కొంచెం ఖేదం.. కొంచెం మోదం | No Mention About Polavaram And Division Guarantees In Budget 2021 | Sakshi
Sakshi News home page

కొంచెం ఖేదం.. కొంచెం మోదం

Published Tue, Feb 2 2021 3:45 AM | Last Updated on Tue, Feb 2 2021 8:49 AM

No Mention About Polavaram And Division Guarantees In Budget 2021 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రోలియం వర్సిటీ మినహా, విభజన హామీలకు సంబంధించి కేంద్ర తాజా బడ్జెట్‌లో పెద్దగా ప్రస్తావన లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ వర్సిటీకి రూ. 60.35 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.26.90 కోట్లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ)కి రూ.95 కోట్లు కేటాయించారు. ఇక ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థలకు విద్యా సంస్థల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేయలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐఎస్‌ఈఆర్‌లకు రూ.946 కోట్లు కేటాయించింది. ఐఐఎంలకు రూ.476 కోట్లు, ఎన్‌ఐటీలు–ఐఐఈఎస్టీలకు రూ.3,935 కోట్లు, ఐఐటీలకు రూ.7,536 కోట్లు కేటాయించింది.

మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల ప్రస్తావన లేదు. దేశ వ్యాప్తంగా కొచ్చి మెట్రో రైల్‌ నెట్‌వర్క్, చెన్నై మెట్రో రైల్‌ నెట్‌వర్క్, బెంగళూరు, నాగ్‌పూర్, నాసిక్‌ మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. రాజధాని నిధుల గ్రాంట్లు, పోలవరం ప్రాజెక్టుకు రీయింబర్స్‌మెంట్, పునరావాస నిధుల కేటాయింపు, దుగరాజపట్నం పోర్టుకు యోగ్యత లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, కడపలో స్టీలు ప్లాంటు నిర్మాణానికి నిధులు, విశాఖలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, ఎయిమ్స్‌కు నిర్దిష్ట కేటాయింపులు లేవు. ఐదు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సంస్థలకు రూ.133.17 కోట్లు కేటాయించగా.. ఇందులో ఏపీకి చెందిన సంస్థ కూడా ఉంది. విశాఖపట్నం–రాయపూర్‌ మధ్య 464 కి.మీ.మేర రహదారి అభివృద్ధి పనులు 2021–22లో ప్రారంభిస్తామని చెప్పారు.  

సరుకు రవాణా కారిడార్ల అభివృద్ధి 
రైల్వే శాఖకు సంబంధించి ఈస్ట్‌ కోస్ట్‌ కారిడార్‌ పేరిట ఖరగ్‌పూర్‌ నుంచి విజయవాడ, నార్త్‌ సౌత్‌ కారిడార్‌ పేరిట ఇటార్సి నుంచి విజయవాడ ఫ్రైట్‌ కారిడార్‌ ప్రాజెక్టులకు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు తొలిదశలో చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. రూ.1.03 లక్షల కోట్లతో తమిళనాడులో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా చిత్తూరు నుంచి తట్చూర్‌కు జాతీయ రహదారి అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

ఐఈబీఆర్‌ కింద నాబార్డుకు రూ.5,130 కోట్లు
ఇంటర్నల్, ఎక్స్‌ట్రా బడ్జెటరీ రిసోర్సెస్‌ (ఐఈబీఆర్‌) కింద నాబార్డుకు రూ.5,130 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా నిధులు సమకూర్చనున్నట్టు కేంద్రం తెలిపింది. సొసైటీ ఫర్‌ అప్లయిడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, రీసెర్చి (సమీర్‌) కేంద్రాలకు రూ.120 కోట్ల మేర నిధులు కేటాయించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ గుర్తింపు పొందిన సైంటిఫిక్‌ సొసైటీ.. మైక్రోవేవ్స్, మిల్లీమీటర్‌ వేవ్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్‌ సాంకేతిక రంగాల్లో పని చేస్తుంది. ఈ సాంకేతికత అనువర్తనాలు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్నం, ముంబై, చెన్నై, కోల్‌కతా, గువాహటిల్లో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

విశాఖలో ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి
విశాఖపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. మొత్తం ఐదు మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు, ప్రజలకు మధ్య వారధిగా పని చేయడానికి, బాధలో ఉన్న మహిళలను ఓదార్చడానికి వారికి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా మహిళా పోలీసు వలంటీర్ల నియామకానికి కేంద్రం అనుమతించింది. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో వీటి ఏర్పాటుకు అనుమతించినా, నిధులు కేటాయించలేదు. 

ఈఏపీ ప్రాజెక్టులకు విదేశీ రుణాలు
ఏపీలో మొత్తం పది ప్రాజెక్టులకు విదేశీ రుణాల కింద రూ.15,518.76 కోట్లు రానున్నాయి. ఈ మేరకు కేంద్రం పూచీకత్తు ఇవ్వనుంది. ఆయా ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
► విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్రాజెక్టు–1 ఏడీబీ నుంచి రూ.1,160.77 కోట్లు.
► 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా ప్రాజెక్టుకు ఏఐఐడీ నుంచి రూ.159 కోట్లు.
► 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా ప్రాజెక్టుకు ఐబీఆర్‌డీ నుంచి రూ.367.10 కోట్లు.
► గ్రామీణ రోడ్ల ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.1,160 కోట్లు.
► ఏపీ అర్బన్‌ వాటర్‌ సప్లై సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ఇంఫ్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.2,056.75 కోట్లు.
► గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌–ఇంట్రా స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌కు డెన్మార్క్‌ ప్రభుత్వం నుంచి రూ.363.99 కోట్లు.
► ఇరిగేషన్‌ అండ్‌ లైవ్‌లీహుడ్‌ ఇంఫ్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (ఫేజ్‌–2)కు జపాన్‌ ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు.
► ఆరోగ్య వ్యవస్థ బలోపేతం ప్రాజెక్టుకు ఐబీఆర్‌ నుంచి రూ.9,772.15 కోట్లు.
► డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టుకు ఐడీఏ నుంచి రూ.139 కోట్లు.
► ఏపీ ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టుకు ఐబీఆర్‌డీ నుంచి రూ.140 కోట్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement