న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం అత్యంత ప్రాముఖ్యత నిచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలలో మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేల కోట్ల రూపాయలు ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడుల్లో అధికారంలోకి రావడం, అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం దిశగా ఈ కేటాయింపులు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్‌లో రోడ్ల అభివృద్ధికి రూ. 25 వేల కోట్లను నిర్మల కేటాయించారు. ఈ నిధులతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇది కోల్‌కతా–సిలిగురి హైవే పునరాభివృద్ధి కోసం అంటూ ఆమె బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ కేటాయింపులను ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలంతా బల్లలు చరుస్తూ స్వాగతించారు. ఉత్తర బెంగాల్‌లోని 54 అసెంబ్లీ సీట్లలో 50 గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఈ కేటాయింపులు చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: మౌలిక ప్రాజెక్టులకు ‘మానిటైజేషన్’ ఊతం
కేరళకు భారీగా నిధులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కేరళలో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తున్న దిశగా.. ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు భారీగా కేటాయించారు. రూ. 65 వేల కోట్లను రోడ్ల అభివృద్ధికి కేటాయిస్తూ ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది. ఈ నిధులతో 1,100 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించనున్నారు. కొచ్చి మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగంగా 11.5 కిలోమీటర్ల ట్రాక్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 1,957.05 కోట్లను కేటాయించారు. ముంబై, కన్యాకుమారి ఆర్థిక కారిడార్ నిర్మాణంలో భాగంగా కేరళలో రూ. 50 వేల కోట్లతో 650 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు గత అక్టోబర్‌లో కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. కేరళ అభివృద్ధికి జీవనరేఖగా పేర్కొంటున్న ఈ కారిడార్‌లో కొల్లం, ఎర్నాకులం, కన్నూర్, తలసేరి, కోజికోడ్, కాసర్‌గాడ్, త్రివేండ్రం వంటి ప్రముఖ పట్టణాలు ఉన్నాయి. చదవండి: కొంచెం ఖేదం.. కొంచెం మోదం
తమిళనాడుకు లక్ష కోట్లు..
త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడుపై కేంద్ర బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. 3,500 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ. 1.03 లక్షల కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో మధురై–కొల్లం ఆర్థిక కారిడార్ నిర్మాణం కూడా ఉంటుంది. కొచ్చి, చెన్నై, విశాఖపట్నం ఫిషరీస్ హబ్‌తో పాటు వివిధ ఉపయోగాలు ఉండే సముద్ర కలుపు పార్క్‌ను కూడా ఈ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న సముద్ర కలుపు సేద్యంతో తీర ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి’’అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో చెప్పారు. సముద్ర కలుపు పెంపకం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకంలో భాగంగా రూ. 637 కోట్లు కేటాయించారు. మరోపక్క చెన్నై మెట్రో ప్రాజెక్టుకు రూ. 1,957 కోట్లు ప్రకటించారు.
అసోంలో మరోసారి అధికారానికి..
పౌరసత్వ సవరణ చట్టాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకిస్తున్న అసోంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఆ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ. 3,400 కోట్లు కేటాయించారు. నిర్మల మాట్లాడుతూ.. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రూ. 19 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతోందని, వచ్చే మూడేళ్లలో 1,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, రోడ్లు, బ్రిడ్జీల అభివృద్ధికి తమ శాఖ రూ.80 వేల కోట్లు కేటాయించిందని గత అక్టోబర్‌లో అసోంలో పర్యటించిన సందర్భంగా నితిన్ గడ్కరీ వెల్లడించారు. బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని హైవే నిర్మాణం, ద్వీపంలా ఉండే ప్రాంతం మజూలీ నుంచి జోర్హాట్ జిల్లాను కలిపే బ్రిడ్జి నిర్మాణం ప్రాజెక్టులను ఇప్పటికే ప్రకటించారు.
పోచంపల్లి చీరలో మెరిసిన నిర్మల
చేనేత వస్త్రాలపై తన మమకారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రదర్శించారు. ఎరుపు, తెలుపు చీరకు పచ్చటి అంచు ఉన్న పోచంపల్లి సిల్క్ చీరలో పార్లమెంట్‌కు హాజరై అందర్నీ ఆకట్టుకున్నారు. పోచంపల్లి ఇక్కత్‌గా పిలిచే ఇలాంటి చీరలను తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో నేస్తారు. ఇలాంటి చీరలను 1970లలో నేసేవారమని పోచంపల్లి.కామ్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ చీరలను కాటన్, సిల్క్‌లతో నేస్తారని తెలిపారు. కాగా, బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల ధరించిన చీర కూడా వార్తల్లోకి ఎక్కింది. లాల్‌పాడ్‌గా పిలిచే ఈ చీరను పశ్చిమ బెంగాల్‌లో పూజా కార్యక్రమాలు, ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తారు. సగం తెలుపు, సగం ఎరుపు రంగులు ఉన్న ఇలాంటి చీరలను దుర్గా పూజ, సింధూర్ ఖేలా లాంటి కార్యక్రమాల్లో ధరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment