‘సాగు’పై మరింత స్పష్టత అవసరం | Siraj Hussain Guest Column On Budget 2021 | Sakshi
Sakshi News home page

‘సాగు’పై మరింత స్పష్టత అవసరం

Published Sat, Jan 30 2021 12:58 AM | Last Updated on Sat, Jan 30 2021 4:39 AM

 Siraj Hussain Guest Column On Budget 2021 - Sakshi

వ్యవసాయ మార్కెటింగ్‌ను సమూలంగా మార్చివేస్తూ కేంద్రప్రభుత్వం గత సంవత్సరం చివరలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటూ ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా హింసాకాండను ప్రేరేపించిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళన అందరి దృష్టిని ఆకర్షించటం సరేసరి.. కానీ ప్రభుత్వం వైపున జరుగుతున్న కొన్న పాలనాపరమైన విధానాలు సంస్కరణలను దాచిపెడుతూ బడ్జెట్‌లో చూపకపోవడం చాలా సమస్యలకు దారితీస్తోంది. గత రెండేళ్లుగా కేంద్రప్రభుత్వం తీసుకున్న అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను బడ్జెట్లలో ప్రకటించలేదని గుర్తుంచుకోవాలి.

వాస్తవానికి ఎరువులు, విద్యుత్‌ సబ్సిడీ, నీటి వనరుల నిర్వహణలో కేంద్రం గతంలో ఎన్నడూ లేనంత మంచి మార్పులను తీసుకొచ్చింది. మండీల్లో మౌలిక వసతులు కల్పించడానికి పెద్ద మొత్తాన్నే కేంద్రం కేటాయించినప్పటికీ మండీలను కార్పొరేట్లకు అప్పగిస్తారనే భయాలే రైతులను ఆందోళనవైపు నెట్టాయి. ప్రభుత్వం కాస్త పారదర్శకత ప్రదర్శించి ఉంటే సాగు సంస్కరణ చట్టాలపై భయాలు తొలిగేవి. నేడు పార్లమెంటులో సమర్పించనున్న తాజా బడ్జెట్‌ సాగుకు సంబంధించిన కీలక అంశాలపై మరింత స్పష్టత ఇస్తుందని ఆశిద్దాం.

ప్రస్తుత రైతు సంఘాల ఆందోళన దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెను కష్టాలపై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కానీ వచ్చే దశాబ్దం పొడవునా భారత్‌ అనుసరించే సంస్కరణలు నడిచే మార్గాన్ని ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌ బహుశా వెల్లడించకపోవచ్చు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను బడ్జెట్లు ప్రకటించలేదని గుర్తుంచుకోవాలి. అందుకనే కార్పొరేట్‌ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతం దాకా తగ్గించిన వైనాన్ని 2019 సెప్టెంబర్‌ 20న మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తప్పితే అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేర్కొనలేదు.

భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌–19 తీవ్ర ప్రభావం చూపుతున్న దశలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అయిదు ప్రెస్‌ కాన్ఫరెన్సులు నిర్వహించి అయిదు ప్యాకేజీలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించారు. వీటిని ప్రధాన్‌ మంత్రి ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా నరేంద్రమోదీ అంతకుముందే ప్రకటించి ఉన్నారు. ఈ 5 ప్యాకేజీలలో 20 లక్షల కోట్ల రూపాయల నగదును కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది.

వ్యవసాయ ప్యాకేజీలో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు ప్రకటనలు గుప్పించారు. వీటిలో అత్యవసర సరుకుల చట్టం (ఈసీఏ) 1955కు సవరణతోపాటు వ్యవసాయ మార్కెటింగ్‌ను క్రమబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న చట్టాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనకు తెలిసిందే. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో జరగాల్సిన మూడు ప్రధాన మార్పుల గురించి సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అవేమిటంటే ఎరువుల సబ్సిడీ, విద్యుత్‌ సబ్సిడీ, నీటివనరుల నిర్వహణ. 

ఎరువుల సబ్సిడీ
2020 నవంబర్‌ 12న కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి ఒక ప్రకటన చేస్తూ ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ. 65 వేల కోట్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఇది 2020–21 సంవత్సరానికి గాను బడ్జెట్‌లో కేటాయిం చిన రూ. 71,309 కోట్ల మొత్తానికి అదనం అన్నమాట. 2020 ఏప్రిల్‌ 1న ఎరువుల కంపెనీలు రూ. 48 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ బకాయిలను పొందాయి. అనేక సంవత్సరాలుగా ఫెర్టిలైజర్‌ కంపెనీలకు తాము అందించిన ఎరువులకు సబ్సిడీ రూపంలో రావలసిన మొత్తాలను ప్రభుత్వం చెల్లించడం లేదు.

ఎరువుల సబ్సిడీ బకాయిలను చెల్లించడానికి అదనపు గ్రాంట్‌ని మంజూరు చేస్తూ ప్రొవిజన్‌ రూపొందించటం బహశా అసాధారణమైంది. ఇది బడ్జెట్‌ పరంగా మంచి ప్రతిపాదన అని చెప్పాలి. జీడీపీ 7 శాతానికి పడిపోయిన సంవత్సరంలో పరిశ్రమ వర్గాలు అలాంటి ప్రయోజనం తమకు లభిస్తుందని కనీసం ఊహించలేకపోయాయి. 2020–21కిగాను కేంద్ర బడ్జెట్‌ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ. 26.33 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినందున వాస్తవ సేకరణ రూ. 19.33 లక్షల కోట్లకే పరిమితం కావచ్చు. అంటే బడ్జెట్‌ అంచనాల కంటే ఇది 26.6 శాతం తక్కువ అన్నమాట. ఇలాంటి తరుణంలో ఎరువుల పరిశ్రమకు అదృష్టం తలుపు తట్టినట్లే అని స్పష్టమవుతుంది.

ఎరువుల కంపెనీలకు సబ్సిడీ కింద బకాయిలను చెల్లించడం అనేది ఎరువుల సబ్సిడీ నిర్వహణలో అతిపెద్ద సంక్షేమ చర్యగానే చెప్పాలి. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా ఎరువుల సబ్సిడీని బదిలీ చేసే విషయంలో ముందుకెళుతుందని చెప్పలేము. కౌలు రికార్డులు కనిపించని సందర్భంగా వాస్తవంగా వ్యవసాయం చేసేవారికి కాకుండా భూ యజమానికి మాత్రమే ప్రత్యక్ష నగదు బదిలీ అందుతుంది.

రెండు... ఎరువుల ప్రస్తుత వినియోగం, అందుతున్న వివిధ సబ్సిడీలు రాష్ట్రాలకు సంబంధించి వేరువేరుగా ఉంటున్నాయి. పంజాబ్, హరియాణాలో 2018–19 సంవత్సరంలో హెక్టారుకు 224.5 కేజీల మేరకు ఎరువులను వాడుతుండగా ఒడిశాలో హెక్టారుకు 70.6 కేజీల ఎరువును వినియోగిస్తున్నారు. అదే జమ్మూ కశ్మీరులో 61.9 కేజీల ఎరువును మాత్రమే ఉపయోగిస్తున్నారు. అలాగే పండిస్తున్న పంటలు, సాగు చేస్తున్న భూమిపై ఆధారపడి ఎరువుల వినియోగం ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని రైతులకు ఎరువుల సబ్సిడీ కింద ఏకరూప మొత్తాన్ని స్థిరపర్చడం ఏమంత సులభం కాదు. నూతన వ్యవసాయ చట్టాల అమలుపై తీవ్ర వ్యతిరేకత కారణంగా వ్యవసాయంతో సంబంధం ఉన్న అందరినీ సంప్రదించడానికి కేంద్ర ప్రభుత్వం మరింత గట్టిగా ప్రయత్నాలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఎఫ్‌సీఐ బకాయిలు 
2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కీలకమైన రెండో అంశం ఆహార సబ్సిడీ. దీని ఫలితంగా సబ్సిడీ బకాయిలు అమాంతంగా పెరిగిపోయాయి. భారత ఆహార సంస్థకు చెల్లిం చాల్సిన బకాయిలు 2018  మార్చి 31 నాటికి రూ 1,35,514.52 కోట్లు కాగా అది 2020 మార్చి 31 నాటికి రూ. 2,42,905 కోట్లకు పెరిగిపోయింది. ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద గోధు మలు, బియ్యం అదనపు కేటాయింపుల కారణంగా ఈ సంవత్సరం 315.2 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా సరఫరా చేయాల్సి వచ్చింది. దీని ఫలితంగా 2021 మార్చి 31 నాటికి ఎఫ్‌సీఐకి చెల్లించాల్సిన బకాయిలు రూ. 3,48,808 కోట్లకు పెరిగాయి.
ఆహార ధాన్యాల సేకరణ విషయంలో వికేంద్రీకరణ అమలైన రాష్ట్రాల్లో ఆహార సబ్సిడీపై బకాయిలు ఎంత అనేది ఇప్పటికీ తెలియడం లేదు.

పీఎం కిసాన్, ఎపీఎంసీలు
వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపు (2020–21లో రూ. 75,000 కోట్లు) పీఎం కిసాన్‌ కోసం జరుగుతోంది. ప్రభుత్వం ఈ కేటాయింపును తగ్గిస్తుందని భావించడం కల్లోమాటే. తాజా బడ్జెట్‌లో ఆశ్చర్యకరమైన అంశం ఏదంటే ఎపీఎంసీ మండీల మౌలిక వసతుల కల్పనను మెరుగుపర్చడానికి తీసుకొస్తున్న కొత్త పథకమే. డ్రైయింగ్, సార్టింగ్, గ్రేడింగ్, స్టోరేజ్‌ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా దీంట్లో భాగమై ఉంటాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఆందోళన అంతా ఈ మండీలనుంచి వ్యాపారం మొత్తంగా వాణిజ్య విభాగాలకు వెళుతుందనే. ఏపీఎంసీలకు తగుమాత్రం బడ్జెట్‌ కేటాయింపులు చేస్తే ఎపీఎంసీ మండీలను బలహీన పర్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తుంది. పైగా మండీలు కొనసాగడానికి ఇది తోడ్పడటమే కాకుండా వాణిజ్య ప్రాంతాలకు మంచి పోటీని కూడా ఈ చర్య తోడ్పడుతుంది.

ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఏఎమ్‌పీసీలలో చార్జీలు ఇతర రుసుములను బాగా తగ్గిం చారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాథమిక మార్కెటింగ్‌లో ప్రథమ అవకాశంగా ఈ మండీలే ముందుపీఠిలో ఉంటాయి. పోతే పౌల్ట్రీ, మత్య పరిశ్రమ సంవత్సరానికి 8 శాతం వృద్ది రేటును నమోదు చేస్తున్నాయి. అది కూడా ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహకాలు లేకుండానే ఈ రెండు రంగాలు ఇంత వృద్ధిరేటును సాధిస్తున్నాయి. భారతదేశంలోని అన్ని మెట్రో పాలిటన్‌ నగరాల్లో వీటికి అత్యాధునిక మార్కెటింగ్‌ సౌకర్యాలను కల్పించడం ఎంతైనా అవసరం. చివరగా, భారత్‌లోని నీటి వనరుల ఎద్దడి ఎదుర్కొంటున్న జిల్లాల్లో వరి, చెరకు పంటలు పండిస్తున్న ప్రాంతాలను తగ్గించడంలో స్పష్టమైన విధానాలను అమలుచేయడం తప్పనిసరి చేయాలి. అలాంటి వైవిధ్యీకరణకు తగిన రోడ్‌ మ్యాప్‌ అమలుకు కేంద్రం, ఆయా రాష్ట్రాలు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించాల్సి ఉంది.

సిరాజ్‌ హుస్సేన్‌ – కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి
జుగల్‌ మహాపాత్ర – కేంద్ర ఎరువుల శాఖ మాజీ కార్యదర్శి
(ది వైర్‌ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement