crore | Sakshi
Sakshi News home page

ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్లు రూ.30,497 కోట్లు

Published Tue, Feb 2 2021 3:31 AM | Last Updated on Tue, Feb 2 2021 8:59 AM

Revenue deficit grants to AP were Rs 30497 crore - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రానున్న ఐదేళ్లలో కేంద్ర పన్నుల్లో వాటా, రెవెన్యూ లోటు గ్రాంట్లు, ఇతర గ్రాంట్లు కలిపి రూ.2.34 లక్షల కోట్ల మేర నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇందులో ఐదేళ్లకు పన్నుల వాటాగా రూ.1.70 లక్షల కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు రూ.30,497 కోట్లు ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటా తగ్గగా.. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆదాయాన్ని కోల్పోనుంది. 2021–26 మధ్య ఐదేళ్ల కాలానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లను నిర్దేశిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

రాజ్యసభ మాజీ సభ్యుడు ఎన్‌.కె.సింగ్‌ నేతృత్వంలో 2017 నవంబర్‌లో ఏర్పాటైన ఈ కమిషన్‌ తొలుత 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వాటా సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వగా.. ఐదేళ్ల కాలానికి అంటే 2021–2026 వరకు పన్నుల వాటా సిఫారసులతో కూడిన పూర్తి స్థాయి నివేదికను 2020 నవంబర్‌ 9న రాష్ట్రపతికి సమర్పించింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో 42 శాతం వాటాను రాష్ట్రాలకు పంచాలని సిఫారసు చేయగా.. 15వ ఆర్థిక సంఘం 2020–21 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర నివేదిక ఇస్తూ 41 శాతం వాటాను సిఫారసు చేసింది. తాజాగా రానున్న ఐదేళ్లకు కూడా 41 శాతం వాటాను సిఫారసు చేసింది. దీని ప్రకారం కేంద్రం రూ.42.2 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంచనుంది. ఇక మొత్తం 17 రాష్ట్రాలకు రూ.2,94,514 కోట్లను రెవెన్యూ లోటు గ్రాంటుగా సిఫారసు చేసింది.

పది లక్షల జనాభా పైబడిన నగరాలకు గ్రాంట్లు
పది లక్షల జనాభా పైబడిన నగరాల్లో పట్టణీకరణ సమస్యలు ఎదుర్కోవడానికి, మౌలిక వసతుల కల్పనకు 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక గ్రాంట్లు సిఫారసు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,116 కోట్లు సిఫారసు చేసింది. ఇందులో విజయవాడకు రూ.514 కోట్లు, విశాఖపట్నానికి రూ.602 కోట్లు సిఫారసు చేసింది. ఘన పదార్థాల వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, వాయు నాణ్యత తదితర అంశాలకు వీటిని వినియోగించాల్సి ఉంటుంది.

మరింత తగ్గిన వాటా.. రూ.11 వేల కోట్ల నష్టం
► 14వ ఆర్థిక సంఘం 2015–20 మధ్య కాలానికి ఏపీ పన్నుల వాటాను 4.305 శాతంగా నిర్ధారించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ద్వారా దానిని 4.11 శాతానికి కుదించింది. 
► తాజాగా 2021–2026 వరకు ఐదేళ్ల పాటు ఏపీకి పన్నుల వాటాను 4.047 శాతానికి కుదించింది. ఈ కారణంగా పన్నుల వాటా ఆదాయం కొంత తగ్గనుంది. జనాభాకు 15 శాతం, ప్రాంత (రాష్ట్ర) విస్తీర్ణం 15 శాతం, అటవీ ప్రాంతం, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వ్యత్యాసం 45 శాతం, పన్ను, ఆదాయ సముపార్జన ప్రయత్నాలు 2.5 శాతం, జనాభా నియంత్రణ పనితీరు (డెమొగ్రాఫిక్‌ పర్‌ఫార్మెన్స్‌)కు 12.5 శాతం ప్రాధాన్యం ఇచ్చి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటా పంచింది.
► 2011 జనాభాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. కేంద్రంగానీ, 15వ ఆర్థిక సంఘం గానీ పట్టించుకోలేదు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గి.. ఉత్తరాది రాష్ట్రాల వాటా పెరిగింది.
► 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల వాటా స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం తమిళనాడు వాటా మాత్రమే స్వల్పంగా పెరిగింది. ఈ లెక్కన 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే సుమారు రూ. 11 వేల కోట్ల మేర ఏపీ నష్టపోనుంది.

ఏపీకి బదిలీ అయ్యే మొత్తం ఇలా..
► ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ఐదేళ్లలో కేంద్రం నుంచి మొత్తంగా రూ.2,34,013 కోట్లు బదిలీ కావాలని ఆర్థిక సంఘం నిర్ధేశించింది. ఇందులో రూ.1,70,976 పన్నుల వాటాగా అంచనా వేసింది. రూ.63,037 కోట్ల మేర గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని నిర్దేశించింది.
► ఈ గ్రాంట్లలో సింహభాగం రెవెన్యూ లోటు గ్రాంటు ద్వారా రానుంది. ఇవి కాకుండా స్థానిక సంస్థలు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, వ్యవసాయ రంగానికి గ్రాంట్లతో పాటు రాష్ట్ర ప్రతిపాదనల మేరకు స్టేట్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్లు కూడా సిఫారసు చేసింది. 
► 15వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు గ్రాంటు సిఫారసు చేసింది. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా నుంచి పంపిణీ అయ్యాక 2021–22లో రూ.17,257 కోట్లు, 2022–23లో రూ.10,549 కోట్లు, 2023–24లో రూ.2,691 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడుతుందని అంచనా వేసి, ఆమేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లు సిఫారసు చేసింది. 
► అయితే 2024–25లో రూ.8,458 కోట్ల మేర, 2025–26లో రూ.23,368 కోట్లు రెవెన్యూ మిగులు ఏర్పడుతుందని అంచనా వేస్తూ ఆయా ఆర్థిక సంవత్సరాలకు రెవెన్యూ లోటు గ్రాంట్లు సిఫారసు చేయలేదు.

మరింత తగ్గిన వాటా.. రూ.11 వేల కోట్ల నష్టం
► 14వ ఆర్థిక సంఘం 2015–20 మధ్య కాలానికి ఏపీ పన్నుల వాటాను 4.305 శాతంగా నిర్ధారించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ద్వారా దానిని 4.11 శాతానికి కుదించింది. 
► తాజాగా 2021–2026 వరకు ఐదేళ్ల పాటు ఏపీకి పన్నుల వాటాను 4.047 శాతానికి కుదించింది. ఈ కారణంగా పన్నుల వాటా ఆదాయం కొంత తగ్గనుంది. జనాభాకు 15 శాతం, ప్రాంత (రాష్ట్ర) విస్తీర్ణం 15 శాతం, అటవీ ప్రాంతం, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వ్యత్యాసం 45 శాతం, పన్ను, ఆదాయ సముపార్జన ప్రయత్నాలు 2.5 శాతం, జనాభా నియంత్రణ పనితీరు (డెమొగ్రాఫిక్‌ పర్‌ఫార్మెన్స్‌)కు 12.5 శాతం ప్రాధాన్యం ఇచ్చి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వాటా పంచింది.
► 2011 జనాభాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌పై దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. కేంద్రంగానీ, 15వ ఆర్థిక సంఘం గానీ పట్టించుకోలేదు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గి.. ఉత్తరాది రాష్ట్రాల వాటా పెరిగింది.
► 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల వాటా స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం తమిళనాడు వాటా మాత్రమే స్వల్పంగా పెరిగింది. ఈ లెక్కన 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన పన్నుల వాటాతో పోల్చితే సుమారు రూ. 11 వేల కోట్ల మేర ఏపీ నష్టపోనుంది.

విశాఖ అభివృద్ధికి రూ.1,400 కోట్లు
విశాఖను ఆర్థిక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో 15వ ఆర్థిక సంఘం ఏకీభవించింది. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అత్యంత అవసరమైన భవనాల నిర్మాణానికి రూ.1,400 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నిధులతో విశాఖలో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయని, రక్షిత తాగునీటి సరఫరా ద్వారా దీనికిఅడ్డుకట్ట వేయడానికి నిధుల మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను 15వ ఆర్థిక సంఘం బలపరిచింది. రూ.300 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. పల్నాడు, కనిగిరి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రక్షిత తాగునీటి సరఫరా ద్వారా ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ కోరికను 15వ ఆర్థిక సంఘం ఆమోదిస్తూ ఇందుకు రూ.400 కోట్లను మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. యురేనియంను శుద్ధి చేయడం వల్ల పులివెందుల నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఆ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. ఇందుకోసం రూ.200 కోట్లు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు ప్రత్యేకంగా రూ.2,300 కోట్ల మంజూరుకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 

ద్రవ్య క్రమశిక్షణ మెరుగు పడాలి
► 2015–16లో ద్రవ్యలోటు–జీఎస్‌డీపీ రేషియో 3.7 శాతం ఉండగా.. 2016–17లో 4.5 శాతం, 2017–18లో 4.1 శాతం ఉందని, డెట్‌–జీఎస్‌డీపీ రేషియో 2015–16లో 28.1 శాతం, 2018–19లో 29.8 శాతం ఉందని ప్రస్తావించింది. అందువల్ల వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం లోటును, అప్పులను తగ్గించి మనగలిగే స్థాయికి తీసుకురావాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. 
► రాష్ట్రం కేంద్ర బదిలీలపై ఎక్కువగా ఆధార పడుతోందని, 2016–17లో ఏపీ మొత్తం రెవెన్యూ రిసీట్స్‌(టీఆర్‌ఆర్‌)లో 50 శాతం కంటే ఇది ఎక్కువగా ఉందని ప్రస్తావించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించింది.
► రాష్ట్ర స్థూల విలువ జోడింపు(జీఎస్‌వీఏ)లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా ఎక్కువగా ఉందని(2015–16లో 31 శాతం, 2018–19లో 35 శాతం), అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్వరూపానికి ఇది భిన్నమని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించింది. 2016–17 ప్రకారం జాతీయ నిర్మాణంలో కీలకమైన రంగాలపై ఏపీ తలసరి వ్యయం తక్కువగా ఉందని, దీనిని పెంచాలని సూచించింది.
► అగ్రిగేట్‌ టెక్నికల్‌ అండ్‌ కమర్షియల్‌ నష్టాలు 2017–18లో నిర్దేశిత లక్ష్యం 9 శాతం ఉండగా.. వాస్తవానికి అవి 14.26 శాతంగా ఉన్నాయని, 2018–19లో 25.7 శాతానికి పెరిగాయని ప్రస్తావించింది. లీకేజ్‌ లేకుండా మరిన్ని సంస్కరణలు తేవాలని సూచించింది.
► ఆర్‌బీఐ అధ్యయనం ప్రకారం ఏపీ, తెలంగాణలో 2014లో రుణ మాఫీ.. రాష్ట్రాల ఆర్థిక క్రమ శిక్షణపై ప్రభావం చూపిందని ఆర్థిక సంఘం ప్రస్తావించింది.  

కేంద్ర పన్నుల వాటా నుంచి తగ్గిన నిధులు 
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో పాటు కోవిడ్‌–19 నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కూడా ఈ ఆర్థిక ఏడాది కోత పడటం రాష్ట్రానికి కొంత మేర ఆర్థికంగా నష్టం కలగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21)..  కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.32,297 కోట్లు (4.111 శాతం) కేటాయింపులు చేశారు. అయితే సవరించిన బడ్జెట్‌ ప్రకారం రాష్ట్రానికి వచ్చే నిధులు కేవలం రూ.22,610 కోట్లేనని తేల్చారు. ఈ లెక్కన రూ.9,687 కోట్ల మేర కోత పడింది. వచ్చే ఆర్థిక ఏడాది (2021–22) బడ్జెట్‌లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను 4.047 శాతానికి తగ్గించేయడం విచిత్రంగా ఉంది. వచ్చే ఆర్థిక ఏడాది కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.26,935 కోట్లు వస్తాయని స్పష్టం చేశారు.  
► ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరుతూ వస్తున్నా, పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉండగా, వాటి గురించి ప్రస్తావించలేదు.  
► రాష్ట్ర విభజన సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ కాగ్‌ పేర్కొన్న మేరకు రెవెన్యూ లోటు భర్తీకి కేటాయింపులు చేయలేదు.   
► 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.29,420 కోట్లు వచ్చాయి. వచ్చే సంవత్సరం అంతకంటే పెరుగుతాయని సాధారణంగా అందరూ భావిస్తారు. అయితే 2021–22కి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రూ.26,935 కోట్లేనని స్పష్టం చేశారు. దీంతో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నట్లు స్పష్టం అవుతోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.    

కరువు ప్రాంతాలకు రూ.100 కోట్లు
వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని ఏపీ వంటి రాష్ట్రాలు కేంద్రంతో కలిసి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని సూచించింది. ఈ దిశగా కరువు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు నిధులు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు కేటాయించింది.

పెరుగుతున్న వడ్డీల భారం
ఏపీపై వడ్డీ భారం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2011–12 నుంచి 2013–14 వరకు రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 1.4 %గా మాత్రమే ఉన్న వడ్డీ భారం.. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2014–15లో 1.5%గా, 2015–16లో 1.6%, 2016–17, 2017–18లో 1.7%, 2018–19లో 1.8%, 2019–20 (ఆర్‌ఈ)లో 
1.7 %, 2020–21లో(బీఈ)లో 1.8%గా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement